ఆ ఇద్దరు అలా.. కలిసారు !

Sharing is Caring...

Bharadwaja Rangavajhala………………………………

“కుల‌ము… కుల‌ము ….కుల‌మ‌నే పేరిట మ‌న భార‌త‌దేశ‌మున ఎంద‌రి ఉజ్వ‌ల‌భ‌విష్య‌త్తు భ‌గ్న‌మౌతోంది.ఎంద‌రు మేధావుల మేధ‌స్సు తక్కువ కులంలో పుట్టార‌నే కార‌ణాన అడవి కాచిన వెన్నెల అవుతోంది.నేను సూత పుత్రుడ‌ననేగా ఈ లోకం నన్ను చూచి వెకిలిగా కూస్తోంది.

నీ కుమార పంచ‌కాన్ని కాపాడుకోవాల‌నే మాతృప్రేమ‌తో వ‌చ్చిన నీకు ఈనాడు క‌ర్ణుడు కౌంతేయుడ‌య్యాడు. వీడు నీ వ‌రాల తండ్రి కాదు. తెలిసీ తెలియ‌ని ప‌డుచుత‌న‌పు ఉన్మాదంలో దూర్వాస‌ద‌త్త‌మైన మంత్ర శ‌క్తిని ప‌రీక్షించ‌ద‌ల‌చిన నీ పాప‌పు పంట వీడు.

లోకాప‌వాదానికి వెర‌చి క‌న్న బిడ్డ‌ను గంగ‌పాలు చేసిన గొడ్రాలువి నువ్వు. ఈ నాడు నా త‌ల్లిన‌ని చెప్పుకోడానికి వ‌చ్చావా? నాడు కురుకుమారుల అస్త్ర‌ ప‌రీక్షా స‌మ‌యంలో వీడు సూత‌పుత్రుడు వీడు సూతుడు అని రాజ‌లోక‌మంతా అప‌హాస్యం చేస్తుంటే .. కాదు వీడు సూతుడు కాదు నా బిడ్డ కౌంతేయుడు అని ఎలుగెత్తి చెప్ప‌లేక‌పోయావే?

నీ అభిమానం అడ్డం వచ్చిందా? లేదా అర్జునుని మీద ఉన్న మ‌మ‌కారం నీలో మాతృత్వాన్ని మ‌టుమాయం చేసి వాగ్బంధ‌నం చేసిందా? కురు సార్వ‌భౌముడు న‌న్ను స‌న్మానించి అంగ‌రాజును చేసి నా శ‌స్త్రాస్త్ర శ‌క్తి మీద న‌మ్మ‌కం ఉంచి కౌర‌వ‌సేన‌కు క‌ర్ణుడే సార‌ధి అని త్రిక‌ర‌ణ‌శుద్దిగా విశ్వ‌సిస్తున్నాడు. ఇది నా కృత‌జ్ఞ‌త‌కూ మిత్ర‌త్వానికీ ప‌రీక్షా స‌మ‌యం. నాకీ త‌నువిచ్చిన త‌ల్లి కోరిక నిరాక‌రిస్తున్నాన‌ని నాకు తెల్సు. అయినా ఇది నా క‌ర్త‌వ్యం. ఇదే నా ధ‌ర్మం.”

క‌థానాయ‌కుని క‌థ చిత్రంలో క‌ర్ణుడి పాత్ర‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగు ఇది. రాసింది మోదుకూరి జాన్స‌న్. ఈ సీన్ షూట్ అయ్యాక … ఎన్టీఆర్ … జాన్స‌న్ ను ఓ సారి కార్యాల‌యానికి రండి అని పిల్చారు. జాన్స‌న్ మ‌ర్నాడు వెళ్లారు. నిన్న మీరు రాసిన డైలాగు చూసాక వ‌చ్చిన ఆలోచ‌న ఇది.

నాకు చాలా కాలంగా ఇలా ఆనాడు జ‌రిగిన భావ విప్ల‌వం గురించి ఓ సినిమా తీయాల‌నే కోరిక ఉంది … దాన్ని తీర్చేందుకు అనువైన ర‌చ‌యిత కోసం చూస్తున్నాను. మీరు క‌నెక్ట్ అయ్యారు. మీరు స‌రే అంటే మ‌నం క‌ర్ణ పాత్ర నేప‌ధ్యంలో … స్క్రిప్టు ర‌డీ చేద్దాం … అన్నారు జాన్స‌న్ వైపు చూసి. 

అయ్యా … మీరు చెప్పింది వింటుంటే మీతో ట్రావెల్ అయ్యే అవ‌కాశం ఉన్న అవ‌స‌ర‌మైన ర‌చ‌యిత ఒక‌రు నా మ‌న‌సులో మెదిలారు … వారి పేరు కొండ‌వీటి వేంక‌ట‌క‌వి. ఆయ‌న చార్వాక ప‌త్రిక‌లో రెగ్యుల‌ర్ గా వ్యాసాలు రాస్తున్నారు. నేను ఇప్పుడు కొన్ని సినిమాలు క‌మిట్ అయి ఉన్నాను. వారిని కాద‌ని చెప్ప‌లేను.

అన్నీ స‌గం స‌గం మొద‌లై ఉన్నాయి. క‌నుక మీరు స‌రే అంటే వేంక‌ట క‌విగారిని మీకు ప‌రిచ‌యం చేస్తాను అన్నారు జాన్స‌న్ … ఆయ‌న గురించి నాకూ తెల్సు అన్నారు ఎన్టీఆర్.  ఆయ‌న మా ఊరి ద‌గ్గ‌ర్లో ఉన్న చిట్టిగూడూరు సంస్కృత క‌ళాశాల‌లోనే చ‌దువుకున్నారు. అయినా మీరు వారితో మాట్లాడి … స‌మ‌న్వ‌య‌ప‌ర‌చండి … అని స‌మావేశం ముగించారు ఎన్టీఆర్.

అలా దాన‌వీర‌శూర క‌ర్ణ రూప‌క‌ల్ప‌న వెనుక మోదుకూరి జాన్స‌న్ పాత్ర ఉంద‌న్న‌మాట ..ఈ విష‌యం ఎన్టీఆరే స్వయంగా కొండ‌వీటి వెంక‌ట‌క‌వి స‌న్మాన‌స‌భ‌లో వెల్ల‌డించారు. ఆ రోజున జాన్సన్ వేంకటకవి ని ఎన్టీఆర్ కి అలా పరిచయం చేయడం మూలానే దానవీర శూర కర్ణ, శ్రీమద్ విరాట పర్వం, బ్రహ్మం గారి చరిత్ర వంటి సినిమాలు రూపుదిద్దుకున్నాయి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!