Small controversy……..
దర్శకుడు భారతీరాజా, సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబినేషన్లో కేవలం 2 సినిమాలు మాత్రమే వచ్చాయి. వీరిద్దరి మధ్య దశాబ్దాల పాటు ఒక తీవ్రమైన భావజాల వివాదం (గొడవ) నడిచింది.
16 వయతినిలే (1977) భారతీరాజా దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇది. ఇందులో కమల్ హాసన్ హీరో కాగా, రజనీకాంత్ ‘పరట్టై’ అనే ఐకానిక్ విలన్ పాత్రను పోషించారు. ఈ చిత్రమే రజనీకాంత్‌కు నటుడిగా పెద్ద బ్రేక్ ఇచ్చింది.కోడి పరక్కుతు (1988): రజనీకాంత్ హీరోగా భారతీరాజా తెరకెక్కించిన యాక్షన్ చిత్రం ఇది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత ఇద్దరూ కలసి పని చేయలేదు.
2002 లో కావేరి నదీ జలాల వివాదం నేపథ్యంలో రజనీ కాంత్ ఫై విమర్శలు వచ్చాయి.రజనీకాంత్ పుట్టి పెరిగింది బెంగళూరులో (కన్నడ నేపథ్యం). భారతీరాజా తీవ్రమైన తమిళ వాద భావాలు గల వ్యక్తి. రజనీకాంత్ తమిళనాడులో సూపర్ స్టార్ అయినప్పటికీ, ఆయనను పరాయి రాష్ట్రానికి చెందిన వ్యక్తిగానే భారతీరాజా చూసేవారు.
తమిళనాడు,కర్ణాటకల మధ్య కావేరి నీటి సమస్య తలెత్తినప్పుడు, రజనీకాంత్ తమిళనాడుకు మద్దతుగా గట్టిగా మాట్లాడటం లేదని భారతీరాజా ఆరోపించారు.”రజనీకాంత్ కర్ణాటకకు ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారు” అంటూ మీడియా ముందు బహిరంగంగా విమర్శించారు.
భారతీరాజా విమర్శించిన మరుసటి రోజే, రజనీకాంత్ చెన్నైలో ఒంటరిగా 9 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టారు. తమిళనాడుకు కావేరి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2008 లో కావేరి సమస్యపై చెన్నైలో జరిగిన నడిగర్ సంగం (నటీనటుల సంఘం) నిరసనలో రజనీకాంత్ కర్ణాటక నాయకులను ఉద్దేశించి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఆ వ్యాఖ్యల పట్ల ఆగ్రహించిన కర్ణాటక కన్నడ సంఘాలు అక్కడ ఆయన సినిమా ‘కుసేలన్’ (కథానాయకుడు) విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించాయి. ఆ తర్వాత కొద్దిరోజులకు వివాదం సర్దుమణిగింది.
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినప్పుడు భారతీరాజా తీవ్రంగా వ్యతిరేకించారు. “ఎవరైనా తమిళనాడుకు వచ్చి సంపాదించుకోవచ్చు, కానీ తమిళులను పరిపాలించాల్సింది మాత్రం పక్కా తమిళుడే (తమిళ్ మగన్) అవ్వాలి” అంటూ రజనీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
చెన్నైలో ఐపీఎల్ నిరసనల సమయంలో కొందరు ఆందోళనకారులు పోలీసులపై దాడి చేశారు. ఆ దాడిని రజనీకాంత్ తీవ్రంగా ఖండించగా, భారతీరాజా మాత్రం రజనీకాంత్‌పై విమర్శలు చేస్తూ, ఆయన తమిళుల పోరాటాన్ని తక్కువ చేస్తున్నారని మండిపడ్డారు.
భారతీరాజా ఇన్నిసార్లు విమర్శించినా రజనీకాంత్ ఎప్పుడూ ఆయనపై ఎదురుదాడి చేయలేదు లేదా కోపం ప్రదర్శించలేదు. ఒక ఈవెంట్‌లో రజనీ మాట్లాడుతూ, “భారతీరాజాని నేను గొప్ప దర్శకుడిగా ఎప్పుడూ ఒప్పుకుంటాను, గౌరవిస్తాను. కానీ ఆయన మాత్రం నన్ను ఒక నటుడిగా ఇప్పటికీ గుర్తించరు” అని చిన్న కౌంటర్ మాత్రమే ఇచ్చారు.
ఇద్దరు ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఒకరినొకరు గౌరవించుకున్నారు. ఇద్దరూ కూడా వ్యక్తిగతంగా విమర్శించుకోలేదు.. భారతీరాజా మరణించిన రోజున రజనీకాంత్ తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు, తమ 50 ఏళ్ల స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు.

