CROSSING BRIDGES’… క్రాసింగ్ బ్రిడ్జెస్ అరుణాచల్ ప్రదేశ్ సినిమా ఇది . సినిమా మొదలవటమే, బస్ ప్రయాణం.కథానాయకుడు తాషి[ఫుంత్సు ఖ్రిమే]బస్ లో అరుణాచల్ ప్రదేశ్ లోని తన స్వగ్రామానికి తిరిగి వస్తూ ఉంటాడు.బస్ అందమైన హిమాలయ పర్వతాలలో, అనేక వంతెనలు దాటుతూ, ప్రయాణిస్తుంది.
ముప్పయి ఏళ్ల తాషి బొంబాయి మహానగరంలో వెబ్ డిజైనర్ వుద్యోగం చేస్తుంటాడు. అనుకోకుండా ఆ ఉద్యోగం పోతుంది. దీంతో కొన్నాళ్ళు తల్లిదండ్రులతో కలిసి సొంతూర్లో గడపాలని వస్తాడు.బస్ దిగి,అప్పటికే ఎదురు చూ స్తున్నమిత్రునితో కలిసి కొండలు,అడవులతో నిండిన సన్నని కాలిబాటల్లో నడుస్తూ ఇంటికి బయలు దేరుతాడు.
దారిలో ఎదురైనా ఒక కట్టె దుంగ వంతెన దాటటానికి చాలా భయపడతాడు.మిత్రుడు చేయందిస్తూ,నువ్వు చాలా మారిపోయావు అంటాడు.అంటే ఒకానొక రోజుల్లో ఇవన్నీ నువ్వు దాటిన వంతెనలే కదా అని. ఈ సీన్ దగ్గరకు వచ్చేసరికి నేనూ నా బాల్యం గుర్తు చేసుకున్నాను.
నేనూ అంతే, మా పొలం వెళ్ళేదారిలో వుండే,తాటిదుంగల వంతెనలు దాటాలంటే భయంతో వణికిపోయేదాన్ని.కింద వేగంగా పారుతున్న నీళ్ళలో పడిపోతానేమోనని..మా అక్కలిద్దరూ, ముందొకరు,వెనుకొకరు పట్టుకుని వుంటే,కళ్ళు మూసుకుని దాటి,బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకునేదాన్ని.
బొంబాయి లాంటి అత్యాధునిక నగరాన్ని వదిలి రోజు మొత్తం మీద ఒక గంట మాత్రమే కరెంట్ వుండే తన సొంత వూరికి వచ్చిన తాషికి రోజులు గడవటం చాలా కష్టంగా వుంటుంది.బొంబాయి ‘టీ’కి అలవాటు పడ్డ అతనికి,తల్లి ఇచ్చే ‘సంప్రదాయ బట్టర్ టీ వెగటనిపిస్తుంది.
హిమాలయాలకు దగ్గరగా వుండటం వలన,చలి తట్టుకోవటం కోసం ఇంట్లో రోజంతా నెగడు మండుతూనే వుంటుంది.దాన్నుండి వచ్చే పొగకు తాషి ఉక్కిరి బిక్కిరి అవుతుంటాడు.ఫోన్ సిగ్నల్స్ వుండవు.ఎత్తైన కొండకొమ్మున వున్న బుద్ధా రాక్ దగ్గరకు ఎక్కితేనే ఎప్పుడైనా సిగ్నల్స్ అందుతాయి.
తల్లిదండ్రులిద్దరూ పొలం పనుల్లో,పశువుల పెంపకం లో తలమునకలవుతుంటారు.అప్పుడప్పుడూ దగ్గరలో వున్న’’బొమ్డిక్’అనే చిన్న పట్టణానికి తన స్నేహితుడు, పెమా బండి మీద వెళ్ళి,బొంబాయి లో వున్న తన మిత్రుడు అమిత్ కి,STD కాల్ చేసి త్వరగా తనకో కొత్త వుద్యోగం చూడమని చెబుతుంటాడు.
అలా వెళ్ళినపుడే బ్యాటరీతో నడిచే టివి తెస్తాడు.అప్పటివరకూ కాయకష్టం చేసే తండ్రి టివి మోజులో పడి,రోజంతా టివి ఎదురుగానే ఉంటాడు.దాంతో తల్లికి పనిభారం పెరుగుతుంది.ఒంటరిగా చెక్క బెంచిపై విచారంగాకూర్చుని, టీ తాగుతున్న తల్లి దగ్గరకు తాషి వస్తాడు.తల్లి’ ఇది రోజు మొత్తం మీద నాకు చాలా ఇష్టమైన సమయం.ఎందుకంటే రోజంతా కష్టపడి పనిచేసే మేము ఈ సమయంలోనే ఇద్దరం కాస్త విశ్రాంతిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతాము.
ఇప్పుడు మీ నాయన కష్టం తెలియకుండా టివి ఎదురుగా కూర్చుని వుంటే ఇక్కడ నేనొక్కదాన్నే టీ తాగుతున్నాను’.టివి ఇంటికి వచ్చి మా ఆనందాన్ని దూరం చేసింది’అంటుంది.తాషి గూడా క్రమంగా ఇంటిపనుల్లో పాలు పంచుకుంటూ ఉంటాడు.వూర్లో జరిగే జాతరలో పాల్గొంటాడు.వూరికి అలవాటు పడుతూ ఉంటాడు..
తండ్రి ఇంట్లో వున్న టివి ని తాషి మిత్రుడు పెమా కి ఇచ్చేసి యధావిధిగా పనుల్లో పడతాడు.ఒకరోజు తాషి ఆ ఊరి స్కూల్ హెడ్ మాస్టర్ పిలుపు నందుకుని బడికి వెళ్తాడు.టీచర్స్ కొరతతో ఇబ్బంది పడుతున్న ఆ స్కూల్ లో టీచర్ గా పనిచేయటానికి ఒప్పుకుంటాడు.అదే స్కూల్ లో పనిచేస్తున్న అనీల[అన్షు జంసేన్ప] టీచర్ తో పరిచయమై స్నేహితులవుతారు.
అనీల’’ తాను ఈ ఊరిని ఇష్టపడుతున్నా నని,అందుకే దూరమైనా ఇక్కడ వుద్యోగం చేయటానికి వచ్చానని చెబుతుంది. ఈ వూరికి పైనున్న ఆ కొండ చివరి శిధిలగ్రామమం లో తాను పుట్టానని.. ఎప్పటికైనా ఆ ప్రాంతంలో కాలు మోపి.. అక్కడి ఫోటోలు తీసుకోవాలనేది తన కోరిక అని అంటుంది. కానీ తాను వెళ్ళలేక పోతున్నానని,ఎప్పటికైనా నా తరపున నా స్నేహితునిగా నువ్వు ఆ వూరికి వెళ్ళి ఫోటోలు తీసి పంపమని ‘’అడుగుతుంది.
అనిలకి పెళ్ళి నిశ్చయమవడంతో ఉద్యోగం వదిలి వెళ్తూ తాషిని కలిసి ఈ ఊరి… ఈ బడి అబివృద్ధిని చూడమని కోరుతుంది. వారిద్దరి మద్య వున్న ప్రేమ బహిర్గతమవుతుంది.తాషికి వుద్యోగం వచ్చినట్లుగా స్నేహితుని దగ్గర నుండి ఫోన్ వస్తుంది.అప్పటికే ఆ ఊరిమీద ప్రేమతో వున్న తాషి ఆ వుద్యోగం వదులుకుని ఊర్లోనే ఉండిపోతాడు.
అనీల కోరినట్లుగా అతి కష్టం మీద కొండకొమ్మున వున్న ఆ శిధిల గ్రామానికి వెళ్ళి ఆమెను గుర్తు చేసుకుంటూ ఫోటోలు తీస్తాడు. కొడుకు తమ దగ్గరే ఉండాలనే కోరిక తీరినందుకు అతని తల్లిదండ్రులు ఆనందపడతారు.ఎన్నో బ్రిడ్జి లనే అడ్డంకులను తన మనసును దాటివచ్చి తాషి చివరకు తన ఊర్లోనే స్థిరపడతాడు.
ఈ సినిమాలో అరుణాచల్ ప్రదేశ్ అందాలు,హిమనీ నదాల నీటితో పారే చిన్నచిన్న కాలువలపై కట్టిన కట్టెదుంగల వంతెనలు,వారి ముసుగు డాన్స్ లు [మాస్క్ డాన్స్]వారి ఆచారాలు,వంటలు,వస్రధారణ,వారికి వనకన్యల పట్ల వుండే భయాలు,అవి యువకులను పట్టి పీడిస్తాయనే నమ్మకాలు,బౌద్దారామాలను చక్కగా చూపించారు.
వారి రాష్ట్ర జంతువైన’’గాయల్[మిధున్]ని గూడా మనకు చూపిస్తారు. గ్రామీణ వాతావరణం అందాలను కెమెరాలో చక్కగా బంధించారు పూజా గుప్తే. తాషి స్కూల్ లో పిల్లలకు హోలీ రంగుల పండుగ గురించి పాఠం చెప్తూ ఉంటాడు.పాఠం శ్రద్దగా వింటున్న ఒక పాప’’ఈ రంగుల పండుగ ఏమిటో,మనకు తెలియదు.మనం చేసుకోము కదా..మరి మనం చేసుకునే మన పండుగ క్రో-చి-కర్-గురించి పుస్తకంలో ఎందుకు లేదు.?అని ప్రశ్నిస్తుంది.
దానికి తాషి ‘’ఈ కొండల నడుమ నున్న మన గురించి తక్కిన లోకానికి ఏమి అవసరం.మన గురించి తెలుసుకోవాలని వారనుకోరు.’అంటాడు.ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం కదా ఇది.ఒకే దేశంలో వుంటూ కూడా ,అన్నిటా వివక్ష ఎదుర్కొంటున్నామంటున్న అరుణాచలీయుల ప్రశ్నఇది.
ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ నుండి 2013 లో వచ్చిన సినిమా ఇది.ఉత్తమ జాతీయ చలనచిత్రంగా అవార్డు పొందింది.దర్శకుడు,రచయిత సాంగే డోర్జీ తాన్డాక్. సినిమాటోగ్రఫీ పూజా గుప్తే.
ఈ సినిమా primeలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వుంది.
————— పూదోట.శౌరీలు.బోధన్.