అద్భుతమైన ఛండాలం! (1)

Sharing is Caring...

Taadi Prakash …………………………………………………………
Mohan on the great O.V Vijayan…………………………………….

పద్మభూషణ్ ఒ వి విజయన్ కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డులు పొందిన ప్రఖ్యాత రచయిత. కేరళలోని పాలక్కాడ్ లో 1930 జూలై2 న పుట్టారు. 2005 మార్చి 30న హైదరాబాదులో మరణించారు. నవలలు, కథలు, నవలికలు, రాజకీయ వ్యాసాలు కొల్లలుగా రాసిన విజయన్ ఆధునిక మళయాళ సాహిత్యాన్ని ఆశ్చర్యపోయేంతగా ప్రభావితం చేశారు.

పూర్తి పేరు వొట్టు పులక్కల్ వేలుకుట్టి విజయన్. ఒ వి విజయన్ గా ప్రపంచమంతా తెలుసు. విజయన్, ఆయన భార్య థెరెసా హైదరాబాదులోని వెస్ట్ మారేడ్ పల్లి మెయిన్ రోడ్డులోనే ఉండేవాళ్ళు. సికింద్రాబాద్ లోని ‘ఆంధ్రభూమి’ లో పనిచేస్తున్న నేనూ వెస్ట్ మారేడ్ పల్లి లోనే వుండేవాణ్ణి. ఆర్టిస్ట్ మోహన్ విజయన్ని ఇంటికెళ్ళి కలిసేవాడు. అది 1993 – 94… ఆయనకి ఆరోగ్యం బాగోలేదు.

థెరెసా వచ్చి మాట్లాడేవారు. 95 లో విజయన్ హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో చనిపోయారు. ఆర్టిస్టులు అందరినీ పిలిచి మోహన్ పెద్ద సంతాప సభ ఆర్గనైజ్ చేశాడు.నేను రెండుసార్లు విజయన్ని చూశాను.ఆయన కొడుకు పేరు మధు. అధివాస్తవికత, మేజికల్ రియలిజం కలగలిసిన విజయన్ కథలు కొన్ని చదివాను. నిజజీవితంలోని చేదునీ, వికృతమైన వాస్తవాన్నీ మరింత బీభత్సంగా రాస్తాడు ఆయన. చదివి తట్టుకోలేం. వాంతి అవుతుందేమో అనిపించింది నాకైతే. మళయాళం  లిటరరీ జెయింట్ గా, గొప్ప కార్టూనిస్టుగా విజయన్ పొందిన గౌరవం అంతాయింతా కాదు. సరే, మోహన్ ఎప్పుడో రాసిన ఈ వ్యాసం చదవండి.

——–

ఎలాగీయాలి అనేది డైలమా. సరే అసలెందుకు వేయాలి, దేనిమీద అనేది మరీ పెద్ద డైలమా. ఈ చిక్కు విప్పడానికి కూడా మాస్టర్ కార్టూనిస్టులు మనకి దారి చూపిస్తారు.పాతికేళ్లుగా గీస్తున్న ఒ.వి.విజయన్ బొమ్మలు చాలా వింతగా ఉంటాయి.మనం మామూలుగా కార్టూన్ అనుకునేది ఆయన బొమ్మల్లో కనిపించదు.

పెద్ద పెద్ద ఇంకుమచ్చలు లాగి లెంపకాయ కొట్టినట్టుంటాయి. లోపల రాసే రాతలు స్లోగన్ మాదిరి, వ్యాసాల్లాగా ఉంటాయి. నవ్వడం బొత్తిగా కుదరదు. ఆయన బొమ్మల వరసని ఇండియన్ ఎక్స్ ప్రెస్ కార్టూనిస్టు రవిశంకర్ (ఇప్పుడు టెలిగ్రాఫ్ లో చేరాడు) అనుకరిస్తాడు.విజయన్ కేరళలో పుట్టారు. మద్రాసులో చదివాడు. కమ్యూనిస్టు ఉద్యమంలో చేరాడు. కాలేజీ టీచర్ గా ఇంగ్లీషు పాఠాలు చెప్పేవాడు. 1954లో రష్యన్ టాంకులు హంగరీలోకి వెళ్లినప్పుడు ఇది దారుణం అంటూ చిన్నచిన్న పత్రికల్లో వ్యాసాలు రాశాడు.

నాటి హంగరీ నాయకుడు ఇమ్రీనేగీ హత్యను భరించలేకపోయాడు. హంగరీపై ఆయన వ్యాసాలు చూసిన యూనివర్శిటీ వారు ఉద్యోగం పీకేశారు. (కమ్యూనిస్ట్ అయిన కారణంగా) ఈలోగా మలయాళ పత్రికల్లో ఆయన రాసిన కథలు కొన్ని వచ్చాయి. శంకర్స్ వీక్లీకి పంపిన కార్టూన్లు కూడా అచ్చయ్యాయి. అయినా రోజులు గడవడం కష్టం. పేదరికం. కేరళ కమ్యూనిస్టు పార్టీ పత్రిక ఆఫీసులో బొమ్మలు గీయడం, రాయడం లాంటి ఆల్ రౌండర్ జాబ్ లో చేరాడు. టీచర్ ఉద్యోగం పోయి, కష్టాల్లో ఉన్నాను గనుక కార్టూన్ల డబ్బులేమన్నా పంపించాలని శంకర్స్ వీక్లీకి లెటర్ రాశాడు.

డబ్బుల బదులు పిలుపొచ్చింది. ఢిల్లీ వచ్చి కార్టూనిస్టుగా చేరాలని శంకర్ స్వయంగా రాశాడు. కానీ ఎలా? హంగరీలో రష్యా జోక్యాన్ని వ్యతిరేకించిన తరువాత కూడా పార్టీ వాళ్ళు గెటౌట్ అనకుండా పత్రికలో ఉద్యోగమిచ్చారు. అది వదిలేస్తే ద్రోహి అంటారు. కనుక పార్టీ పత్రికలోనే ఉండిపోయాడు.కొద్దికాలానికి నాటి పార్టీ అగ్రనాయకులు ఎ.కె.గోపాలన్ వచ్చినపుడు శంకర్ కబురు గురించి చెప్పాడు.

వెంటనే మూటాముల్లే సర్దుకుని ఢిల్లీ పొమ్మని గోపాలన్ గారి సలహా. ఇక్కడే ఉంటే తుప్పట్టిపోతావ్ అన్నాడు. మహదానందంగా రెండు జతల మురికి లాల్చీ పైజామాలను చంకన పెట్టుకొని ఢిల్లీ వెళ్ళాడు. శంకర్స్ వీక్లీలో బొమ్మలూ, రాతలూ ఐదేళ్లు. ఈలోగానే ఒక మలయాళ నవల రాశాడు. అది కేరళలో పెద్ద హిట్. తరువాత ఢిల్లీ డైలీ పేట్రియాట్ లో కార్టూన్లు. అక్కడ ఎడతాత నారాయణన్ ఎడిటర్. గొప్ప మేధావి, జర్నలిస్టు. రష్యా అభిమాని. 

Pl. Read it Also ……………………  అద్భుతమైన ఛండాలం(2)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!