Kontikarla Ramana.………………………………………Satire on the careless attitude
వాస్తవ ఘటనల సమాహారమే ఈ సర్పంచ్ పులి కథ! దుర్భర పరిస్థితుల్లో మగ్గుతున్న మారుమూల అటవీ ప్రాంతాల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై ఓ సెటైర్ Sherdill: The Pilibhit Saga సినిమా. ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో సుమారు 17 మంది పులుల బారిన పడి చనిపోయిన 2017 నాటి ఘటనలే ఈ సినిమా కథకు మూలం.
శ్రీజిత్ ముఖర్జీ Sherdill: The Pilibhit Saga ను డైరెక్ట్ చేశారు. గతంలో ఇలాంటి కథాంశంతో సినిమాలు వచ్చాయి. వాస్తవానికి ఓ డాక్యుమెంటరీని పోలినట్టుగా సినిమా కథాగమనం కనిపించినా…అదే సమయంలో వాస్తవికతకు దర్పణం పట్టే చిత్రీకరణతో ఆసాంతం అటవీ నేపథ్యంతో సినిమా ఆకట్టుకుంటుంది.
మసాలా సినిమాలు చూసేవారికి ఈ తరహా సినిమాలు నచ్చవు. సినిమాకు ఎంచుకున్న కథ.. దాన్ని ప్రభుత్వాలపై వ్యంగ్యాస్త్రంగా ఎక్కుపెట్టిన తీరులో నిజాయితీ కనిపిస్తుంది. గంగారాం పాత్రలో పంకజ్ త్రిపాఠీ ఒదిగిపోయాడు. అలాగే నీరజ్ కబీ, సాయానీగుప్త పాత్రల క్యారెక్టరైజేషన్ ఇంప్రెస్ చేస్తాయి.
సినిమాను ఏమాత్రం డామినేట్ చేయకుండా.. ప్రేక్షకులను అడవిబాట పట్టించే బీజీఎం.. సందర్భోచితంగా అటవీ నేపథ్యంలో వచ్చే ఫోక్ సాంగ్స్ కు పూర్తి కాంట్రాస్టుగా ఆ పాటలకందించిన వెస్ట్రన్ ఎలక్ట్రిక్ గిటార్ మ్యూజిక్ కూర్పు అలరిస్తుంది.
ఈ తరం సంగీత దర్శకుల్లో.. సంగీతంతో సినిమాను డామినేట్ చేయకుండా.. సినిమా టేకింగ్ కు ఏమాత్రం సంగీతం తక్కువ కాకుండా.. కథనానికనుగుణంగా.. వీనులవిందైన మ్యూజిక్ అందించిన శాంతాను మోయిత్రా ను అభినందించవచ్చు. ఓ మారుమూల అటవీ ప్రాంతంలో జరిగే కథను దర్శకుడు తనదైన శైలిలో తెర కెక్కించాడు.
సర్పంచ్ తమ గ్రామాభివృద్ధి కోసం ఏంచేశాడనేది సినిమా. అయితే సినిమాకు.. ఉత్తరప్రదేశ్ పిలిభిత్ జిల్లాలోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో నాడు జరిగిన ఘటనలకు ఏంటీ సంబంధం..? రచయిత, దర్శకుడు.. ఈ చిత్రానికి ఈ సబ్జెక్ట్ ను ఎంచుకుని ఎలా కథను మౌల్డ్ చేశారనే అంశం ఆకట్టుకుంటుంది. అటవీ గ్రామాలపై ప్రభుత్వాల నిర్లక్ష్యం పై ఎక్కు పెట్టిన అస్త్రం ఈ సినిమా.
పులికి ఆహారం కావాలనుకున్న సర్పంచ్ గంగారాం (పంకజ్ త్రిపాఠీ) .. అనూహ్యంగా మీడియా, సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ సేవ్ గంగారాం.. హ్యాష్ ట్యాగ్ సేవ్ జుండావో పేరుతో ఎంత పాప్యులర్ అవుతాడు.. ఆ తర్వాత పిలిభిత్ గ్రామం.. సర్పంచ్ గంగారాం తిరిగిన ప్రాంతాలూ ఎలా పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయనేది.. సినిమా ప్రధాన కథలో ఇంటెన్సిటీని పెంచే నాటకీయతలో భాగమవుతాయి.
తన గ్రామాభివృద్ధి కోసం ఓ సర్పంచ్ పడే కష్టాలు.. తన లక్ష్యం వైపు కదలడం.. అడవిలో ఓ గ్రేట్ పోయెట్ ను తలపించే రీతిలో కనిపించే వేటగాడి క్యారెక్టర్ పాత్రను నీరజ్ కబీ చక్కగా చేశారు. నీరజ్ సర్పంచ్ గంగారాంకు మధ్య జీవితం గురించి జరిగే చర్చలు…. ఇలా మొత్తంగా ఓవైపు ఫిలాసఫికల్ గా… మరోవైపు అటవీ గ్రామాల ప్రజల బతుకుచిత్రం పై ఫోకస్ పెడుతుంది ఈ సినిమా. ఆసక్తి గల ప్రేక్షకులు netflix లో ఈ సినిమా ను చూడవచ్చు.