Ramana Kontikarla …………………………
సరదాగా అనుకోవడానికేముందండీ… ఏదైనా అనుకోవచ్చు. అలా అనుకుంటే హాయిగా అనిపించే ఓ అనుభూతి కలుగుతుంది.. కాసేపు ఊహల్లో విహరిస్తాం. ‘ఆదిత్య 999’ అంటూ నందమూరి మోక్షజ్ఞతో సినిమాకు ఏకంగా తండ్రి బాలయ్యే ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో.. రాబోయే ఆ భవిష్యత్ సినిమా ఎలా ఉంటుందన్న క్యూరియాసిటీ ఎలాగూ ఉండనే ఉంటుంది.
అవసరమైతే మన మస్తిష్కం అలా టైం మిషన్ ఎక్కి కాస్తా ముందుకెళ్లితే.. బాలయ్య సినిమా ఎలా తీయగలడో కూడా ఒకింత అంచనా వేయగలమేమో! సరే ఆదిత్య 999 భవిష్యత్ కాస్సేపు పక్కనబెట్టి.. ఓసారి మన మస్కిషంతో గతకాలపు ‘ఆదిత్య 369’ లోకి తొంగిచూద్దాం పదండి.
‘ఆదిత్య 369’… ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ సంస్థ కూడా పదికి 8.4 రేటింగ్ ఇచ్చిన సినిమా. సింగీతం శ్రీనివాసరావు కథ, కథనం, దర్శకత్వంలో వచ్చి ఓ సంచలనం సృష్టించిన ఈ సినిమా మనిషి ఊహలకు, ఆలోచనా శక్తికి ఓ ప్రతిరూపం.
మానవ సమాజంలో అడుగడుగునా సమస్యలు, సవాళ్లతో ఎదురీదాల్సిందే. వ్యక్తగత సమస్యలకు తోడు, అనుకోకుండా ఎదురయ్యేవి, ఎంత వెతికినా పరిష్కారానికి నోచుకోనివి, పరిష్కరించుకున్నకొద్దీ కొత్తగా వచ్చి చేరేవి.. కొంచెం దుందుడుకు స్వభావముంటే కొని తెచ్చుకునేవి.
అలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యలేంటి.. ఈ సవాళ్లేంటి.. హాయిగా ఎవ్వరకీ అందకుండా ఎగిరిపోతే ఎంత బాగుండనిపించడం మానవమాత్రులకు సర్వసాధారణం. అలాంటి సందర్భాల్లో పర్యటనల్లో కొంత సేద తీరుతుంటాం.
కానీ, ఎక్కడున్నా పక్కలో బల్లెంలా ఎప్పటికప్పుడు బాధ్యతలను గుర్తు చేసే అలారిమింగ్ మొబైల్ ఫోన్స్… సమస్యల నుంచి భౌగోళికంగా దూరముంచొచ్చేమోగానీ కాస్సేపు గానీ, మానసికంగా ప్రశాంతంగా ఉండనీయవు. అదిగో అలాంటి సందర్భంలోనే మనకూ ఓ ‘ఆదిత్య 369 టైం మిషన్’ ఉంటే బాగుండుననిపిస్తుంటుంది.
బాలకృష్ణ, మోహిని, టిన్నూ ఆనంద్, అమ్రిష్ పురి, చంద్రమోహన్, శుభలేఖ సుధాకర్, సిల్క్ స్మిత, చలపతిరావు, నాటి మాస్టర్, ఆ తర్వాతి హీరో తరుణ్ వంటివాళ్లు ప్రధాన నటీనటులుగా నటించిన ఈ సినిమాలో…. బాలకృష్ణ నేటి సమాజపు ఆధునిక మనిషి రూపంలోనూ… మరోవైపు నాటి శ్రీకృష్ణదేవరాయల పాత్రలోనూ ద్విపాత్రాభినయంతో అలరించారు.
ఈ సినిమా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్న కారణమేంటంటే… ఆ సినిమా ఊహ ఇప్పుడు నిజమైతే… ఓసారలా కొత్త బంగారులోకంలోకి వెళ్లే అవకాశముండుంటే అన్న ఓ గొంతెమ్మ కోరికే. ఆ సినిమా పాటలోలా చిలిపి యాత్రలో ఛల్ ఛల్ ఛల్ అంటూ… ఓసారి అలా అలా ఆ ఊహల పల్లకిలో విహరించే ప్రయత్నం చేయవచ్చన్న ఆశ.
సింగీతం శ్రీనివాసరావు సినిమా నిడివి ఓ రెండున్నర గంటలే కాబట్టి అలా వెనక్కి రాయల కాలానికి.. భవిష్యత్తులో మరో వందేళ్ల ముందుకన్నట్టుగా సినిమాలో చూపించారేమోగానీ. మనమైతే నిజాం జమానాను చూడొచ్చు, పురుషోత్తముడు- అలెగ్డాండర్ ఫైటూ చూడొచ్చు, రాకెట్లలో అంతరిక్షంలోకి ఉదయం వెళ్లి రాత్రికి తిరిగొచ్చే ప్రయాణ సౌకర్యాలూ వీక్షించొచ్చు.
ఒక్కో గ్రహంలో ఒక్కో వాతావరణంలో ఇళ్లు నిర్మించుకుని ఆయా వాతావరణాలకు తగ్గట్టుగా జీవించడాన్నీ అలవాటు చేసుకోవచ్చు, త్రేతాయుగంలో రామరావణ యుద్ధాన్నీ చూసిరావొచ్చు, భగవద్గీతను పఠించేకన్నా.. శ్రీకృష్ణుడు అర్జునుడికి సందేశం వినిపించే వేళకే చేరుకుని మనమూ వినిరావొచ్చు.
ఆకాశంలోనే జీవిస్తే మనిషి బతుకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే మనకూ ఓ టైం మిషన్ ఉంటే ఎంత బాగుండనిపిస్తుంది.. ఎగిరిపోతే ఎంత బాగుండనిపిస్తుంది. పైన చెప్పినవన్నీ గొంతెమ్మ కోర్కెలే అయితే.. కనీసం మన బాల్యానికైనా వెళ్లే వెసులుబాటు టైం మిషన్ ఇచ్చేదేమోనన్న ఓ చిన్న ఆశ!