పాదయాత్రకు సిద్ధమౌతున్న తీన్మార్ మల్లన్న!

Sharing is Caring...

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయపార్టీలకు దడ పుట్టించిన తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేయబోతున్నారు. ఆగస్టు 29 న జోగులాంబ గద్వాల్ జిల్లానుంచి ఈ పాదయాత్ర మొదలవుతుంది. తన పాదయాత్ర కు ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అతిధిగా మల్లన్న ఆహ్వానించబోతున్నారు. “టీమ్” పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసిన మల్లన్న రాష్ట్ర, జిల్లా, మండల,గ్రామ స్థాయిలో కమిటీలు వేస్తున్నారు. ప్రధానంగా ఈ టీమ్ అధికార పార్టీ వైఫల్యాలపై పోరాడుతుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచారం చేస్తుంది. జనంలోకి వెళ్లి ప్రభుత్వ విధానాలపై అవగాహన కల్పిస్తుంది. ఇప్పుడైతే మల్లన్న ఏమి చెప్పడం లేదు కానీ ఇదే టీమ్ భవిష్యత్ లో రాజకీయ పార్టీగా మారే అవకాశాలు లేకపోలేదు.

ఇక మల్లన్న తెలంగాణా వ్యాప్తంగా పాదయాత్రకు సన్నద్ధమవుతున్నారు. అందుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు కూడా ఆయన మూడు జిల్లాల్లో ఒక పాదయాత్ర చేశారు. ఓటర్లను నేరుగా కలసి వారి సమస్యలు తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పదునైన విమర్శలు గుప్పించారు. నాటి అనుభవం మల్లన్నకు సుదీర్ఘ పాదయాత్రలో ఉపయోగపడుతుంది.

ఇప్పటికే రాష్ట్రం లో రాజకీయ వేడి రగులుకుంది. పలువురు నేతలు పాదయాత్రలకు సిద్ధమౌతున్నారు. పాదయాత్రలు చేయబోయే వారిలో  వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ నేత షర్మిల, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి , బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ లు ఉన్నారు. సంజయ్ పాదయాత్ర ఆగస్టు 9 నుంచి మొదలు కానుంది. మిగతా నేతల షెడ్యూల్స్ ఖరారు కాలేదు. షర్మిల చేవెళ్ల నుంచి పాదయాత్రకు సన్నద్ధమౌతున్నారు. కాగా సోమవారం నుంచి ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజక వర్గంలో పాదయాత్ర చేయబోతున్నారు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!