చూపు లేకున్నా … ఎవరెస్టు ఎక్కాడు !

Sharing is Caring...

His will power is strong………………………………………………………..

అది మామూలు టాస్క్ కాదు. అత్యంత రిస్క్ తో కూడింది. అయినా అదర లేదు .. బెదరలేదు.. వెనకడుగు వేయలేదు. అతగాడికి చూపులేదు. అయినా ఎవరెస్టు ఎక్కాలని కలగన్నాడు. స్వప్నం సాకారాం చేసుకున్నాడు.  చైనా కు చెందిన ఝాంగ్ హాంగ్ (46) ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించాడు. 

హాంగ్ నేపాల్ వైపు నుంచి ముగ్గురు గైడ్లతో కలసి 8849 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు. ఎవరెస్టు అధిరోహించిన ఆసియాకు చెందిన మొదటి అంధుడిగా, ప్రపంచంలో మూడో వ్యక్తిగా కొత్త రికార్డు సృష్టించాడు. అంతకుముందు అమెరికా కు చెందిన ఎరిక్ వెహ్మేయర్ 2001 లోను , ఆస్ట్రేలియాకు చెందిన అండీ హాజర్ 2017 లో ఎవరెస్టును అధిరోహించారు.

ఈ ఇద్దరు అంధులే. వివిధకారణాలవల్ల చూపు కోల్పోయారు. అయినా నిరాశపడకుండా రికార్డులు సృష్టించారు. ఝాంగ్ హాంగ్ కి కూడా ఆ ఇద్దరే ఆదర్శం. నైరుతి చైనా లోని ఛాంకింగ్ నగరానికి చెందిన హాంగ్ 21 ఏళ్ళ వయసులోనే గ్లకోమా వ్యాధితో చూపు కోల్పోయాడు.

అంధులై కూడా పర్వతారోహణలో అమెరికా,ఆస్ట్రేలియా వాసుల చేసిన సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎవరెస్ట్ ను అధిరోహించాలని హాంగ్ నిర్ణయించుకున్నాడు. తన మిత్రుడు కియాంగ్ జీ దగ్గర శిక్షణ పొందాడు. అలా చిన్నగా పర్వతారోహణ చేయడం మొదలు పెట్టాడు. వికలాంగులా ? కళ్ళు కనిపించని వారా ? కాళ్ళు చేతులు లేని వారా ? అన్నది సమస్య కాదు. మంచి సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చని హాంగ్ నిరూపించాడు. మనోబలం , మనో సంకల్పం ముందు వైకల్యాలు చిన్నవే అని హాంగ్ అంటున్నారు.

హాంగ్ ఎవరెస్ట్ ఎక్కడానికి మూడేళ్ళ కఠినశిక్షణ పొందాడు. రెండేళ్ల క్రితం చైనాలో 7509 మీటర్ల ఎత్తుగల ముజతగ్ ఆటా అనే పర్వతాన్ని అధిరోహించాడు. 2017లో నేపాల్ ప్రభుత్వం  శారీరక వైకల్యం .. చూపు కానరాని వారు ఎవరెస్ట్ ఎక్కడాన్ని నిషేధించింది. దాంతో హాంగ్ నిరుత్సాహపడ్డాడు.అయితే ఆ తర్వాత సుప్రీం కోర్టు ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో కఠోర సాధన చేసి హాంగ్  లక్ష్యాన్ని చేరుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.

ఈ సంవత్సరం ఎవరెస్ట్  అధిరోహణకు గాను 408 మంది కి నేపాల్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలా హాంగ్ కూడా అవకాశం పొందాడు.ఎవరెస్టు పర్వతం ఎక్కడానికి సుమారు రెండు మాసాలు పడుతుంది. ఒక్కోసారి విపరీతమైన మంచు కురుస్తుంది. గాలులు వీస్తాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. వీటిని అధిగమిస్తూ పర్వతారోహణ చేయాలి. హాంగ్ అన్ని అడ్డంకులను అధిగమిస్తూ శిఖరాగ్రానికి చేరుకున్నాడు. అక్కడనుంచి సేఫ్ గా కిందకు దిగాడు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!