భారత్ తో సఖ్యత అమెరికాకు అవసరమే.. ఎందుకంటే ?

Sharing is Caring...

పులి ఓబుల్ రెడ్డి ………….  

అమెరికా లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే భారత్ కి మంచిదని, బైడెన్ గెలిస్తే ఇబ్బందే అని చాలా మంది అభిప్రాయం.
చైనా విషయంలో మాత్రం ట్రంప్, బైడెన్ లు ఇద్దరూ చాలా సీరియస్ గా ఉన్నారు. కానీ, భవిష్యత్తులో చైనాని నిలువరించాలంటే భారత్ సహాయం లేకుండా అది ఖచ్చితంగా సాధ్యం కాదు. చైనాతో కేవలం భౌగోళిక సరిహద్దులు కలిగి ఉండటం, అతి పెద్ద మార్కెట్, అతి పెద్ద వర్క్ ఫోర్స్, శక్తిమంతమైన మిలిటరీ ఉండటం మాత్రమే గాక, ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో చైనా ఆయిల్ సప్లై ని ఎదుర్కొనే సత్తా కేవలం భారత్ మాత్రమే కలిగి ఉండటమే అందుకు కారణం.

కేవలం ఒకే ఒక విమానవాహక నౌక INSవిక్రమాదిత్య ( రెండోది INSవిక్రాంత్ బహుశా 2022లో సర్వీస్ లో చేరబోతోంది), 15 జలాంతర్గాములతో మాత్రమే ఇది సాధ్యం కాలేదు. అరేబియా, బంగాళాఖాతంలో ఉన్న లక్షద్వీప్, అండమాన్ , నికోబార్ దీవులు కొన్ని వందల విమాన వాహక నౌకలతో సమానం. భారత్ కన్నుగప్పి ఒక్క చిన్న బోట్ కూడా ఆ జలాల్లో ప్రవేశించలేదు.సౌత్ కొరియా, జపాన్, అమెరికా (ఫిలిప్పీన్స్), ఆస్ట్రేలియా లు భారత్ సాయంతో చైనాని దక్షిణ చైనా సముద్రానికి పరిమితం చేస్తూ పకడ్బందీగా సముద్ర గోడని (గొలుసుకట్టు వార్నింగ్ సెన్సార్లు) నిర్మించగలిగాయి. ఇది చైనా ‘స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్’ కి విరుగుడుగా ఆయా దేశాల ‘నెక్లెస్ ఆఫ్ డైమండ్స్’.

ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్ కి డబ్బు ఆశ చూపించి చైనా, పాక్ లోని గ్వాదర్ పోర్టుని సొంతం చేసుకుంది. CPEC ద్వారా భూమార్గంలో అయినా ఆయిల్ సప్లై ని కొనసాగించాలని. కానీ ఇక్కడ కూడా భారత్ తెలివిగా దెబ్బ కొట్టింది. ఇరాన్ లోని చాబహార్ పోర్టు, తజకిస్థాన్ లోని ఫార్ఖోర్ ఎయిర్ బేస్ లను సొంతం చేసుకొని ఆ మార్గాన్నీ నిలువరించగలిగే సత్తా సంపాదించింది.

అప్పు ఇచ్చి అదుపులో పెట్టుకోవాలనుకున్న చైనా ఆశలు సన్నగిల్లుతున్నాయి. ‘స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్’ నుండి శ్రీలంక లాంటి దేశాలు విడిపడి భారత్ వైపు మొగ్గుతున్నాయి. పాకిస్థాన్, నేపాల్ లను అదుపులో ఉంచుకొని భారత్ ని కట్టడి చేయాలని చైనా అనుకుంటుంటే… చైనా నలువైపులా మంగోలియా, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్, మయన్మార్, సింగపూర్ లాంటి దేశాలతో భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే అనఫిషియల్ గా జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాలతో కలిసి భారత్ నాటో తరహా కూటమి ఏర్పాటు చేసుకుందని పరిశీలకుల అంచనా. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే, ట్రంప్, బైడెన్ లలో ఎవరు గెలిచినా భారత్ ని విస్మరించడం అసాధ్యం.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!