Well stuck……………………………………………….
ఒక రేప్ కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతి తో పాటు మరో ఇద్దరికి లక్నోలోని ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. గాయత్రి ప్రసాద్ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు. ములాయం సింగ్ యాదవ్ అనుచరుడు. ఓ మహిళ దాఖలు చేసిన ఫిర్యాదుపై ఈ కేసు నమోదైంది.మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ క్యాబినెట్‌లో కూడా గాయత్రీ ప్రసాద్ మైనింగ్ మంత్రిగా చేశారు. అంతకుముందు రవాణా మంత్రిగా కూడా చేశారు.
మైనింగ్ మంత్రిగా ఉండగా అతగాడి పై ఆరోపణలు వెల్లువెత్తాయి. లోకాయుక్తలో ఆ కేసులు విచారణలో ఉన్నాయి. ప్రస్తుత కేసు విషయానికొస్తే … మూడేళ్ల క్రితం ప్రజాపతి తనపై అత్యాచారం చేశాడని చిత్రకూట్‌కు చెందిన ఓ మహిళ ఆరోపించింది. ప్రజాపతి ఫోటోలు తీసి, లీక్ చేస్తానని బెదిరించి రెండేళ్లుగా తన పై అత్యాచారం కొనసాగించినట్లు ఆమె ఆరోపణ. ఆమెకు సమాజ్‌వాదీ పార్టీలో ముఖ్యమైన పదవి ఇప్పిస్తానని గాయత్రీ ప్రసాద్ హామీ ఇచ్చారట. తన కూతురిపై కూడా అత్యాచారం చేసే ప్రయత్నం చేసారని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు యూపీ పోలీసులు నిరాకరించారు. దీంతో ఆ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని సుప్రీం పోలీసులను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంత్రిపై గౌతంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. గాయత్రి ప్రసాద్ కొన్నాళ్ళు పరారీలో ఉన్నాడు. తరువాత లక్నోలో అరెస్ట్ అయ్యాడు.అప్పటి నుండి జైలులో ఉన్నారు.
ప్రత్యేక న్యాయమూర్తి పికె రాయ్ ఈ కేసును విచారించారు. ప్రాసిక్యూషన్ ముగ్గురిపై ఆరోపణలను రుజువు చేసింది. ప్రజాపతితో పాటు మరో ఇద్దరు ఆశిష్ శుక్లా, అశోక్ తివారీలకు శిక్ష పడింది. శుక్లా అమేథీలో మాజీ రెవెన్యూ క్లర్క్ కాగా, తివారీ కాంట్రాక్టర్‌గా పనిచేశారు ఈ కేసులో మరో నలుగురు నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేకపోవడంతో న్యాయమూర్తి నిర్దోషులుగా ప్రకటించారు.ఈ కేసులో ప్రాసిక్యూషన్ 17 మంది సాక్షులను విచారించింది.
2002లో బీపీఎల్ కార్డు హోల్డర్ అయిన గాయత్రీ ప్రసాద్ కోట్లకు పడగలెత్తాడు. ఆయన ఆస్తుల విలువ ఇప్పుడు రూ.942.5 కోట్లు. ఆయన సన్నిహితులు .. బంధువులు 13 కంపెనీలలో డైరెక్టర్లుగా ఉన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో ప్రజాపతి తన నికర ఆస్తుల విలువ రూ.10 కోట్లు అని ప్రకటించారు. అమేధీ నుంచి ఆయన ఎమ్మెల్యే గా ఎన్నికయ్యాడు. త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈ కేసు ప్రభావం పార్టీ పై పడవచ్చని పార్టీ వర్గాలు ఆందోళన పడుతున్నాయి.