క్లైమాక్స్ కష్టాలు అన్నిఇన్ని కాదు !

Sharing is Caring...

Bharadwaja Rangavajhala …………………………….

ఏ సినిమాకైనా క్లైమాక్స్ కీలకం … అది కానీ సరిగ్గా కుదరకపోతే సినిమా ఢమాల్ అనడం ఖాయం. అందుకే దర్శకులు సినిమా ముగింపు విషయంలో చాలాజాగ్రత్తలు తీసుకుంటారు. “ఈ న‌గ‌రానికి ఏమ‌య్యింది ” సినిమా లో పిల్ల‌లంతా క‌ల‌సి ఓ షార్ట్ ఫిలిం తీస్తారు.

అయితే క్లైమాక్స్ విష‌యంలో చిన్న ఘ‌ర్ష‌ణ వ‌స్తుంది. డైరెక్టరు తాన‌నుకున్న‌దే ఉండాలంటాడు. అప్పుడు మిగిలిన ఫ్రెండ్స్ రెండు క్లైమాక్సులు తీద్దాం … రెండూ వాడికి చూపిద్దాం… వాడు క‌న్విన్స్ అయితే మ‌నం తీసింది పెడ‌దాం కాదంటే వాడు తీసింది పెడ‌దాం అని నిర్ణ‌యం తీసుకుంటారు.

ఇలాంటి అనుభవాలు నిజ ‌జీవితంలో చాలా మంది డైరెక్టర్లకు ఎదురయ్యాయి. ఇలా క్లైమాక్స్ క‌ష్టాలు ఎదుర్కొన్న డైర‌క్ట‌ర్ల‌లో విశ్వ‌నాథ్ ఒక‌రు.”శార‌ద” సినిమా క్లైమాక్స్ లో శార‌దకు త‌న భ‌ర్త చనిపోయాడ‌ని తెల్సి విధ‌వ‌గా ఊరొస్తుంది … ఊరొచ్చింది లేవ‌మ్మా అని ప‌డ‌వ‌లో చెల్లెల్ని క‌దిపిన స‌త్య‌నారాయ‌ణ ఒళ్లో వాలిపోతుంది. క‌న్నుమూస్తుంది.

ఇది విశ్వ‌నాథ్ అనుకుని తీసిన క్లైమాక్సు.అయితే నిర్మాత క్రాంతికుమార్ ఆలోచ‌న మ‌రో విధంగా ఉంది. ఆమె బ్ర‌తికే ఉంటే బాగుంటుంది. అలాగే … ఆమె విధ‌వ అని తెలిసీ ఊళ్ళో వాళ్లంద‌రూ ఆమెను త‌మ పుణ్య‌కార్యాల‌కు పిల‌వ‌డం చేస్తుండగా ముగిస్తే బాగుంటుంద‌నేది క్రాంతిగారి అభిప్రాయం. ఈ అభిప్రాయానికి ఆయ‌న రావ‌డానికి కార‌ణం కె.ఎస్ ప్ర‌కాశ‌రావు. ఆయ‌న‌కి సినిమా చూపించి క్లైమాక్స్ ఎలా ఉంటే బాగుంటుంద‌ని స‌ల‌హా అడిగారు క్రాంతికుమార్.

ప్ర‌కాశ‌రావుగారేమ‌న్నారంటే … శోభ‌న్ స‌మాధి ద‌గ్గ‌ర అలా కూర్చుని ఉంటుంది శార‌ద … మూగ‌మ‌న‌సులు లో జ‌మున‌లా … అన్జెప్పారు. దాన్నించి క్రాంతి గారికి వ‌చ్చిన ఎక్స్ టెన్ష‌న్ ఊళ్లో అన్ని పుణ్య‌కార్యాలూ ఆమె పేరుతో జ‌ర‌గ‌డం ఇలాంటివ‌న్నీ … రెండూ తీసారు కూడా..బోలెడు చ‌ర్చ‌ల అనంత‌రం విశ్వ‌నాథ్ అనుకున్న‌క్లైమాక్స్ తోనే సినిమా విడుద‌ల‌య్యింది. హిట్ట‌య్యింది.

అలాగే “సీతామాల‌క్ష్మి” విష‌యంలోనూ ఇలాగే జ‌రిగింది. క్లైమాక్స్ విషాదాంతం చేయాల‌నేది విశ్వ‌నాథ్ అభిప్రాయం. సుఖాంతం చేయాల‌నేది నిర్మాత మురారి ఆలోచ‌న‌. విశ్వ‌నాధ్ క‌న్విన్స్ కాలేదు… అయితే మురారి త‌న ఇష్ట‌ప్ర‌కార‌మే క్లైమాక్సు ను తీసి సినిమా విడుద‌ల చేసి విజ‌యం సాధించారు.

అలాగే “సిరిసిరిమువ్వ” సినిమా ఎక్స్ ప‌ర్ట్ ఒనీనియ‌న్ కోసం సినియర్ దర్శకులు పి.పుల్ల‌య్య చూపించారు. ఆయ‌న జ‌య‌ప్ర‌ద‌కు మాటొస్తే బాగుంటుంద‌ని స‌ల‌హా చెప్పారు. విశ్వ‌నాథ్ క‌న్విన్స్ కాలేదు … సినిమా హిట్ కొట్టింది.

“జ్యోతి” సినిమా క్లైమాక్స్ విష‌యంలోనూ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావుకీ నిర్మాత క్రాంతికుమార్ కీ విబేధాలు వ‌చ్చాయి. సినిమాను ఫ్లాష్ బ్యాక్ లో చెప్పాలా … స్ట్రెయిట్ నేరేష‌న్ లో చెప్పాలా అని ప్ర‌శ్న … స్ట్రెయిట్ నేరేష‌న్ బాగుంటుంద‌ని క్రాంతి గారి అభిప్రాయం. 

ఫ్లాష్ బ్యాక్ లో చెప్పాల‌నేది రాఘ‌వేంద్ర‌రావు అభిప్రాయం. కొంత మంది పెద్ద‌ల మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో ఫ్లాష్ బ్యాక్ లో చెప్ప‌డ‌మే మంచిద‌ని క్రాంతి గారిని క‌న్విన్స్ చేసి సినిమా విడుద‌ల చేసి విజయం సాధించారు.
ఇలా చాలా సినిమాల్లో జ‌రుగుతూంటుంది.

బాపుగారి ” కృష్ణావ‌తారం ” సినిమాలో విజ‌య‌శాంతిని శ్రీధ‌ర్ రేప్ చేశాడ‌నే విష‌యం ముందే చెప్పేశారు బాపుగారు. మార్నింగ్ షో లో అదే ఉంది. వెంట‌నే ఏమ‌నుకున్నారో … ఆ సీన్ క‌ట్ చేసి సెకండాఫ్ లో పెట్టారు. ఇలా అనుభవాలే మరికొన్నిమరోమారు చెప్పుకుందాం.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!