A key figure in the drug mafia……………….
సలీం డోలా (Mohammad Salim Dola) అంతర్జాతీయ డ్రగ్ మాఫియాలో కీలక వ్యక్తి. డ్రగ్స్ , హవాలా కేసుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సలీం డోలాను కొద్దిరోజుల క్రితం టర్కీ (తుర్కియే) లోని ఇస్తాంబుల్‌లో అరెస్ట్ చేశారు. భారత నిఘా సంస్థల సమాచారంతో అక్కడి పోలీసులు అతడిని పట్టుకుని, ఏప్రిల్ 28 న ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకు వచ్చారు. ఇతగాడు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు.
దావూద్ ఇబ్రహీంకు చెందిన ‘డీ-కంపెనీ’ నిర్వహించే గ్లోబల్ సింథటిక్ డ్రగ్స్ వ్యాపారానికి ఇతడు డైరెక్టర్‌గా వ్యవహరిస్తాడని నిఘా వర్గాల అంచనా. సుమారు రూ. 5,000 కోట్ల విలువైన మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను ఇతడు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.మెఫెడ్రోన్ (MD), హెరాయిన్, చరాస్, మెతాంఫేటమిన్ వంటి సింథటిక్ డ్రగ్స్‌ను మహారాష్ట్ర, గుజరాత్‌లోని రహస్య ప్రయోగశాలల్లో తయారు చేయించి సరఫరా చేసేవాడు.
దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు సలీం మిర్చీ మరణం తర్వాత, డీ-కంపెనీకి చెందిన అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యాపార బాధ్యతలను సలీం డోలా స్వీకరించాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.సలీం డోలా కుమారుడు తాహెర్ సలీం డోలాను కూడా గతేడాది యూఏఈ (UAE) నుండి భారత్‌కు అప్పగించారు. ఇతడు కూడా తన తండ్రి డ్రగ్ వ్యాపారంలో కీలక భాగస్వామిగా ఉన్నాడు.
నేర చరిత్ర
సలీం డోలా 1998లో ముంబై విమానాశ్రయంలో 40 కిలోల మాండ్రాక్స్ డ్రగ్స్‌తో మొదటిసారి పట్టుబడ్డాడు.2018లో రూ. 1,000 కోట్ల విలువైన ‘ఫెంటానిల్’ డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.అయితే, ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చి దేశం దాటి పరారయ్యాడు.
తర్వాత కాలంలో యూఏఈ, టర్కీలలో ఉంటూ విదేశాల నుండి నెట్‌వర్క్‌ను నడిపాడు.2024 లో ముంబైలో పట్టుబడిన 126 కిలోల మెఫెడ్రోన్ కేసులో ఇతని ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. మొదట్లోసలీం ముంబై, ఢిల్లీలలో గుట్కా స్మగ్లింగ్ చేసేవాడు, ఆ తర్వాత గంజాయి, సింథటిక్ డ్రగ్స్ వ్యాపారంలోకి దిగాడు.
సలీం డోలా దాదాపు ఏడేళ్లుగా విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. ఇస్తాంబుల్‌లోని బెయిలిక్దుజు (Beylikduzu) అనే ప్రాంతంలో నకిలీ గుర్తింపుతో నివసిస్తున్న అతడిని, టర్కీ నిఘా సంస్థ , పోలీసులు సంయుక్తంగా ఏప్రిల్ 25 న అదుపులోకి తీసుకున్నారు.అతడిని ఏప్రిల్ 28, తెల్లవారుజామున ఒక ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని ఐజిఐ (IGI) ఎయిర్‌పోర్ట్‌కు తీసుకువచ్చారు.
ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు అతడికి రెండు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ మంజూరు చేసింది. తదుపరి విచారణ కోసం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు ముంబైకి తరలించనున్నారు. ప్రస్తుతం అతడిని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు విచారిస్తున్నారు.
దావూద్ ఇబ్రహీంకు ఆర్థిక మూలాలను పెంచడంలో, డ్రగ్స్ ద్వారా వచ్చే డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లించడంలో సలీం డోలా కీలక పాత్ర పోషించాడని అధికారులు భావిస్తున్నారు. ఈ అరెస్ట్‌తో దావూద్ ఇబ్రహీం ఆర్థిక మూలాలను దెబ్బతీయవచ్చని పాకిస్తాన్ ఐఎస్ఐ (ISI) ద్వారా జరుగుతున్న డ్రగ్స్ సరఫరా మార్గాలను కనిపెట్టవచ్చని, మరికొంతమంది నిందితులు కూడా దొరకవచ్చని భారత ప్రభుత్వం భావిస్తోంది.సలీం డోలా అరెస్ట్ దావూద్ కి షాక్ అని చెప్పుకోవచ్చు.

