Odissa Assembly elections ……………………..
బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్‌కు ఓటమి ఎరగని నేతగా మంచి పేరుంది. అయితే ఈ సారి ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ అధికారం కోల్పోవడమే కాకుండా పోటీ చేసిన ఒక చోట ఓడిపోయారు. మరో చోట గెలిచారు .. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు ఓరకంగా ఆయనకు చుక్కలు చూపించాయి. ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయి.
బీజేపీ అనూహ్యంగా ఒడిశా లో బిజూ జనతాదళ్ ఆధిపత్యాన్ని కూకటి వేళ్లతో పెకలించి పడేసింది. భారీ మెజార్టీతో ప్రభుత్వ పగ్గాలు చేపట్ట బోతోంది. అధికారం కోల్పోవడం ఒక ఎత్తు అయితే నవీన్ పట్నాయక్ ఒక సామాన్యుడి చేతిలో ఓటమి పాలయ్యారు.
బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. వాటిలో ఒకటి హింజాలి, రెండొది కాంతాబంజి.. హింజాలిలో 4వేల పైచిలుకు ఓట్లతో ఆయన గట్టెక్కారు. కానీ కాంతాబంజిలో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ చేతిలో 16వేల పైచిలుకు ఓట్లతో నవీన్ ఓటమి పాలయ్యారు.
హింజాలి స్థానంలో వరుసగా 5 సార్లు గెలిచిన నవీన్ పట్నాయక్ ఆరో సారి కూడా గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధించారు. 2019 ఎన్నికల్లో హింజాలి తో పాటు పట్నాయక్ బీజేపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల గెలిచారు. తర్వాత బీజేపూర్ ని వదిలేశారు. ఉపఎన్నికలో కూడా బిజూ జనతాదళ్ అభ్యర్దే గెలిచారు.
ఈ సారి హింజాలి తో పాటు కాంతాబంజి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. అక్కడ ఆయన ఓటమి పాలయ్యారు. ఇక్కడ సీఎం ను ఓడించిన వ్యక్తి .. సామాన్యుడు కావడం విశేషం ..ఆయనపేరు లక్ష్మణ్… కొన్నేళ్ల క్రితం వరకు లక్ష్మణ్ ఓ సాధారణ దినసరి కూలీ. కార్మికుల పక్షాన నిలబడి హక్కుల కోసం పోరాడుతూ నాయకుడిగా ఎదిగారు.
2014లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినపుడు మూడో స్థానమే దక్కింది. నాటి ఎన్నికల్లో లక్ష్మణ్ కి 30 వేల ఓట్లు వరకు వచ్చాయి. పార్టీనే నమ్ముకున్నాడు. ఇక 2019లో కేవలం 128 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో కూడా లక్ష్మణ్ కి 64,118 ఓట్లు వచ్చాయి.
ఆ ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి ఈ ఎన్నికల్లో వర్క్ అవుట్ అయింది. ఏ మాత్రం నిరాశ పడకుండా పల్లె పల్లె తిరుగుతూ నియోజకవర్గం పై పట్టు పెంచుకున్నారు. దీనికి తోడు ప్రధాని మోడీ ప్రచారం కలసి వచ్చింది. నవీన్ పట్నాయక్ గెలిచినా ఈ నియోజకవర్గాన్ని వదిలేస్తారని ఓటర్లు భావించారు. ఈ క్రమంలో లక్ష్మణ్ విజయం సులువైంది.