పొలిటికల్ డ్రామా ..ట్విస్టులు తక్కువ !!

Sharing is Caring...

Political Drama ……….

మలయాళ నటుడు నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో నటించిన రాజకీయ థ్రిల్లర్ మూవీ ‘ప్రతిఛాయ’ (Prathichaya) ప్రస్తుతం జియో హాట్ స్టార్ (JioHotstar)లో తెలుగులోనూ అందుబాటులో ఉంది.
కేరళ ముఖ్యమంత్రి వర్గీస్ (బాలచంద్ర మీనన్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

ఆయనపై అనేక రాజకీయ ఆరోపణలు, లైంగిక వేధింపుల నిందలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఆయన కను మూస్తారు. ఈ క్రమంలోనే  కొడుకు రాజకీయ ప్రవేశం, పాలనా పగ్గాలు చేపట్టి, తండ్రి పై వచ్చిన ఆరోపణలను ఎలా తిప్పికొట్టాడు అన్నది అసలు కథ.

లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినప్పుడు, వర్గీస్  తన కుటుంబ సభ్యుల ముందు పడే ఆవేదన ప్రేక్షకులను కదిలిస్తుంది. ముఖ్యంగా “రాజకీయాల్లో ఏ నింద వచ్చినా భరించవచ్చు, కానీ ఇలాంటి ఆరోపణ వస్తే ఇంట్లో వాళ్లను నమ్మించడమే కష్టం” అని ఆయన చెప్పే డైలాగ్ సినిమాకే హైలైట్.

రాజకీయాలకు దూరంగా ఉండే టెక్నోక్రాట్ జాన్ వర్గీస్ (నివిన్ పౌలీ), తన తండ్రి పరువును కాపాడటం కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టే సీన్ ఆకట్టుకుంటుంది. ఆయన కార్పొరేట్ శక్తులను ఎదుర్కోవడానికి ఉపయోగించే టెక్నాలజీ ఆధారిత ఎత్తుగడలు కొత్తగా అనిపిస్తాయి.

ప్రత్యర్థి రవి మాధవన్ (షర్ఫుద్దీన్) కళ్లలోకి చూస్తూ జాన్ చెప్పే డైలాగ్స్ — “నీ ఇమేజ్‌ని బద్దలు కొట్టడానికి నాకు కేవలం 15 నిమిషాల సమయం పట్టింది” వంటివి మాస్ ప్రేక్షకులను మెప్పిస్తాయి.క్లిష్ట పరిస్థితుల్లో తండ్రీకొడుకుల మధ్య సాగే భావోద్వేగ సన్నివేశాలు కథకు బలాన్నిస్తాయి.

దర్శకుడు బి. ఉన్నికృష్ణన్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామా , రాజకీయ అవినీతి, మీడియాపై కార్పొరేట్ నియంత్రణ వంటి సమకాలీన అంశాలను చర్చిస్తుంది. మీడియాపై కార్పొరేట్ నియంత్రణ ఎంత దారుణంగా ఉంటుందో ఇందులో చూపించారు. పారిశ్రామికవేత్త రవి మాధవన్ (షరఫుద్దీన్) తన వ్యాపార ప్రయోజనాల కోసం న్యూస్ రూమ్‌లను ఎలా వాడుకుంటాడో చూడవచ్చు.

ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ రాజకీయ, సామాజిక దృక్పథాన్ని ఎలా మార్చగలదో ఈ సినిమా స్పష్టంగా చూపిస్తుంది. ఈ పాత్రను వేరే హీరో చేసి ఉంటే చాలా మాస్ ఎలిమెంట్స్‌తో ఉండేదేమో, కానీ నివిన్ పౌలీ చాలా సెటిల్డ్‌గా నటించారు. దీనివల్ల సినిమా కథలోని అసలు అంశం పక్కదారి పట్టకుండా ఉంది.

నివిన్ తన నటనతో పాత్రలో ఎంతగా రాణించగలరో, ఎమోషనల్ సీన్స్‌లో కూడా అంతే బాగా చేయగలరని మరోసారి నిరూపించుకున్నారు. షరఫుద్దీన్ కూడా తన పాత్రలో చాలా కూల్‌గా కనిపిస్తూ నివిన్‌కు మంచి సపోర్ట్ ఇచ్చారు.బాలచంద్ర మీనన్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 

పొలిటికల్ థ్రిల్లర్‌కు ఉండాల్సిన వేగం, ఉత్కంఠ ఈ సినిమాలో తక్కువగా ఉన్నాయి. కథ చాలా నెమ్మదిగా సాగుతుంది.కథలో వచ్చే ట్విస్ట్‌లు కొత్తగా ఏమీ అనిపించవు, చాలా పాతకాలపు (90s) పొలిటికల్ డ్రామా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.

కమర్షియల్ ఎలిమెంట్స్ లేదా కామెడీ లాంటి వినోద అంశాలు అస్సలు లేవు. సినిమా అంతా రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. పక్కా పొలిటికల్ థ్రిల్లర్లను ఇష్టపడేవారైతే ఒకసారి ప్రయత్నించవచ్చు. అయితే సాధారణ ప్రేక్షకులు లేదా ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈసినిమా నచ్చకపోవచ్చు. 

చంద్రు సెల్వరాజ్ సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా, షార్ప్‌గా ఉంది.. జస్టిన్ వర్గీస్ అందించిన నేపథ్య సంగీతం (BGM) సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది.మేకింగ్ , విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!