సాధువులంతా మృత్యుంజయులేనా ? 

Sharing is Caring...

The life style of the saints is austere…………………………………..

సాధువుల జీవన శైలి కఠినంగా ఉంటుంది. భవబంధాలు వదులుకుని సర్వేశ్వరుని ప్రార్ధిస్తూ నిరంతర దీక్షలో ఉంటారు. సాధువులకు ఆహార నియమాలు ఏమీలేవు. పరిమితంగా ఆహారం స్వీకరిస్తారు. వీరంతా యోగ సాధన చేస్తారు.హిమాలయాల్లో ఉన్నవారంతా సిద్హ పురుషులని చెప్పలేం కానీ కొందరు సిద్ధ పురుషులు మాత్రం ఉన్నారు. 

మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించిన వాళ్లు వీరు. వారు కోరుకున్నప్పుడు మృత్యువు దరి చేరే సామర్ధ్యం వాళ్ళకుంటుందని అంటారు. అందుకే ఎన్నేళ్లయినా వారి శరీరం క్షీణించదు.. రోగాలు దగ్గరకు రావు. హిమాలయాల్లో సాధువుల దీర్ఘాయుష్షుకు వారు పాటించే కఠోరమైన నియమాలే కాదు.

చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం కూడా ఒక కారణం. సృష్టి కర్తపై అమిత విశ్వాసం కలిగి ఉంటారు.. ఈ లోకాన్ని సృష్టించింది.. నడిపిస్తున్నది.. నాశనం చేస్తున్నది పరమ శివుడే అని బలంగా వారు నమ్ముతారు. దాని వలన మృత్యుంజయులుగా మారతారని అంటారు.

మన యోగ శాస్త్రం లో చెప్పిన పలు ఆసనాలను, విధానాలను వీరు పాటిస్తుంటారు. యోగా ద్వారా శరీరంలోని కుండలిని శక్తి ని చైతన్య పరిచే ఆసనాలను వీరు వేస్తుంటారు.ఈ యోగాను మన సాధువులు వేల ఏళ్ళ నుంచి అనుసరిస్తున్నారు. ‘క్రియాయోగం’ వంటి విద్యల ద్వారా వీరంతా అద్భుత శక్తులను సాధిస్తున్నారు.

ఇంకా ఉపాసన,సాధనాల ద్వారా సాధువులు ఇచ్చామరణాన్నికూడా సాధించారు. ఇక నాగ సాధువులు అఘోరాల లాగ కఠినంగా ఉండరు. ఎందుకంటే వీరు ఎప్పుడు ధ్యానం చేస్తుంటారు. వీరి అంతిమ లక్ష్యం మాత్రం మానవులకు కనిపించని దేవుడిని ప్రత్యక్షంగా చూడటమే.

నాగ సాధువులకు చాలా మహిమలు తెలుసు అంటారు. కుంభమేళాలో గాని, పుష్కరాలలో గాని వారు అరుదుగా భక్తుల కోరికలను తీరుస్తుంటారు. ఈ సాధువులు గాలి లోనే ఏదైనా తాయత్తు లేదా విభూతిని సృష్టించి భక్తులకు ఇస్తుంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా  హిమాలయ గుహలలో, కొండల్లో, నదీ తీరాల్లో ఉండే సాధువులు మాత్రమే ఇలాంటివి చేస్తుంటారు.

వీరికి శరీరంపై వ్యామోహం ఉండదు. చావంటే భయం లేదు.నగ్నత్వానికి సిగ్గుపడరు. వారికి ఎండ, వాన, చలి లేదు. విభూతే వారి శరీరాన్ని అన్నింటి నుంచీ కాపాడుతుంది. చిలుమ్‌, హుక్కా వంటివి శరీరంలో వేడిని కలిగిస్తాయి. మనసుకు ఏకాగ్రతను కలిగిస్తాయి. ఇలా నిరాడంబరంగా జీవిస్తూ, నిరంతర సాధనలో ఉండేవారు కఠోర తపస్సుతో సిద్ధ పురుషులుగా మారతారు.

హిమాలయాల్లో సిద్ధ పురుషుల నియమిత జీవితం అసాధారణమైంది. అందరూ దాన్ని ఆచరించలేరు. తమ తపోశక్తితో మానవాళికి ఉపకారం చేసే  సిద్ధ పురుషులు ఈ నాటికి హిమాలయపర్వత శ్రేణుల్లో ఉన్నారు. సిద్ధ పురుషులు అజ్ఞాతంగా ఉంటూ లక్ష్య సాధనలో నిమగ్నమై ఉంటారు. 

మనస్సులోని కోరికలను పూర్తిగా పారద్రోలి నిర్మల చిత్తంతో ఆత్మయందే స్థిరంగా ఉండి సంతుష్టి పొందే స్థితిని స్థిత ప్రఙ్ఞత్వం అని అంటారు. అట్టి స్థితిని చేరుకున్న సిద్ధుని ప్రతి చర్యలో పవిత్రత,శాంతి,దైవత్వం గోచరిస్తుంది.అట్టి సిద్ధుని ముఖం ఎల్లప్పుడూ తృప్తి, ఆనందంతో తాండవిస్తుంది.

అలాంటి సిద్ధపురుషుల దర్శన భాగ్యం అందరికి కలగదు. అందరూ సిద్ధ పురుషులు కాలేరు. అలాగే సాధువులు కాలేరు. తాత్కాలిక వైరాగ్యంతో ఇల్లు వదిలి వెళ్లిన వారు కఠిననియమాలు అనుసరించలేక తిరిగి ఇంటికి వెళుతుంటారు.

కొందరు సన్యాసులు, భైరాగుల పేరుతో ఊళ్లు పట్టుకు తిరుగుతుంటారు. సన్యాసులకు చాలా నియమాలు ఉన్నాయి. వాటిని పాటించడం కూడా కష్టమే. ఏ కొద్దిమందో సాధువులుగా .. సిద్ధపురుషులుగా మారుతుంటారు. సిద్ధపురుషుల గురించి మరో సారి తెలుసుకుందాం 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!