మాజీ సీఎం,సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న కర్హల్ నియోజక వర్గం పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇక్కడ అఖిలేష్ బీజేపీ అభ్యర్థితో తలపడుతున్నారు. కాంగ్రెస్ అఖిలేష్ కి మద్దతు ఇస్తోంది.సొంత అభ్యర్ధిని బరిలోకి దింపలేదు. కాంగ్రెస్ పరోక్షంగా ఓటర్లకు సమాజ్ వాదీ పార్టీ అధినేతను గెలిపించమని చెబుతోంది.
ఈ విషయాన్నీ కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఆమధ్య సచిన్ పైలట్ మాట్లాడుతూ గతంలో రాయ్ బరేలి నుంచి సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఎస్పీ ఎవరినీ బరిలోకి దించలేదని .. అందుకే తాము అఖిలేష్ పై పోటీ పెట్ట లేదని ప్రకటించారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తున్నది. కొన్ని నియోజక వర్గాల్లో ఎస్పీపై పోటీకి దిగినప్పటికీ ..కర్హల్ లో ఎస్పీ అధినేత గెలుపు కోసం పనిచేస్తున్నది.
2004, 2009, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఎస్పీ అభ్యర్థుల్ని నిలబెట్టని విషయం వాస్తవమే. ఈ ఎన్నికల్లో కూడా ఆ రెండు పార్టీలు కలసి పోటీ చేస్తాయని మొదట్లో అనుకున్నారు. కానీ అఖిలేష్ ఎందుకో ఆసక్తి చూపలేదు.
కర్హల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్పీకి కంచుకోట. 2017, 2012,2007 ఎన్నికల్లో ఇక్కడ ఎస్పీ పార్టీ గెలిచింది. ఆ పార్టీ తరపున సోబరన్ సింగ్ యాదవ్ విజయం సాధించారు. ఈ కర్హల్ అసెంబ్లీ మెయిన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ములాయం సింగ్ యాదవ్ లోక్‌సభలో మెయిన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్హల్ లో 1.44 లక్షల మంది యాదవ్ ఓటర్లు ఉన్నారు.
70 శాతం ఓటర్లు సమాజ్‌వాదీ పార్టీ కి అనుకూలంగా ఉన్నారని అంచనా. 2017, 2019 ఎన్నికల్లో యాదవులలో 25 శాతం మంది ఓటర్లు బిజెపికి మద్దతిచ్చారని అంటారు. ఈ సారి వారి మొగ్గు ఎలా ఉంటుందో చూడాలి. అఖిలేష్ ఈ స్థానం నుంచి పోటీ చేయడం ఇదే తొలిసారి. అంతకు ముందు అజంఘడ్ నుంచి పోటీ చేసి గెలిచారు.
కాగా ఎలాగైనా అఖిలేష్‌ను ఓడించాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. గతంలో ములాయం సింగ్ యాదవ్ వ్యక్తిగత భద్రతా అధికారి గా చేసిన ఎస్‌పి సింగ్ బఘేల్‌ను రంగంలోకి దించింది.ములాయం మార్గదర్శకత్వంలోనే ఈ బఘెల్ తన రాజకీయ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. బహుజన్ సమాజ్ పార్టీలోకి వెళ్లే ముందు జలేశ్వర్ లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా మూడుసార్లు గెలిచారు.
2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలోకి మారి తుండ్ల నుంచి ఎమ్మెల్యే గా గెలిచారు. 2019 వరకు యోగి సర్కార్ కేబినెట్ మంత్రిగా చేశారు. 2019 లో ఆగ్రా స్థానం నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశాడు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో న్యాయ శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు.ఇక్కడ ప్రధాన పోటీ ఈ ఇద్దరి మధ్యనే ఉండొచ్చు.ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్నది. బఘేల్ కూడా గట్టి అభ్యర్థి కావడంతో హోరాహోరీ పోరు జరగనుంది. ఫిబ్రవరి 20 న ఈ నియోజకవర్గంలో ఓటింగ్ జరుగుతుంది.