అలరించే ఇన్వెస్టిగేటివ్ పోలీస్ డ్రామా !!

Sharing is Caring...

A movie worth watching……..

“కన్నూర్ స్క్వాడ్”… మమ్ముట్టి నటించిన మంచి చిత్రాలలో ఇది ఒకటి. ఒక అద్భుతమైన ఇన్వెస్టిగేటివ్ పోలీస్ డ్రామా. ఇది కేరళ పోలీసు విభాగంలోని ఒక ప్రత్యేక బృందం (కన్నూర్ స్క్వాడ్) చుట్టూ తిరిగే కథ. ఒక వ్యాపారవేత్త దారుణ హత్యకు గురైనప్పుడు, నిందితులను పట్టుకోవడానికి నలుగురు పోలీసుల బృందం కేరళ నుండి ఉత్తర భారతదేశంలోని మారుమూల గ్రామాలకు వెళుతుంది.

ఎటువంటి అత్యాధునిక సాంకేతికత అందుబాటులో లేని సమయంలో, కేవలం వారి తెలివితేటలు,  అనుభవంతో నిందితులను ఎలా పట్టుకున్నారనేదే కథాంశం. ఇందులో హీరోయిన్ లేదు .డ్యూయెట్స్,క్లబ్ సాంగ్స్ లేవు. 

ఎస్పీ జార్జ్ మార్టిన్ పాత్రలో మమ్ముట్టి నటన చాలా హుందాగా ఉంటుంది. ఆయన ఎక్కడా అతిగా ప్రవర్తించకుండా, ఒక మెచ్యూర్డ్ ఆఫీసర్‌గా అద్భుతంగా నటించారు.ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో ఎదుర్కొనే ఇబ్బందులు, నిద్రలేని రాత్రులు, ప్రయాణాలు సినిమాలో చాలా సహజంగా చూపించారు.

సినిమా సెకండాఫ్ అంతా రోడ్ ట్రిప్ తరహాలో సాగుతుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని తిక్రీ  గ్రామంలో యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్. పోలీసులు ఒక నేరస్థుడిని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు, ఆ గ్రామస్థులంతా కలిసి పోలీసులపై దాడి చేసే సన్నివేశం అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటుంది.

మసక చీకటి లో, ఇరుకైన సందుల్లో ఈ ఫైట్ జరుగుతుంది. కెమెరా వర్క్ చాలా వేగంగా ఉండి, మనం కూడా ఆ పోలీసులతో పాటే ఆ గొడవలో ఉన్నామా అనే అనుభూతిని కలిగిస్తుంది. మమ్ముట్టి ఈ యాక్షన్ సీన్ లో ఎంతో ఎనర్జిటిక్ గా నటించారు. భారీ డైలాగులు లేకుండా, కేవలం మనుగడ కోసం చేసే పోరాటంలా ఇది కనిపిస్తుంది.

ఆ గ్రామంలో ఉద్రిక్తత మొదలైనప్పటి నుండి, పోలీసులు తప్పించుకునే వరకు మ్యూజిక్ డైరెక్టర్  సుశీన్ శ్యామ్ అందించిన  బిజియం (BGM) ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సీన్ కోసం నిజంగానే ఉత్తర భారత దేశంలోని కొన్ని లొకేషన్లలో షూటింగ్ చేశారు. స్థానిక వాతావరణం, అక్కడి వ్యక్తుల ఆహార్యం సినిమాకు మరింత నేటివిటీని తీసుకొచ్చాయి.

టీమ్ హిందీ భాష రాక ఇబ్బందులు పడటం సహజంగా ఉంటుంది. ‘కన్నూర్ స్క్వాడ్’, నిందితులను వెతుకుతూ ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలు, మురికివాడల్లో ఇన్వెస్టిగేషన్ చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నేపాల్ కి దగ్గర్లోని అడవుల్లో క్లయిమాక్స్ దృశ్యా లను బాగా చిత్రీకరించారు. సినిమా మొత్తం చూసాకా ఇన్వెస్టిగేషన్ ఇలా ఉంటుందా అని ఫీల్ అవుతాం. 

పోలీస్ డిపార్ట్మెంట్లో అంతర్గత సమస్యలు, నిధుల లేమి,పై అధికారులు ఎలా బిహేవ్ చేస్తారనేది కూడా చూపారు.అలాగే టీమ్ లో విభేదాలను  బాగా తీశారు. సినిమా సుమారు 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ సీన్లు కొన్ని చోట్ల సాగదీసినట్లు అనిపించవచ్చు. కథలోకి వెళ్లడానికి దర్శకుడు కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నారు.

ఫాస్ట్ పేస్ యాక్షన్ సినిమాలు కోరుకునే వారికి ఫస్టాఫ్ కొంచెం స్లోగా అనిపించవచ్చు.ఈ సినిమా దర్శకుడు రోబీ వర్గీస్ రాజ్ స్వయంగా ఒక సినిమాటోగ్రాఫర్  కావడంతో రాహిల్ పనితీరు ఈ సినిమాలో చాలా సహజంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కేరళ నుండి ఉత్తర భారతదేశం వరకు సాగే రోడ్ జర్నీలో వచ్చే ల్యాండ్‌స్కేప్ షాట్లు,  రాత్రిపూట వచ్చే యాక్షన్ సీన్లను రాహిల్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు.

నటీ నటులందరూ పాత్రల్లో ఒదిగిపోయారు. స్క్వాడ్ సభ్యులు కూడా బాగా చేశారు.  సుశీన్ శ్యామ్ అందించిన సంగీతం సినిమాలోని మూడ్‌ను పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేసింది. 2023లో విడుదలైన ఈ మలయాళ చిత్రం ప్రస్తుతం JIO+ హాట్‌స్టార్లో తెలుగు వెర్షన్  అందుబాటులో ఉంది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!