Suspenseful psycho-thriller……….
అనసూయ’ (2007) ఇదొక సస్పెన్స్ సైకో-థ్రిల్లర్ చిత్రం. నటుడు రవిబాబు దర్శకత్వం వహించారు.అప్పట్లో సినిమా బాగానే ఆడింది. భూమిక చావ్లా, అబ్బాస్ ప్రధాన పాత్రల్లో నటించారు.
కథ ఏమిటంటే ?
అనసూయ (భూమిక చావ్లా) ఒక టీవీ ఛానెల్‌లో చేరిన ధైర్యవంతురాలైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. నగరంలో అవయవాల దొంగతనం చేస్తూ, వరుసగా దారుణ హత్యలకు పాల్పడే ఒక సైకో కిల్లర్‌ను పట్టుకోవడానికి ఆమె ప్రయత్నిస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్‌లో ఆమెకు పోలీస్ ఆఫీసర్ (అబ్బాస్) సహాయం లభిస్తుంది.
ఈ క్రమంలో గులాబీ గోవింద్ (రవిబాబు) అనే వ్యక్తిపై అనుమానం వస్తుంది. అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? గులాబీ గోవింద్‌కు దీనికి సంబంధం ఏమిటి? అనసూయ ఈ గుట్టును ఎలా రట్టు చేసింది? అనేదే మిగిలిన ఉత్కంఠభరితమైన కథ.
టైటిల్ రోల్ పోషించిన భూమిక తన కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను కనబరిచింది. జర్నలిస్ట్‌గా ఆమె హావభావాలు, నటన సినిమాకు ప్రాణం పోశాయి..గులాబీ గోవింద్ పాత్రలో రవిబాబు నటన బాగుంటుంది. ఎస్ ఐ గా అబ్బాస్ బాగా చేశారు. ఇతర నటీ నటులు పాత్రల పరిధిలో బాగా నటించారు. పాప నటన ఆకట్టుకుంటుంది.
ఇంగ్లీష్ సినిమాలు చూసే వారికి ‘అనసూయ’ వినూత్నమైన థ్రిల్లర్ అనిపించకపోవచ్చు. ఇది రొటీన్ టాలీవుడ్ సినిమాల ధోరణి నుండి వచ్చిన ఒక వెరైటీ మూవీ.ఇందులో ఎలాంటి అర్థం లేని పాటలు,డాన్సులు లేవు. రవిబాబు రాసుకున్న కథకు పరుచూరి బ్రదర్స్ స్క్రీన్‌ప్లే అందించారు. నివాస్ సంభాషణలు సమకూర్చారు. ప్రధమార్ధం ఎక్కడా ల్యాగ్ లేకుండా కథ వేగంగా సాగుతుంది.ప్రతి ఒక్క పాత్రను ప్రధాన కథాంశంతో చాలా చక్కగా ముడిపెట్టారు.
సినిమాలోని కొన్ని భాగాలు ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేసి ఉత్కంఠను రేకెత్తిస్తే, మరికొన్ని భాగాలు (ఉదాహరణకు ఫ్లాష్‌బ్యాక్,క్లైమాక్స్) సాగదీసినట్లుగా అనిపిస్తాయి.కొన్నిసీన్లు కాస్త సినిమాటిక్‌గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ వరకు సినిమాలో సస్పెన్స్‌ను కొనసాగించడంలో దర్శకుడు విజయం సాధించాడు.
కానీ,సెకండ్ హాఫ్‌లో సినిమా కథ కాస్త ఊహించదగిన విధంగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు ఆకట్టుకునేలా తీశారు. రవిబాబు లవ్ ఎపిపోడ్ కొంచెం అతిగా అనిపిస్తుంది.సినిమా క్లైమాక్స్ మాత్రం చాలా లెంగ్తీగా అనిపిస్తుంది. చేజింగ్ సీన్స్ బాగుంటాయి. కథలో చాలా చోట్ల లాజికల్ లోపాలున్నాయి.ఎక్కువగా లాజిక్స్ వెతకకుండా చూడాలి..
అత్యుత్తమ హారర్/థ్రిల్లర్/సస్పెన్స్ దర్శకులు మినహా, మిగిలిన దర్శకులంతా అక్కడక్కడా కథలో ప్రేక్షకులను భయపెట్టడానికి లేదా ఒక ఎఫెక్ట్ కోసం కొన్ని సీన్లను పెడతారు, కానీ వాటికి సరైన వివరణలు ఉండవు. ఈ చిత్రానికి కథా రచయిత, దర్శకుడైన రవిబాబు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు
నైపుణ్యంతో కూడిన కెమెరా పనితనం, ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమా చూసే అనుభూతిని సరైన పంథాలో నడిపిస్తూ ప్రేక్షకుడికి మజాను అందిస్తాయి..సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రతి సీన్‌ను ఎలివేట్ చేసింది.
సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ లైటింగ్, డార్క్ విజువల్స్ థ్రిల్లర్ మూడ్‌ను పర్‌ఫెక్ట్‌గా సెట్ చేశాయి.థ్రిల్లర్ సినిమా కావడంతో,రాత్రి పూట వచ్చే సీన్ల కోసం దర్శకుడు ఎక్కువ లైట్లను ఉపయోగించలేదు. కొన్ని హాలీవుడ్ చిత్రాల (ఉదాహరణకు ‘ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్’) ఛాయలు అక్కడక్కడా కనిపిస్తాయి.హాలీవుడ్ థీమ్ మ్యూజిక్‌ను కొన్ని చోట్ల యథాతథంగా వాడుకున్నారనే విమర్శలున్నాయి.
మొత్తంగా చూసుకుంటే, థ్రిల్లర్ జానర్‌లో ‘అనసూయ’ ఒక విభిన్నమైన చిత్రం. ఇలాంటి సినిమాలను ఇష్టపడే వారికి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. ఆసక్తి ఉన్నవారు యూట్యూబ్ లో ఈసినిమా చూడవచ్చు.

