ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ

Sharing is Caring...

Family thriller……..

వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ ‘నా వైఫ్ మిస్సింగ్’ (Naa Wife Missing). ‘కొత్త బంగారు లోకం’ (2008) చిత్రం తర్వాత ఈ హిట్ జంట కలిసి నటించిన సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. స్వాతి ప్రకాశ్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేరుగా ‘ఆహా’ (Aha) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది.

కథేంటంటే?

బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసే బాలు (వరుణ్ సందేశ్), స్వప్న (శ్వేతా బసు ప్రసాద్)లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అయితే, వివాహానికి ముందే స్వప్నకు అబాన్ అనే వ్యక్తితో ప్రేమకథ ఉంటుంది. పెళ్లయిన తర్వాత  భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వస్తాయి. ఒకరోజు గుడికి వెళ్లిన సమయంలో స్వప్న అకస్మాత్తుగా మాయమవుతుంది.

భార్య కనిపించట్లేదని బాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో అనుమానాలు బాలు వైపు మళ్లుతాయి.  పోలీసులు అతడిని అరెస్ట్ చేస్తారు. అసలు స్వప్న నిజంగానే కిడ్నాప్ అయ్యిందా? లేక ప్రియుడితో వెళ్లిపోయిందా? ఈ మిస్సింగ్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అనే ట్విస్టులతో కథ సాగుతుంది.

చాలా ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ స్క్రీన్ షేర్ చేసుకోవడం పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. ఇద్దరూ తమ పాత్రలకు తగ్గట్టు మెచ్యూర్డ్ నటనను కనబరిచారు. ముఖ్యంగా తమ పాత్రలపై వీక్షకులకు అనుమానం కలిగించడంలో సక్సెస్ అయ్యారు.

సినిమాలో వచ్చే రెండు ప్రధాన ట్విస్టులు బాగున్నాయి. సాధారణ ఫ్యామిలీ డ్రామాలా మొదలై.. ఆ తర్వాత క్షుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్ లాంటి ఆసక్తికరమైన అంశాలతో కథను మలుపు తిప్పిన విధానం కొత్తగా అనిపిస్తుంది.సినిమా పాయింట్ బాగున్నప్పటికీ, స్క్రీన్‌ప్లే చాలా చోట్ల రొటీన్‌గా సాగుతుంది. దీనివల్ల థ్రిల్లర్ సినిమాల్లో ఉండాల్సిన ఉత్కంఠ  కొన్ని చోట్ల మిస్ అయింది.

భార్యాభర్తల మధ్య ఉండే బంధం లేదా భావోద్వేగాలను ఇంకాస్త బలంగా చూపించి ఉంటే సినిమా ప్రేక్షకుడికి మరింత కనెక్ట్ అయ్యేది. స్వప్న అబాన్ వ్యవహారశైలి నచ్చక వెంటనే మనసు మార్చుకుని బాలు కావాలనుకోవడం చిత్రం గా అనిపిస్తుంది. అలా పాత్రలు ఒక్కసారిగా మారిపోయే సీన్స్ ప్రేక్షకుడికి అంతగా కనెక్ట్ అవ్వవు. పెద్దలు కూడా పిల్లల మనసెరిగి ప్రవర్తించాలనే సందేశాన్ని కథలో ఇమిడ్చారు. సినిమా చాలా చోట్ల చాలా స్లోగా సాగుతుంది.

ఇన్వెస్టిగేషన్ సీన్స్,కథలో క్షుద్రపూజలు, మిస్టరీ లాంటి కొత్త అంశాలు జోడించినా.. స్క్రీన్ ప్లే మాత్రం పాత కాలపు థ్రిల్లర్ సినిమాల తరహాలోనే సాగుతుంది. కొన్ని సీన్స్‌లో అస్సలు లాజిక్ ఉండదు. సినిమా ముగింపు మరింత ఆకట్టుకునేలా ఉండాల్సింది. ఎటువంటి బలమైన ఇంపాక్ట్ లేకుండా కథను చాలా త్వరగా ముగించేసినట్లు అనిపిస్తుంది. ఎస్ఐ రవి పాత్రలో కమెడియన్ ప్రవీణ్ నటన కూడా ఆకట్టుకుంటుంది.మాంత్రికుడు పాత్రధారి బాగా చేసాడు.మిగిలిన నటీ నటులు అందరూ బాగానే చేశారు.  

సినిమా నిడివి సుమారు 1 గంట 39 నిమిషాలుమాత్రమే .. సెకండ్ హాఫ్‌లో చాలా సాగదీత సీన్స్ ఉన్నాయి. ఎడిటర్ మరికొన్ని అనవసరమైన సీన్లను కట్ చేసి ఉంటే సినిమా మరింత గ్రిప్పింగ్‌గా ఉండేది. ఈ చిత్రానికి శ్రీనివాస్ జె. రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

ఒక  థ్రిల్లర్ సినిమాకు కావలసిన మూడ్‌ను సెట్ చేయడంలో కెమెరామెన్ మంచి ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా సినిమాలో వచ్చే సస్పెన్స్ సీన్లు, క్షుద్ర పూజల నేపథ్యంలో సాగే చీకటి (Dark Theme) సన్నివేశాలను కెమెరాలో చాలా సహజంగా, కాస్త భయపెట్టేలా క్యాప్చర్ చేశారు. లైటింగ్,  ఫ్రేమింగ్ సినిమా జోనర్‌కు సరిగ్గా సరిపోయాయి. 

సాయి కార్తీక్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) కొన్నిసస్పెన్స్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. పాటల పరంగా యావరేజ్ అయినప్పటికీ, థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పరంగా మాత్రం సాయి కార్తీక్ కి మంచి మార్కులే పడ్డాయి. 
మొత్తం గా ఇదొక యావరేజ్ థ్రిల్లర్ మూవీ. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా, వీకెండ్‌లో ఓటీటీలో చూడదగ్గ సినిమా ఇది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!