Investigation thriller …….
పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘ప్రధమ దృష్టియ కుట్టక్కర్’ (Pradhama Drishtiya Kuttakkar)..షాహద్ నిలంబూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ‘దృశ్యం’ ‘నాయట్టు’ సినిమాల తరహా మైండ్ గేమ్స్, సస్పెన్స్‌తో సాగుతుంది.
కథ ఏమిటంటే ?
అలీనా అబ్రహం (పార్వతి) తన భర్త మరణం తర్వాత కారుణ్య ప్రాతిపదికన పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధిస్తుంది. ఒక రోజు అలీనాతో పాటు తోటి పోలీస్ సిబ్బంది దివ్య (ఉన్నిమయ ప్రసాద్), దాసన్ (సిద్ధార్థ్ భరతన్), శ్రీనాథ్ (మాథ్యూ థామస్) లతో నైట్ షిఫ్ట్ డ్యూటీలో ఉండగా ఒక నేరస్థుడితో గొడవ జరుగుతుంది.
ఆ గొడవలో అనుకోకుండా ఆ నేరస్థుడు మరణిస్తాడు.చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే నేరస్థులుగా మారే పరిస్థితి వస్తుంది. దాంతో వారు భయంతో సీసీటీవీ ఫుటేజీలను నాశనం చేసి,శవాన్ని మాయం చేస్తారు. నిజాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తారు. అదే సమయంలో టౌన్ లో ఒక మిలటరీ వ్యక్తి హత్య జరుగుతుంది.
ఈ కేస్‌ను ఇన్వెస్టిగేట్ చేయడానికి సీనియర్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ హారిస్ మీరన్ (విజయరాఘవన్) రంగంలోకి దిగుతాడు.ఆకేసును విచారిస్తుండగానే ఆయన దృష్టి పోలీస్ స్టేషన్ లో జరిగిన గొడవపైకి మళ్లుతుంది. అలీనా, ఇతర సిబ్బంది ఎలా బయటపడ్డారు అనేదే మిగతా కథ.
అలీనా పాత్రలో పార్వతి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. పోలీస్ యూనిఫామ్‌లో ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయి. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే అసలు కథలోకి వెళ్తుంది. కథనం అంతటా ఉత్కంఠ , సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్‌లు ఊహించని విధంగా ఉంటాయి.
సీనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా విజయరాఘవన్ తన నటనతో సినిమాకు గంభీరత్వాన్ని తెచ్చారు. ఆయన పార్వతి మధ్య సాగే మైండ్ గేమ్ సీన్లు సినిమాకు ప్రధాన ఆకర్షణ. నటీనటులంతా బాగా నటించారు.నేరస్థుడు పోలీస్ స్టేషన్ లోనే మరణించే సీన్ సినిమాను ఒక్కసారిగా మలుపు తిప్పుతుంది. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే నేరస్థులుగా మారిన ఆ క్షణంలో వారిలో కనిపించే భయం,కంగారు చాలా సహజంగా ఉంటాయి.
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హారిస్ మీరన్ కేస్ దర్యాప్తును ప్రారంభించినప్పుడు,అలీనాను ,ఇతరులను ప్రశ్నించే ప్రతి సీన్ ఒక మైండ్ గేమ్‌లా సాగుతుంది. హారిస్ మీరన్ అడిగే ప్రశ్నలకి అలీనా ఇచ్చే సమాధానాలు, ఆమె ముఖంలో కనిపించే సంయమనం థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి.
సినిమా చివరి 20 నిమిషాలు, క్లైమాక్స్ లో వచ్చే మలుపులు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. ముఖ్యంగా అలీనా తనను, తనతోటి సిబ్బందిని కాపాడుకోవడానికి వేసే చివరి ప్లాన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. పోలీస్ డాగ్స్ వచ్చి స్టేషన్ చుట్టు పక్కల ప్రాంతాలలో తిరిగే సీన్లు ఉత్కంఠ భరితంగా సాగుతాయి.
కథా పరంగా చిన్న చిన్న లోపాలున్నప్పటికీ ఈ క్రైమ్ డ్రామా ను చూడవచ్చు.కాకపోతే ఫైట్లు, కమర్షియల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఆశించే మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. సినిమాకు సంగీతం, కెమెరా వర్క్ ప్రధాన సాంకేతిక బలాలుగా నిలిచాయి. ఈ రెండు విభాగాలు సినిమాలోని టెన్షన్‌ను, మూడ్‌ను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించాయి.
ముజీబ్ మజీద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు ప్రాణం పోసింది.ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పార్వతి మధ్య సాగే మైండ్ గేమ్ సీన్స్‌లో మ్యూజిక్ చాలా గంభీరంగా, సీన్ లోని డ్రామాను ఎలివేట్ చేసేలా ఉంటుంది. రాబీ వర్గీస్ రాజ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
సినిమాలోని చాలా భాగం పోలీస్ స్టేషన్ లోపల ,రాత్రి వేళల్లోనే సాగుతుంది. అయినప్పటికీ, లైటింగ్, ఫ్రేమింగ్‌ను చాలా సహజంగా చూపించారు.క్యారెక్టర్ల ముఖాల్లోని భయం, గందరగోళం, ఆలోచనలను క్యాప్చర్ చేయడానికి ఉపయోగించిన క్లోజప్ షాట్స్ చాలా అద్భుతంగా కుదిరాయి.
కెమెరా మూవ్మెంట్స్ ప్రేక్షకుడిని కూడా పోలీస్ స్టేషన్లో ఒక భాగంగా మార్చేలా, కథతో పాటు ప్రయాణించేలా చేస్తాయి. మొత్తం మీద ‘ప్రధమ దృష్టియ కుట్టక్కర్’ మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు, బలమైన నటనతో సాగే ఒక చూడదగిన ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్. ‘దృశ్యం’, ‘నాయట్టు’ వంటి చిత్రాలను ఇష్టపడే థ్రిల్లర్ మూవీ లవర్స్ ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకూడదు. ప్రస్తుతానికి ఇది నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.

