Comedy drama ……..
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు రాజా కరుప్పసామి తెరకెక్కించిన వినూత్న కామెడీ డ్రామా ‘మొద రాత్రి’ (తెలుగులో ‘మొదటి రాత్రి’ ) ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. టైటిల్ చూసి ఇది అడల్ట్ కామెడీ అనుకుంటే పొరపాటే. కుటుంబం అంతా కలిసి హాయిగా నవ్వుకునేలా ఈ వెడ్డింగ్ కామెడీని మలిచారు.
కథాంశం
కథ పల్లెటూరి పెళ్లి వాతావరణంలో మొదలవుతుంది. మారుతనాయగం (రిషికాంత్), ముత్తుసెల్వి (అనిష్మా)లకు పెద్దలు కుదిర్చిన పెళ్లి జరుగుతుంది. ఒకరికొకరు అస్సలు పరిచయం లేని ఈ కొత్త జంటకు శోభనం ఏర్పాటు చేస్తారు. అయితే, ఆ అర్ధరాత్రి ఆ గది నుండి పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు ఇద్దరూ అదృశ్యమవుతారు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? వారు ఎందుకు బయటకు వెళ్లారు? వారి కోసం ఇరు కుటుంబాలు వెతికే క్రమంలో ఏం జరిగింది? ఎలాంటి నవ్వులు పూశాయి అనేదే మిగతా కథ.
కొత్త జంటగా రిషికాంత్, అనిష్మా అనిల్‌కుమార్ ల నటన చాలా సహజంగా ఉంది. వారి మధ్య ఉండే సంకోచం, భయం, ఆ తర్వాత వచ్చే సిట్యుయేషనల్ కామెడీ బాగుంటాయి.పెళ్లిళ్లలో జరిగే గొడవలు, మద్యం సేవించి కొందరు చేసే హంగామాను దర్శకుడు చాలా రియలిస్టిక్‌గా చూపించాడు.
ఫస్ట్ హాఫ్ సరదాగా సాగినప్పటికీ, సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్లు కాస్త నెమ్మదిస్తాయి. కథ ఎలా ముగుస్తుందో ముందే గెస్ చేసేలా ఉండటం ఒక చిన్న లోపం. సినిమాలో పాత్రల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని పాత్రల రిలేషన్స్ కన్ఫ్యూజ్ చేస్తాయి.
నటీనటులు అందరూ బాగా నటించారు. సెల్వి ప్రేమికుడి పాత్రను బాగా డిజైన్ చేశారు. అతని స్నేహితులు వెంటపడి టీజ్ సన్నివేశాలు బాగుంటాయి. అలాగే ఫస్ట్ నైట్ కోసం కొత్త మంచం డెలివరీ చేసే షాపు ఓనర్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది.
తెల్లవారేసరికి గదిలో జంట లేరని తెలిసి, పెళ్లి కూతురు తరపు వారు పెళ్లి కొడుకు వాళ్లని, పెళ్లి కొడుకు తరపు వారు పెళ్లి కూతురు వాళ్లని అనుమానిస్తూ చేసుకునే గొడవలు, వెతుకులాట సినిమాకే పెద్ద అసెట్.పెళ్లిళ్లలో తాగేసి కొందరు బంధువులు చేసే అల్లరి, వారు మాట్లాడే లాజిక్ లేని డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి.
కొన్ని సన్నివేశాలు రిపీటెడ్‌గా అనిపించి కథ ముందుకు సాగకుండా సాగదీసినట్లు అనిపిస్తుంది.ఇష్టం లేకుండానే వివాహ బంధంలోకి అడుగు పెట్టిన వధూవరుల మానసిక స్థితి, వారు ఎదుర్కొనే భావోద్వేగాలను దర్శకుడు తెరపై చక్కగా ఆవిష్కరించారు.
కథకు మూలమైన హీరో, హీరోయిన్ల వ్యక్తిగత సమస్యలు లేదా వారి ఆలోచనలను మరింత బలంగా చూపించి ఉంటే సినిమా ఎమోషనల్‌గా కూడా బాగా కనెక్ట్ అయ్యేది. కానీ దర్శకుడు కేవలం కామెడీ పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. మొత్తంగా ఇవి కొన్ని లోపాలే అయినప్పటికీ సినిమా చూసే మూడ్‌ను పాడుచేయవు.
పిల్లలకు బలవంతపు పెళ్లిళ్లు చేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో దర్శకుడు చక్కగా చూపారు. ఆర్ధిక శక్తి లేకుంటే ప్రేమ జోలికి వెళ్ళకూడదు అని కూడా హెచ్చరించారు.పెద్దలు పిల్లల భవిష్యత్తును నిర్ణయించేటప్పుడు వారి మనోభావాలను కూడా గౌరవించాలి. సాంప్రదాయాల పేరుతో ఇద్దరు వ్యక్తుల జీవితాలను బలవంతంగా ముడిపెట్టడం సరికాదనే సందేశాన్నిఈ సినిమా ఇస్తుంది.
‘మొదటి రాత్రి’ సినిమాలో సంగీతం,కెమెరా పనితనం రెండూ కథలోని గ్రామీణ వాతావరణాన్ని, పెళ్లి గందరగోళాన్ని ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపించడంలో కీలక పాత్ర పోషించాయి. ఇవి సినిమాకు ప్రధాన సాంకేతిక బలాలుగా నిలిచాయి.
ఈ సినిమాకు భరత్ శంకర్ పల్లెటూరి వెడ్డింగ్ డ్రామాకు సరిపోయేలా మ్యూజిక్ అందించారు. సురేంద్రన్ పరంజోతి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. కథ ఎక్కువగా ఒకే రాత్రి, పెళ్లి ఇల్లు, పల్లెటూరి పరిసరాల్లో జరుగుతుంది. నైట్ సీన్స్ కోసం వాడిన రియలిస్టిక్ లైటింగ్, గ్రామీణ వాతావరణాన్ని చాలా సహజంగా, అందంగా చూపించాయి.
పెళ్లి ఇంట్లోని హడావుడిని, క్యారెక్టర్ల ముఖాల్లోని హావభావాలను క్లోజప్ షాట్స్‌లో చాలా అద్భుతంగా క్యాప్చర్ చేశారు. పెళ్లి గందరగోళాన్ని విజువల్‌గా చాలా రిచ్‌గా ప్రెసెంట్ చేశారు.
మొత్తంగా, భరత్ శంకర్ సంగీతం, సురేంద్రన్ విజువల్స్ కలిసి ఈ హ్యూమరస్ వెడ్డింగ్ డ్రామాను స్క్రీన్ పై మరింత లైవ్లీగా మార్చాయి. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.

