Mystery crime thriller………
‘కర్మాఖ్య’ (Karmakhya) సినిమా అసలు పేరు ‘కామాఖ్య’.. సెన్సార్,లీగల్ కారణాల వల్ల దీనిని ‘కర్మాఖ్య’గా మార్చారు. అభినయ కృష్ణ ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథాంశం
కామాఖ్య (సమైరా) అనే యువతి తన రూమ్మేట్ ప్రవల్లిక (శరణ్య ప్రదీప్)కు బదులుగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ పని మీద వైజాగ్ శివార్లలోని నవోదయ కాలనీలో ఉన్న సరోజిని (అభిరామి), ఆనంద్ దంపతుల ఇంటికి వెళ్తుంది.ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన దగ్గరి నుండి కామాఖ్యకు వింత అనుభవాలు ఎదురవుతాయి.
ఆ దంపతులు చనిపోయిన తమ కూతురిని తాంత్రిక పూజల ద్వారా మళ్లీ బతికించుకోవాలని, అందుకోసం కామాఖ్యను నరబలి ఇవ్వాలని ప్లాన్ చేస్తారు. మరోవైపు లంచగొండి పోలీస్ ఆఫీసర్ తిరుపతి (సముద్రఖని) ఈ కేస్‌లోకి ఎలా ఎంటర్ అయ్యాడు? అసలు అస్సాంలోని కామాఖ్యా దేవి శక్తిపీఠానికి, ఈ కథకు ఉన్న లింక్ ఏంటి? కామాఖ్య ఆ సైకో ఫ్యామిలీ నుండి ఎలా తప్పించుకుంది? అనేదే మిగతా కథ.
కొత్త అమ్మాయి అయినప్పటికీ సమైరా ప్రధాన పాత్రలో బాగా నటించింది. కూతురిని కోల్పోయిన బాధలో సైకోలుగా మారే తల్లిదండ్రులుగా అభిరామి, ఆనంద్ తమ నటనతో భయపెట్టారు. శరణ్య ప్రదీప్ పాత్ర కూడా ఊహించని ట్విస్ట్‌తో సర్ప్రైజ్ చేస్తుంది.
ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లో వచ్చే సస్పెన్స్ ఎలిమెంట్స్, నరబలి సీన్స్, క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ వచ్చే మలుపులు ప్రేక్షకులలో కుతూహలాన్ని పెంచుతాయి. సినిమా ప్రారంభంలో పాత్రల పరిచయం, కథలోకి వెళ్లడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల మొదటి 20-30 నిమిషాలు చాలా నెమ్మదిగా సాగుతుంది.
హీరోయిన్ కామాఖ్య ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన దగ్గరి నుండి కథ వేగం పుంజుకుంటుంది. వరుసగా వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తాయి. అభిరామి, ఆనంద్ దంపతులు చేసే తాంత్రిక పూజల సీన్లు చాలా గ్రిప్పింగ్‌గా ఉంటాయి.
హీరోయిన్ ఆ సైకో ఫ్యామిలీ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో, ఒక మృతదేహం బయటపడే సీన్ కథను అప్పటివరకు ఉన్న డివోషనల్ మిస్టరీ నుండి ఒక పక్కా క్రైమ్ థ్రిల్లర్ మోడ్‌లోకి మారుస్తుంది.హోమ్లీ పాత్రలు చేసే శరణ్య ప్రదీప్ (ప్రవల్లిక) క్యారెక్టర్ ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకులు ఊహించరు. సినిమా ఎండ్ లో ట్విస్ట్ కూడా అంతే.
నటి అభిరామి ఒక సాధారణ తల్లి పాత్ర నుండి నరబలి ఇచ్చేంతటి సైకోగా మారే క్రమంలో ఆమె చూపించిన వేరియేషన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సినిమా ప్రారంభంలో ఎంతో సాత్వికంగా, హోమ్లీగా కనిపించే అభిరామి.. హీరోయిన్‌కు మత్తుమందు ఇచ్చి బంధించిన తర్వాత ఒక్కసారిగా తన నటనతో షాక్ ఇస్తుంది. ఆమె ముఖంలో కనిపించే ఆ రాక్షసానందం ప్రేక్షకుల్లో భయాన్ని కలిగిస్తుంది.
తాంత్రిక పూజలు చేసే సన్నివేశాలలో కళ్లు పెద్దవి చేస్తూ, వికృతమైన నవ్వు నవ్వుతూ ఆమె చేసే సైకో చేష్టలు గగుర్పాటు కలిగిస్తాయి.సముద్రఖని లంచగొండి పోలీస్‌గా బాగానే చేసాడు. ఆయన క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం అంత గొప్పగా లేదు. పాత్ర పరిధి తక్కువే. కథా పరంగా లోపాలు ఉన్నాయి.
సంగీత దర్శకుడు గ్యాని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం. తాంత్రిక పూజల సీన్లలో ఆయన ఇచ్చిన మ్యూజిక్ డివైన్,హారర్ ఫీలింగ్‌ను కల్పిస్తుంది.ఈ చిత్రానికి కుషేందర్ రమేష్ రెడ్డి కెమెరామెన్‌గా వ్యవహరించారు.ఈ సినిమా కథలో ఎక్కువ భాగం ఒక ఇంటి లోపల సాగుతుంది.
ఒకే లొకేషన్ అయినప్పటికీ, ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వకుండా తన కెమెరా యాంగిల్స్,డార్క్ అండ్ గ్రిట్టీ లైటింగ్ ద్వారా భయానకమైన వాతావరణాన్ని సృష్టించడంలో కుషేందర్ రమేష్ రెడ్డి మంచి ప్రతిభ కనబరిచారు.
‘కర్మాఖ్య’ మూఢనమ్మకాల నేపథ్యంలో సాగే ఒక మిస్టరీ థ్రిల్లర్. థియేటర్ల కంటే ఓటీటీలో చూడటానికి ఈ తరహా సినిమాలు బాగా సెట్ అవుతాయి. స్లో-బర్న్ సస్పెన్స్ చిత్రాలను ఇష్టపడేవారు జియో హాట్ స్టార్‌లో ఒకసారి చూడవచ్చు.

