Investigative drama …….
‘రాత్ అకేలీ హై: ది బన్సల్ మర్డర్స్’ (Raat Akeli Hai: The Bansal Murders) క్రైమ్ థ్రిల్లర్ సినిమా. నవాజుద్దీన్ సిద్దిఖీ, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో 2020లో వచ్చిన సూపర్ హిట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘రాత్ అకేలీ హై’ చిత్రానికి ఇది అఫీషియల్ సీక్వెల్. హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేరుగా Netflix ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది.
కథాంశం
ఈ సీక్వెల్‌లో కూడా నవాజుద్దీన్ సిద్దిఖీ చురుకైన పోలీస్ ఆఫీసర్ ఇన్‌స్పెక్టర్ జటిల్ యాదవ్ పాత్రలో కనిపిస్తాడు. కాన్పూర్‌లో ఒక పెద్ద మీడియా సామ్రాజ్యాన్ని నడిపే,అత్యంత ప్రభావవంతమైన ధనిక ‘బన్సల్ కుటుంబం’ లోని ఐదుగురు సభ్యులు ఒకే రాత్రి వారి బంగ్లాలోనే దారుణంగా హత్యకు గురవుతారు.
ఆ కుటుంబంలో మిగిలిన ముగ్గురు బతికి ఉన్న సభ్యులలో ఒకరైన మీరా (చిత్రాంగద సింగ్) ఈ హత్యలు తన డ్రగ్స్ బానిసైన తమ్ముడే చేశాడని చెప్తుంది. కానీ జటిల్ యాదవ్‌కు ఇందులో ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని అనుమానం వస్తుంది. ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించాడు అనేది మిగతా కథ.
నవాజుద్దీన్ సిద్దిఖీ సినిమాను వన్-మ్యాన్ షోలా నడిపించాడు. ఫస్ట్ పార్ట్ లాగే దీని బ్యాక్‌డ్రాప్, డార్క్ అండ్ గ్రిట్టీ అట్మాస్పియర్, నేపథ్య సంగీతం ప్రేక్షకులకు మంచి సస్పెన్స్ అనుభూతిని ఇస్తాయి. రేవతి, చిత్రంగద సింగ్‌ల నటన కూడా ఆకట్టుకుంటుంది.
సినిమా కథ కాస్త నెమ్మదిగా సాగుతుంది. సస్పెన్స్ ఎలిమెంట్స్ కొంత ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తాయి. సినిమా నిడివి కూడా కొంచెం ఎక్కువే.
సినిమా ప్రారంభంలోనే ఎలాంటి శబ్దం లేకుండా, నిశ్శబ్దంగా సాగే ఒక భయానకమైన క్రైమ్ సీన్‌తో కథ మొదలవుతుంది. ఆ తర్వాత బన్సల్ కుటుంబంలోని సభ్యుల మృతదేహాలు పడి ఉండటం,రక్తపు మరకలతో మీరా బన్సల్ (చిత్రాంగద సింగ్) ఎంట్రీ సీన్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.
నవాజుద్దీన్ సిద్ధిఖీ (జటిల్ యాదవ్) బన్సల్ బంగ్లాలోకి అడుగుపెట్టిన దగ్గరి నుండి ప్రతి చిన్న విషయాన్ని గమనించే సీన్లు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. కేస్ క్లోజ్ చేయమని పై అధికారులు ఒత్తిడి తెస్తున్నా, అతను తనదైన శైలిలో నిజాలను వెలికితీసే విచారణా శైలి ఆకట్టుకుంటుంది.
హత్య జరిగింది ఒకే చోట అయినా, ఆ ఇంట్లోని ప్రతి ఒక్కరికీ ఆ హత్యలు చేయడానికి ఏదో ఒక బలమైన కారణం ఉన్నట్లు చూపించే సీన్లు ప్రేక్షకుడిని క్లైమాక్స్ వరకు గెస్ చేస్తూ ఉండేలా చేస్తాయి. కేవలం ఇదొక మర్డర్ మిస్టరీ మాత్రమే కాకుండా.. సంపన్న వర్గాల అహంకారం, ఒక ఫ్యాక్టరీ వల్ల పేద ప్రజలు ఎలా నష్టపోతున్నారు, మీడియా ఎలా వన్ సైడ్ కథనాలను ప్రసారం చేస్తుంది వంటి విషయాలను కూడా కథలో చూపారు.
సినిమా చివర్లో అసలు హంతకుడు ఎవరో ? జటిల్ యాదవ్ ఆధారాలతో సహా బయట పెట్టె ఎపిసోడ్ సినిమా మొత్తానికి బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలుస్తుంది. సినిమా కథనం చాలా నిదానంగా సాగుతుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సీన్లు, ఫోరెన్సిక్ డీటెయిల్స్‌ను చూపించే క్రమంలో సినిమా సాగదీసినట్లు అనిపిస్తుంది.
నవాజుద్దీన్ పాత్ర బాగా ఎలివేట్ అయినప్పటికీ, సంజయ్ కపూర్, రేవతి వంటి ప్రతిభావంతులైన నటులకు సరైన స్కోప్ ఉన్న సీన్లు రాయలేదు. అలాగే మీరా పాత్రలో చిత్రంగద సింగ్ ఎక్స్‌ప్రెషన్స్ కొన్ని చోట్ల ఫ్లాట్‌గా అనిపించాయి.కొన్ని సీన్లలో విపరీతమైన రక్తపాతం ఉండటం సాధారణ ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు.
మొత్తం మీద ఒక ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా చూస్తే ఇది ఓకే అనిపిస్తుంది, కానీ ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఆశించే వారికి ఈ లోపాలు కొంచెం నిరాశ కలిగిస్తాయి. క్రైమ్ సినిమాలు ఇష్టపడే వారు ఈ సినిమాను చూడ వచ్చు.

