భయపెట్టని దెయ్యాల సినిమా !!

Sharing is Caring...

Ghosts that don’t scare you……….

‘ఘోస్ట్ విల్లా’ (Ghost Villa)  2016 నాటి మలయాళం సినిమా.. తెలుగులోకి డబ్ చేశారు. జాన్ జాకబ్, పార్వతి నంబియార్ ప్రధాన పాత్రల్లో రూపొందిన  ఈ హారర్ కామెడీ చిత్రానికి మహేష్ కేశవ్ దర్శకత్వం వహించారు.. టైటిల్ బాగుంది..సినిమా అంతంత మాత్రమే. 

కథాంశం ఏమిటంటే ?

రావుతర్ (రాజ్ మోహన్ ఉన్నితాన్) అనే వ్యాపారవేత్తకు ఊరి చివర ఒక పాడుబడిన పెద్ద బంగళా (విల్లా) ఉంటుంది. ఆ ఇంట్లో దెయ్యాలు, దుష్టశక్తులు ఉన్నాయనే పుకార్ల వల్ల అక్కడ పనిచేసే సిబ్బంది అందరూ పారిపోతారు. దీంతో ఆ విల్లాను కూల్చేయాలని యజమాని భావిస్తాడు.

అయితే, దెయ్యాలతో మాట్లాడగల శక్తి ఉందని చెప్పుకునే ఆనంద్ (జాన్ జాకబ్) అనే ఒక ఘోస్ట్ హంటర్ తన స్నేహితులతో కలిసి ఆ బంగళాలోని శక్తులను వదిలిస్తానని వస్తాడు. వారు విల్లాలోకి వెళ్లిన తర్వాత, అక్కడ కిడ్నాపర్ల చేతిలో బందీగా ఉన్న ఎల్సా (పార్వతి నంబియార్) అనే అమ్మాయి కనిపిస్తుంది.

అసలు ఆ విల్లాలో దెయ్యాలు ఉన్నాయా లేదా? కిడ్నాపర్ల నుండి ఎల్సాను కాపాడి, ఆ విల్లా మిస్టరీని ఆనంద్ ఎలా ఛేదించాడు? అనేదే కథ.

హారర్ ఎలిమెంట్స్ ,కిడ్నాప్ క్రైమ్ డ్రామాను కలపాలని చూసిన దర్శకుడి ఆలోచన బాగానే ఉంది కానీ సరైన రీతిలో కథపై కసరత్తు జరగలేదు. హారర్ సినిమాలకు కావాల్సిన గ్రిప్పింగ్ కథనం ఇందులో అస్సలు లేదు. కథ చాలా ఫ్లాట్‌గా, ఆసక్తి లేకుండా సాగుతుంది. 

పేరుకే హారర్ థ్రిల్లర్ కానీ ఇందులో దెయ్యాలు భయపెట్టిన సన్నివేశాలు లేవు. జంప్ స్కేర్స్ అన్నీ చాలా ఓల్డ్ స్టైల్‌లో ఉంటాయి.సినిమాలో పెట్టిన హారర్ కామెడీ సన్నివేశాలు నవ్వించకపోగా విసుగు తెప్పిస్తాయి.ఘోస్ట్ విల్లా అనగానే భయపెట్టేలా ఉండాలి.

స్టోరీ లైన్ బాగుంది..హారర్ సన్నివేశాలకు అవకాశం ఉంది కానీ దర్శకుడు వాటిపై పూర్తిగా శ్రద్ధ పెట్టలేదు. సినిమా మొదటి ఇరవై నిమిషాలు బాగుంటుంది. అక్కడనుంచి స్లో అవుతుంది. హీరోగా చేసిన జాన్ జాకబ్, హీరోయిన్ పార్వతి, ఇతర నటులు తమ పరిధి మేరకు బాగానే నటించారు.

సినిమాలో వాడిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా పాత పద్ధతిలో ఉంటుంది. దెయ్యం వచ్చే సీన్లలో వచ్చే శబ్దాలు భయ పెట్టె విధంగా ఉండవు. సినిమాలో కెమెరా పనితనం కూడా అంత గొప్పగా లేదు. భయానక వాతావరణాన్ని సృష్టించడంలో కెమెరామెన్ పూర్తిగా విఫలమయ్యాడు.

సినిమా రన్‌టైమ్ కేవలం 1 గంట 40 నిమిషాలు మాత్రమే ఉండటం ప్రేక్షకులకు పెద్ద ఉపశమనం.’ఘోస్ట్ విల్లా’ చాలా సాధారణ హారర్ సినిమా. హారర్ థ్రిల్లర్లను ఇష్టపడే వారు ఒకసారి చూడవచ్చు. ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్  లో తెలుగు లో ఉంది. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!