సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ !!

Sharing is Caring...

Mystery thriller…………

అతిరన్ (Athiran) 2019 మలయాళ సినిమా. ఈ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ లో ఫహద్ ఫాజిల్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు. వివేక్  దర్శకత్వం వహించారు.‘అనుకోని అతిథి’ పేరుతో సినిమాను తెలుగులోకి అనువదించారు.   

కథ ఏమిటంటే ?

1970ల కాలంలో కేరళలోని ఒక మారుమూల అడవి ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ మానసిక ఆశ్రమం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఆ ఆశ్రమాన్ని నడిపే డాక్టర్ బెంజమిన్ (అతుల్ కులకర్ణి ) రోగులపై వింత ప్రయోగాలు చేస్తున్నాడనే ఆరోపణలు వస్తాయి. దీనిని విచారించడానికి ప్రభుత్వ సైకియాట్రిస్ట్ డాక్టర్ కె.కె. మోహన్ దాస్ (ఫహద్ ఫాజిల్ ) అక్కడకు వస్తాడు. 

అక్కడ అత్యంత కఠినమైన నిర్బంధంలో ఉన్న నిత్య (సాయి పల్లవి) అనే అమ్మాయిని చూస్తాడు. ఆమెకు కలరిపయట్టు (కేరళ సాంప్రదాయ మార్షల్ ఆర్ట్) తెలుసు .. ఆటిజం (Autism) తో ఇబ్బంది పడుతుంటుంది.  ఆ ఆశ్రమంలో అసలు ఏం జరుగుతోంది? నిత్య ఎవరు? డాక్టర్ మోహన్ దాస్ కనుగొన్న భయంకరమైన నిజాలు ఏంటి? అనేదే మిగతా కథ ..సినిమాక్లైమాక్స్ లో ఊహించని మలుపులతో సాగుతుంది కథ.

ఫహద్ ఫాజిల్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఎప్పటిలాగే ఫహద్ తన కళ్లతోనే హావభావాలు పలికిస్తూ డాక్టర్ పాత్రలో జీవించేశాడు. సినిమాను క్లైమాక్స్ వరకు తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో నిలబెట్టాడు.ఆశ్రమంలోని రహస్యాలను ఛేదించేటప్పుడు ఆయన ముఖంలో కనిపించే సస్పెన్స్, భయం,క్లైమాక్స్ 20 నిమిషాలలో ఆయన నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది.

మాటలు లేని పాత్రలో సాయి పల్లవి కేవలం ముఖ కవళికలతో, బాడీ లాంగ్వేజ్‌తో అద్భుతమైన నటన కనబరిచింది. ముఖ్యంగా ఆమె చేసిన కలరిపయట్టు ఫైట్ సీన్స్ సినిమాకు మేజర్ హైలైట్. సాయి పల్లవి కెరీర్‌లోనే ఇది అత్యంత కఠినమైన పాత్ర. ఒక ఆటిజం బాధితురాలి బాడీ లాంగ్వేజ్‌ను, ప్రవర్తనను ఆమె ఎంతో సహజంగా పండించారు.

జాతీయ అవార్డు గ్రహీత అతుల్ కుల్కర్ణి తన నటనతో భయాన్ని కలిగిస్తారు. పైకి చాలా సాఫ్ట్‌గా కనిపిస్తూనే, లోపల క్రూరత్వాన్ని దాచుకునే డాక్టర్ పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఫహద్ ఫాజిల్‌కు గట్టి పోటీనిచ్చే పాత్ర ఇది. ప్రకాష్ రాజ్ పాత్ర చిన్నది. మానసిక రోగులుగా ఇతర నటులు కూడా బాగానే చేశారు. సినిమా చివరి 20 నిమిషాలు ఉత్కంఠతో నడుస్తుంది. చివరిలో వచ్చే ట్విస్ట్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. 

సినిమా మొదటి భాగం పాత్రల పరిచయం, ఆశ్రమం వాతావరణాన్ని చూపించడానికే ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల కొంతమందికి బోర్ కొట్టవచ్చు. ఈ సినిమా కథాంశం ప్రసిద్ధ హాలీవుడ్ చిత్రం ‘షట్టర్ ఐలాండ్’ (Shutter Island) ను పోలి ఉన్నట్లు అనిపిస్తుంది.

అతిరన్ (అనుకోని అతిథి) రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండే ఒక  సైకలాజికల్ థ్రిల్లర్.. కానీ కథనం కొంత స్లో గా ఉంటుంది. సీరియస్ కథనాలు, సస్పెన్స్ సినిమాలు చూసే వారికి ఈ చిత్రం నచ్చుతుంది . 

సినిమాలో సాయి పల్లవి (నిత్య) పాత్ర పరిచయం అయ్యే సీన్ అత్యంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది.ఫహద్, సాయి పల్లవి మధ్య సైలెంట్ కన్వర్జేషన్స్, ఫహద్ ఫాజిల్ ఆమెను పరీక్షించేటప్పుడు, వారిద్దరి మధ్య సాగే సైకలాజికల్ సీన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కేవలం కంటి చూపులతో, ముఖ కవళికలతో వీరిద్దరు పోటీపడి నటించిన సన్నివేశాలు సినిమాకే ప్రధాన బలం.

రాత్రి వేళల్లో ఫహద్ ఫాజిల్ ఆశ్రమంలో ఒంటరిగా సంచరించే సీన్లు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ‘అతిరన్’ (‘అనుకోని అతిథి’) సినిమా ప్రేక్షకుడికి ఒక విభిన్నమైన అనుభూతిని ఇవ్వడానికి ఆ చిత్రంలోని సంగీతం,కెమెరా పనితనం దోహదపడ్డాయి.

ఈ సినిమాకు అసలైన ప్రాణం జిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఇది కేవలం సాధారణ థ్రిల్లర్ మ్యూజిక్‌లా కాకుండా, ప్రేక్షకుడిలో ఒక రకమైన మానసిక భయాన్ని, ఉత్సుకతను కలిగిస్తుంది.ఆశ్రమం లోని నిశ్శబ్దాన్ని ప్రతిబింబించడానికి వాడిన సౌండ్ ఎఫెక్ట్స్, సాయి పల్లవి కలరిపయట్టు ఫైట్స్ అప్పుడు వచ్చే హై-వోల్టేజ్ మ్యూజిక్, క్లైమాక్స్ సీన్లలో వచ్చే వింత శబ్దాలు సినిమా థ్రిల్ ను పెంచాయి.

సినిమాటోగ్రాఫర్ అను మూతేడత్ ఈ సినిమాను ఒక మాస్టర్‌పీస్‌లా తీర్చిదిద్దారు. కేరళలోని ఊటీ, అతిరపల్లి పరిసరాల్లోని దట్టమైన అడవులు, పొగమంచును కెమెరాలో అద్భుతంగా బంధించారు. సినిమాలో ఎక్కువ భాగం చీకటి లేదా మసక వెలుతురులో  సాగుతుంది.  

సాయి పల్లవి ఫైట్ సీన్స్‌లో కెమెరా మూవ్‌మెంట్స్ చాలా వేగంగా, ఆకట్టుకునేలా ఉంటాయి. అలాగే, ఫహద్ ఫాజిల్ , సాయి పల్లవిల ముఖాల్లోని సూక్ష్మమైన హావభావాలను  చూపించడానికి వాడిన క్లోజప్ షాట్స్ నటనను మరింత బాగా ఎలివేట్ చేశాయి. ఈ  ‘అనుకోని అతిథి’ ఆహా OTT లో, యూట్యూబ్ లో కూడా ఉంది ..ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.  

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!