అక్కడ మాఫియాను తొక్కి నారతీశారు!!

Sharing is Caring...

Marudhuri Raja ……………………………………….The waves of the Ganga of life…

ఇది రాజకీయాలకు,పార్టీలకు, మతాలకు,కులాలకు,నాయకులకు ఎవ్వరికీ సంబంధం లేని మనో కల్లోలం.. అందరికీ సంబంధం ఉన్న అగ్ని కీల..!  జీవన గంగా కెరటాలు…!!
***********************
విశ్వవ్యాపకుడయిన ఈశ్వరుడొక్కడే…! ఆయన కల గంటున్న సుందరదృశ్యమే సమస్త విశ్వం. తన ఆలోచనలతో నిర్మించిన సృష్టి  అంతటా తాను నిండి.. ఆ సృష్టినే తనలో దాచుకుని, నడిచే ప్రతి క్షణం సంరక్షిస్తూ, సౌభాగ్యాన్ని అందించటమే ఆయన మతం..! కానీ..మానవ జాతి వివిధరకాలుగా ఆయన్ని విభిన్నం గా విభజించి మత మార్పిడి చేసింది…!!

కాశీ పట్టణ పుర వీధులు… విశ్వేశ్వర ఆలయ ప్రాంతంలో విచిత్రంగా అనిపించాయి నాకు. సన్నటి సందులు,గొందులు, వంకరలు తిరిగే దారులు… ఆ దారుల్లో ఒకరినొకరు తాకుతూ, తోసుకుంటూ నడుస్తున్నారు. వాళ్ళ మధ్యలో దోమ దూరే స్థలం దొరికినా దూరి పోయే రిక్షాలు, దూసుకుపోయే ఆటో రిక్షాలు..ఇతర వాహనాలు.. యుద్ధంలో గుర్రాల్లాగా పరిగెత్తుతున్నాయి..!  చిరాకేసింది…కోపం వచ్చింది..!

సెంట్రల్ గవర్నమెంట్ కాశీని ఏదో  ఉద్ధరించి కైలాసం చేసేసింది.. అనే వార్తలు చదివాను.విన్నాను. కానీ చూస్తున్నది..శూన్యం..! పబ్లిసిటీ ఫుల్లు,డెవలప్ మెంట్ నిల్లు అనే నిర్ణయానికి వచ్చేశాను. నేను,నా సతీమణి, మా ఇంటి పురోహితుడు నరేష్ శర్మ పద్మవ్యూహం లాంటి ఇరుకు వీధుల్లో.. మా మీద ఎక్కబోయే రిక్షాలను తప్పించుకుంటూ శ్రీనివాస్ అనే స్థానికుడి ఇంటికి వెళ్ళాం.

ఆయన నరేష్ శర్మకి కొద్ది పాటి పరిచయం. ఒకసారి కలవాలని నరేష్ అంటే  కలిసి వెళ్లాం. శ్రీనివాస్ గారి పూర్వీకులందరిది అదే ఊరు. పుట్టిన 55ఏళ్ల నుండీ ఆయన పెరుగుతున్నది అక్కడే కానీ తెలుగు అసలైన తెలుగులో  మాట్లాడుతున్నాడు.  పరిచయాలు అయ్యాక… కొన్ని మాటలయ్యాక  చీకాకుతో..

“ఏమిటండీ.. కాశీ మరీ ఇంత అధ్వాన్నంగా ఉంది..  మోడీగార్లు,B.J.P లు డెవలప్ చేశారు అని  పబ్లిసిటీ మాత్రం పెంచేశారు…!” అన్నాను. అంతే..!! ఆయన నేను ఏ కాంగ్రెస్ వాడినో, మరొకటో అని అనుమానించినట్టున్నాడు.

శివ శంఖం లాగా గొంతు పెంచి.. “ఏం మాట్లాడుతున్నారండి మీరు..మీరు ఇప్పుడొచ్చి కాశీని గురించి మాట్లాడుతున్నారు.. కాశీ గురించి మీకేం తెలుసు..” అన్నాడు ఆవేశం నిగ్రహించుకుంటూ..!  U.P వాళ్ళు మర్యాదగా మాట్లాడినా అమర్యాద వినిపిస్తుంది. ఆ మానవ వాయిద్యాలు అంతే..! ఆయన ఇచ్చిన మర్యాదకు మా నరేష్ శర్మ  నాకు అవమానం జరుగుతోందని అనుమానించి కంగారు పడ్డాడు.  నేను నవ్వుతూనే ఆయన్ని భరిస్తున్నాను.

“మీకు తెలియదండి..    ఇక్కడ ఒకప్పటి మా పరిస్థితి.. రోజుకు రెండుగంటలే కరెంటు ఉండేది… తాగటానికి నీళ్లుండేవి కాదు..!”
“అదేంటండి..గంగానదిని పక్కన పెట్టుకుని..!?”
“ఏం లాభం సార్…కిలో మీటర్ల పొడుగునా దుమ్ము,ధూళి, చెత్తా చెదారం, పెంట పేడ…! అసలు తాగే నీళ్లు ఎక్కడున్నాయి..? పట్టించుకున్న పాలకులెవరు…?  ఈ దరిద్రం కాక మాఫియా గొడుగు.. కాశీనంతా కప్పేసింది. ఎక్కడ చూసినా  మాఫియా లీడర్ల అనుచరులు, దందాలు,మామూళ్లు,  ఎపుడు ఎవరిని పొడుస్తారో అని ఆందోళన. రాత్రి తొమ్మిది దాటాక బయటికి రావాలంటే   భయంతో చచ్చిపోయే వాళ్ళం.. ఈ పదేళ్ళలో కదండీ.. గంగని శుద్ధి చేసి రోజూ  ఇళ్లకే నీళ్లు వచ్చే ఏర్పాటు జరిగింది… 24 గంటలూ కరెంటు సప్లై జరుగుతోంది. మీకు తెలుసా..?  ఇప్పుడు మీరు తిరుగుతున్నది..  ఓల్డ్ సిటీ.. ఇక్కడ వారసత్వపు కట్టడాలు ఉన్నాయని.. ఈ ప్రాంతాన్ని ఇలాగే ఉంచేశారు.  అసలు సిటీ ఆ వైపు వుంది,వెళ్లి చూడండి.!

కాశీ విశ్వేశ్వరాలయాన్ని ఎంత బాగుచేశారో మాకు తెలుసు. గంగని శుద్ధి చేసినట్టు… రౌడీలనీ,గుండాలని శుద్ధి చేసి క్లీన్ చేశారు. మాఫియా డాన్ లని, వాళ్ల అనుచరుల్ని తొక్కి నార తీశారు. క్రూర మృగాలను వేటాడినట్టు వేటాడారు…!!” అంటూ ఆపలేని ఉపన్యాసం చెప్తూనే ఉన్నాడు.

మధ్యలో మా శర్మ… “మాఫియా డాన్ లలో బ్రాహ్మణులని కూడా ఎన్ కౌంటర్ చేశారట..!” అన్నాడు. “మాఫియా అన్నాక ఎవడైతే ఏంటి నరేష్..! ప్రత్యేకించి రాయితీలుఇచ్చి..   మాఫియా డాన్లలో బ్రాహ్మణులను ఎన్కౌంటర్ చేయరాదు’ అని  రిజర్వేషన్లు కూడా పెట్టాలా..? హింసే ఆయుధం గాచెలరేగే వాళ్ళు, నిండు ప్రాణాలు తీసేవాళ్ళు, ఆడవాళ్ళ మానాలను  గాయ పరిచేవాళ్ళు .. సమాజ విధ్వంసకులు, ఏ కుల,మత వర్గానికి చెందిన వాళ్లైనా.. ఎన్కౌంటర్ చెయ్యటమే కాదు,  బూడిద కూడా మిగలకుండా దహనం చెయ్యాల్సిందే..!!”

ఆవేదన అగ్నిలా మారి ఆమాట అన్నది. పవిత్రమైన గంగానది లాంటి..భూమిని రాజకీయాలు మలినం చేసి ,మైల పట్టించాయి. ఆయన B.J.P సపోర్టరేమో తెలుసుకోవటానికి రకరకాల ప్రశ్నలు వేశాను. ఆయన లాజిక్ కి దొరకటం లేదు. కానీ..ఎన్నో ఏళ్లుగా ఆయన, ఆయన కుటుంబం అనుభవించిన.. మానసిక హింస,బాధ,కసి మాత్రమే ఆయన శరీరాన్ని తాచు పాములా ఊపేస్తోంది.  ఆయనకో నమస్కారం చేసి తిరుగుదారి పట్టాం.  కానీ వేధించే ఆలోచనలు నన్ను వదల్లేదు.

స్వాతంత్య్ర  పోరాటం లో.. దేశభక్తితో సింహాలై గర్జించిన వాళ్ళు.. స్వాతంత్య్రం  వచ్చాక స్వార్థశక్తులై అసలు అవతారాలు దించారు. అనుభవం లేని పాలన, పరిణితి లేని నాయకత్వం  అజ్ఞానవంతంగా మొదలైంది.  దేశ విభజన సమయంలో సంపూర్ణంగా భవిష్యత్ ఆలోచించకుండా  సమయస్ఫూర్తి తో,సమన్వయంతో,  అందరి ఆమోదంతో  విభాగించకుండా తీసుకున్న తొందరపాటు నిర్ణయాల ఫలితంగా.. అన్ని మతాల మధ్య  సామరస్యం లోపించి,సమరతత్వం ప్రకోపించింది.

ఫలితంగా నాయకులకు మహానుభావులు అని కీర్తి మిగిలింది. సామాన్యులకు అంతులేని  అశాంతి మిగిలింది. ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు  విశాల దృక్పథంతో ప్రవర్తించలేదు. రాజకీయ స్వార్థం దేశాన్ని ఆవరించింది.77 ఏళ్ల స్వాతంత్ర భారతాన్ని మొదటి ఆగస్టు పదిహేను నుండి
పాలన చేసిన నాయకులు అభివృద్ధి తో పాటు, తెలిసీ తెలియని విధానాలతో  ప్రత్యక్షంగానో,పరోక్షంగానో విధ్వంసాలకు బీజాలు వేశారు.

కొంత మంది ప్రభువులు  అవినీతి విత్తనాలు జల్లారు.  ఓట్ల కోసం,అధికారం కోసం వాళ్ళు వేసిన ఎత్తుగడలు దేశ మనుగడనే చావు దెబ్బకొట్టాయి.  ప్రతి ఫలంగా ఖలిస్తాన్ లు రగిలాయి. అధికారంకోసం,పదవులకోసం మాఫియా డాన్ ల చెప్పులు  మోసే నాయకులు.. మోకాళ్ళ తండాలు వేసే బానిస గాళ్ళు M.L.A లు,M.P లు..అయ్యారు. అందరూ కలిసి వ్యవస్థని కుళ్ళ బొడిచారు.  టెర్రరిస్టులకు దేశం ఫుట్ బాల్ కోర్టు అయింది .. సరిహద్దులలో జరగాల్సిన యుద్దాలు దేశం మధ్యలో కొనసాగి,  ముష్కరులందరూ బాంబు బ్లాస్టింగులతో  రోజుకో దీపావళి పండగ చేసుకున్నారు.

బాంబు దాడుల్లో తెగిపడిన  తలలు,కాళ్ళూ, చేతులూ.. టెర్రరిజపు స్థావరాలకు,మాఫియా గడపలకు శుభంపలుకుతూ తోరణాలై వేలాడాయి. జైళ్ళు అత్తగారి ఇళ్లై.. మామగారి గెస్ట్ హౌస్ లయి మర్యాదలు అందించాయి. ఒకప్పుడు గూండాల అండతో నాయకులు నిలబడితే..  రాను రాను గూండాలే నాయకులుగా మారి నిలబడ్డారు…!! మత  ద్వేషాలు,కులం చిచ్చులతో… మారణ యజ్ఞం నడుస్తోంది…!!

పండనివ్వండి పాపాలు… నింగి ని నిండి పోనివ్వండి అమాయకుల ఆర్తనాదాలు…!!  వారి ఆత్మ ఘోషలే ప్రార్థనలయి విశ్వాకారుడి చెవులకు  వినిపించనివ్వండి…!!  ఆయన మనసు కదలక పోదు.. వరద గంగలా ఆయన అడుగు కదిలి ముందుకురాక పోదు..! మరో అవతారానికి  రూపకల్పన జరగకపోదు.  వేయి పిడుగుల శబ్ధంతో… లక్ష కాంతులతో నేల పై దూకి..తరతమ బేధాలు లేకుండా  సన్మార్గులకు రక్షణ.. దుష్ట జనాలకు సజీవ సమాధుల స్థాపన కు  కాలం త్వరలోనే కలిసి రాకపోదు..!! వస్తున్నాయి..వస్తున్నాయి..  జగన్నాథ రథచక్రాల్…..!”

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!