ఇదొక సెటైరికల్ డ్రామా !!

Sharing is Caring...

A social analytical story…..

మలయాళంలో మంచి విజయం సాధించిన ‘ఆభాసం’ (2018) చిత్రాన్ని తెలుగులో ‘బస్ జర్నీ’ (Bus Journey) పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. బెంగళూరు నుండి కేరళకు రాత్రి వేళలో ప్రయాణించే ఒక బస్సు, అందులోని విభిన్న మనస్తత్వాలు కలిగిన ప్రయాణీకుల చుట్టూ సాగే సామాజిక విశ్లేషణాత్మక కథే ఈ సినిమా.

కథ ఏమిటంటే ?

‘డెమోక్రసీ ట్రావెల్స్’ కు చెందిన ‘గాంధీ’ లగ్జరీ బస్సు బెంగళూరు నుండి కేరళకు బయలుదేరుతుంది. ఈ బస్సులో ప్రయాణించే వారంతా సమాజంలోని విభిన్న వర్గాలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు. వీరిలో  బలవంతపు పెళ్లి నుంచి తప్పించుకోవాలని చూసే ఒక యువతి, ఎవరినైనా ధైర్యంగా ప్రశ్నించే యువకుడు,సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉంటారు.

వీరితో పాటు గా హోటల్ లో బీఫ్ అమ్మే వ్యాపారి, బస్సులో ప్రయాణీకులున్నారనే  అనే విషయాన్ని విస్మరించి శృంగార చేష్టల్లో మునిగిపోయే జంట, ఒంటరిగా ప్రయాణించే అమ్మాయిని కోరికతో చూసే యువకుడు, అయ్యప్ప భక్తుడు ,విదేశీయులు, క్రిస్టియానిటీని అనుసరించే వ్యక్తులు, గంజాయి దమ్ము కొట్టే అమ్మాయి, ఒక ట్రాన్స్ జెండర్ ఇలా వివిధ కేటగిరీల వ్యక్తులు ప్రయాణిస్తుంటారు.

ప్రతి ప్రయాణికుడి ఆలోచనలు, ఆందోళనలను సినిమా హైలైట్ చేస్తుంది. తాను వెళ్తున్న అత్త ఇంట్లో ఉన్న పీడోఫైల్ గురించి ఆందోళన చెందుతున్న చిన్న అమ్మాయి నుంచి, పక్కన కూర్చున్న వ్యక్తి అనుచిత స్పర్శతో చిరాకు పడి మౌనంగా ఉండిపోయే వ్యక్తి, చలిగాలితో ఇబ్బంది పడే వ్యక్తి అడిగినా కిటికీ మూయని మహిళ వైఖరి ని బాగా చూపారు.

రాత్రి ప్రయాణంలో వారి మధ్య జరిగే చర్చలు, వారి వైఖరి ని తెలిపే కథ .. మన సమాజం ఇలాంటి వ్యక్తులతో నిండి ఉంది అని దర్శకుడు చెప్పదలిచాడు అనిపిస్తుంది. తన లైంగిక కల్పనలను అణచుకున్న అమాయక డ్రైవర్ పాత్రకు అలెన్సియర్ లే లోపెజ్ పూర్తి న్యాయం చేశారు.

బస్ అటెండెంట్ గా సూరజ్ వెంజరమూడు పాత్ర బాగుంటుంది. అనేక కోణాలను ఆ పాత్ర చూపుతుంది. సహాయం చేస్తున్నట్టు నటించి ఒక మహిళను లోబర్చుకోవాలనే కాంక్ష ఉన్న వ్యక్తిగా సూరజ్ బాగా నటించాడు. ఒక అవినీతి పోలీస్ అధికారిగా నాజర్ పాత్ర లో జీవించాడు.అవకాశం దొరికితే పోలీసులు జనాలపై ఎలా రుబాబు చేస్తారో కూడా స్పష్టంగా చూపారు. 

ఇదొక విభిన్నమైన కాన్సెప్ట్ తో తీసిన సినిమా. సినిమాకు ఒక స్పష్టమైన కథాంశం లేదు. ముగింపు లేదు..సెకండ్ ఆఫ్ బాగుంటుంది.సినిమా చాలా వరకు ఒకే బస్సు లోపల సాగడం వల్ల, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే వారికి బోర్ కొడుతుంది. 

కథలో ఒకేసారి చాలా సామాజిక సమస్యలను చూపించడం వల్ల, ఒక స్పష్టమైన గమ్యం లేకుండా సినిమా సాగుతున్నట్లు అనిపిస్తుంది.‘బస్ జర్నీ’ అనేది ఒక రొటీన్ ఎంటర్‌టైనర్ సినిమా కాదు. సమాజంలోని లోపాలను ఎత్తిచూపే ఒక ప్రయోగాత్మక డ్రామా.

సమాజం పై సెటైరికల్ డ్రామాలను ఇష్టపడే వారు ఒకసారి చూడదగ్గ చిత్రం.ఈ సినిమాకు జుబిత్ నమ్రాడత్ దర్శకత్వం వహించారు. ప్రసన్న ఎస్. కుమార్ సినిమాటోగ్రఫీ, ఊరాళి’ బ్యాండ్ దేవ్ అందించిన మ్యూజిక్ బాగుంది. సినిమా యూట్యూబ్ లో ఉంది ఆసక్తి గలవారు చూడవచ్చు. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!