A beautiful love story………
“తూర్పు వెళ్లే రైలు” 1979లో ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో రూపొందిన ఒక అద్భుతమైన క్లాసిక్ తెలుగు సినిమా. ప్రముఖ దర్శకుడు భారతీరాజా తమిళంలో తీసిన ‘కిళక్కు పోగుం రైల్’ (1978) చిత్రానికి ఇది రీమేక్.
మూలకథ లోని భావోద్వేగాలను దెబ్బతీయకుండా, బాపు తన మార్క్ ‘కథా విశ్లేషణ’జోడించడం వల్లే ఈ సినిమా తెలుగులో కూడా ఒక ఐకానిక్ మూవీ గా నిలిచిపోయింది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు.ఈ సినిమా ద్వారా నటి జ్యోతి హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమవ్వగా, నటుడు మోహన్ హీరోగా చేశారు.
కథ ఏమిటంటే ?
పల్లెటూరి నేపథ్యంలో సాగే ఒక అందమైన ప్రేమకథ ఇది. గ్రామీణ మూఢాచారాలు, కుల వివక్షల మధ్య ఒక కవికి (హీరో), అనాథ అమ్మాయికి (హీరోయిన్) మధ్య పుట్టిన స్వచ్ఛమైన ప్రేమను ఎలా నిలబెట్టుకున్నారు? ఆ ఆచారాలను ఎదిరించి ‘తూర్పు వెళ్లే రైలు’ ఎక్కి ఎలా ఒకటయ్యారనేది చిత్ర కథాంశం.
ఈ సినిమాను గోదావరి పరివాహక ప్రాంతాలైన రాజమండ్రి, కలిదిండి,ధవళేశ్వరం పరిసరాల్లో అందంగా చిత్రీకరించారు.పెంకితనం, అమాయకత్వం కలగలిసిన ఒక నిరుపేద అమ్మాయి పాత్రలో జ్యోతి అద్భుతంగా నటించింది. మొదటి సినిమానే అయినప్పటికీ ఎక్కడా కెమెరా బెరుకు లేకుండా జీవించేసింది.ఆమె పెద్ద కళ్ళు ఆమెకు ఆకర్షణీయం. ఎన్నో భావాలను కళ్ళ ద్వారానే పలికించారు.
ఊరిలో అంటరానివాడిగా, క్షురకుడి కొడుకుగా సమాజం నుండి అవమానాలు భరించే యువకుని పాత్రలో మోహన్ అద్భుతమైన పరిణతి చూపించారు.ఆ పాత్రకు కావలసిన బాడీ లాంగ్వేజ్‌ను మోహన్ చాలా సహజంగా ప్రదర్శించారు.
జ్యోతి పై ఉన్న నిష్కల్మషమైన ప్రేమను, సమాజంపై ఉన్న తిరుగుబాటు భావాలను తన నటనతో చాలా హుందాగా ఎలివేట్ చేశారు.సినిమా ముగింపులో ఊరి ఆచారాల పేరిట వీరికి జరిగే అన్యాయం నుండి తప్పించుకోవడానికి పరుగెత్తే సీక్వెన్స్‌లో మోహన్, జ్యోతిల నటన, ఎనర్జీ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి.
విలక్షణ నటుడు రాళ్లపల్లి తనదైన శైలిలో నటించి మెప్పించారు. హీరో హీరొయిన్స్ తర్వాత ప్రధాన పాత్ర ఆయనదే. ఈ సినిమాలో ఆయన క్రూరమైన విలన్ కాదు. హీరోయిన్ జ్యోతి ని ఎలాగైనా లొంగదీసుకోవాలని, ఇంప్రెస్ చేయాలని చూసే స్వార్థపూరితమైన పాత్ర.
ఈ చిత్రానికి ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అద్భుతమైన ట్యూన్స్ అందించారు. సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.ఏమిటిదీ, ఏమిటిదీ ఏదో ఏదో తెలియనిదీ ఎప్పుడు కలగనిది,చుట్టూ చెంగావి చీరా కట్టాలే చిలకమ్మ,వస్తాడే నారాజు వస్తాడే,వేగుచుక్క పొడిచింది వేకువ కాబోతూంది,సందెపొద్దు అందాలున్న చిన్నదీ, ఏటిమీద తాలాడుతున్నదీ వంటి హిట్ సాంగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఆరుద్ర ,జాలాది సాహిత్యం అందించారు. ఎమ్వీయల్ సంభాషణలు సమకుర్చారు. మోహన్ నోట వినిపించే చిన్నచిన్న కవితలను ఆయనే రాశారు.
బాపు గారు తన మార్కు సృజనాత్మకతతో, పల్లెటూరి పచ్చదనం, గోదావరి అందాల నేపథ్యాన్ని వాడుకుంటూ ప్రతి సీన్‌ను ఒక పెయింటింగ్‌లా మలిచారు. రైలు బండి వెనుక మోహన్ ,జ్యోతి లు సందేశాలు రాసుకోవడం ఆకట్టుకుంటుంది.
ఇషాన్ ఆర్య అద్భుతమైన కెమెరా పనితనం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఎలాంటి భారీ సెట్లు లేకుండా, పచ్చని పొలాలు, గోదావరి పరివాహక ప్రాంతాలు, పల్లెటూరి మట్టి రోడ్లను ఆయన చాలా సహజమైన వెలుతురులో చూపించారు.
సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు ఒక థియేటర్లో కాకుండా, నిజంగానే ఒక అందమైన గ్రామంలో విహరిస్తున్నామనే అనుభూతిని ఆయన ఫ్రేమింగ్ కల్పించింది. ఇషాన్ ఆర్య తన కెమెరాతో జ్యోతి కళ్లలోని భావాలను (అమాయకత్వం, ప్రేమ, భయం) ఎలివేట్ చేసేలా అద్భుతమైన క్లోజప్ షాట్స్ తీశారు. సినిమా అంతటా ఆయన పనితనం కనిపిస్తుంది.
హీరోయిన్ అక్క మొగుడు రాళ్ళపల్లి ఆమెపై కన్నేసి వేధించే క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులలో ఒకరకమైన ఆవేదనను, ఉత్కంఠను కలిగిస్తాయి. కుల వివక్ష, మూఢాచారాల పేరుతో అమాయకులైన ప్రేమికులను విడదీయాలని చూసే ఊరి పెద్దల కుట్రలు, వారి మధ్య జరిగే పంచాయితీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
సినిమా ముగింపులో ఊరి ఆచారాల నుండి, ఆకృత్యాల నుండి తప్పించుకుని ప్రేమికులిద్దరూ ఒకటవ్వడానికి చేసే ప్రయత్నం శ్వాస ఆపుకుని చూసేలా చేస్తుంది.చివరగా హీరో హీరోయిన్లు ఇద్దరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కదులుతున్న ‘తూర్పు వెళ్లే రైలు’ ఎక్కి ఊరు వదిలి పారిపోయే విజువల్స్, ఆ సమయంలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. విషాదాంతం కాకుండా వారు బతికి బయటపడటంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకుంటారు. ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది ..ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.

