కోకాకోలా పబ్లిక్ ఆఫర్ కి సన్నాహాలు !!

Sharing is Caring...

Public Offer ……….

ఇండియాలో కోకాకోలా గురించి తెలియని వారు అరుదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్రాండ్ గురించి అందరికి తెల్సు. కోకాకోలా కంపెనీ భారతీయ మార్కెట్లో భారీ ఐపీఓ (IPO) జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

కోకాకోలా తన భారతీయ బాట్లింగ్ విభాగానికి చెందిన ‘హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్’ (HCCB) అనుబంధ సంస్థ ద్వారా మార్కెట్ నుంచి రూ.9,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.భారతీయ ఎఫ్‌ఎమ్‌సీజీ రంగంలోనే ఇది అత్యంత భారీ ఐపీఓలలో ఇది ఒకటిగా నిలవనుంది.

కోకాకోలా ప్రధాన సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం, ఈ ఐపీఓను బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ , నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లలో 2027 లో లిస్ట్ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మార్కెట్ పరిస్థితులు అనుకూలిస్తే అంతకంటే ముందే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఈ ఐపీఓ ప్రక్రియను వేగవంతం చేయడానికి కోకాకోలా సంస్థ ‘రోత్స్‌చైల్డ్‌ అండ్ కో’ (Rothschild & Co) ను లీడ్ అడ్వైజర్‌గా నియమించుకుంది. వచ్చే వారం లండన్ వేదికగా ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లతో ప్రజంటేషన్లు, చర్చలు జరగనున్నాయి.

గతేడాది (2025 జూలై) లోనే కోకా-కోలా తన ఇండియన్ యూనిట్ లోని 40% వాటాను ప్రసిద్ధ ‘జుబిలెంట్ భార్తియా గ్రూప్’కు విక్రయించి స్థానిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంది. ప్రస్తుతం మిగిలిన 60% వాటాలో కొంత భాగాన్ని ఐపీఓ ద్వారా ప్రజలకు విక్రయించనున్నారు.ఆఫర్ ధరను ఇంకా నిర్ణయించలేదు. 

హ్యుందాయ్, ఎల్‌జీ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు తమ భారతీయ విభాగాలను మార్కెట్లో లిస్ట్ చేస్తున్న ట్రెండ్‌ను అనుసరిస్తూ కోకాకోలా కూడా ఈ నిర్ణయం తీసుకుంది.

‘హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్’ పనితీరు మార్కెట్ స్థిరత్వం పరంగా భారతదేశంలో ఒక బలమైన శక్తిగా ఉంది. అయితే ఇటీవల విడుదలైన ఆర్థిక సంవత్సరం 2024-25 నివేదికల ప్రకారం, కంపెనీ ఆదాయం, లాభాలలో కొంత తగ్గుదల నమోదైంది.

టాప్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ ‘టోఫ్లర్’ నివేదికల ప్రకారం కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 9 శాతం తగ్గి రూ.12,751.29 కోట్లు గా నమోదైంది (గతేడాది ఇది రూ.14,021.55 కోట్లుగా ఉంది).కంపెనీ నికర లాభం 73 శాతం భారీగా క్షీణించి రూ.756.64 కోట్లు కు పడిపోయింది (గతేడాది లాభాల  బేస్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ తేడా వచ్చింది).

ముడిసరుకుల ఖర్చులు పెరగడం, సాఫ్ట్ డ్రింక్స్‌పై జీఎస్‌టీ భారం పెరిగినప్పటికీ వినియోగదారులపై భారం పడకుండా ధరలను స్థిరంగా ఉంచడం వల్ల లాభాలపై ప్రభావం పడింది..బాట్లింగ్ విభాగానికి (HCCB) లాభాలు తగ్గినప్పటికీ, బ్రాండ్స్ చూసుకునే ప్రధాన విభాగం ‘కోకాకోలా ఇండియా’ (Coca-Cola India) నికర లాభాలు మాత్రం ఏకంగా 46.3% పెరిగి ₹615.03 కోట్లకు చేరాయి.   

కోకాకోలా కు దేశంలో అత్యధిక శాతంలో సాఫ్ట్ డ్రింక్స్ బాట్లింగ్, పంపిణీ చేసే ఏకైక సొంత అనుబంధ సంస్థ ఇదే. థమ్స్ అప్, కోకాకోలా, స్ప్రైట్, మాజా వంటి 60 కి పైగా బ్రాండ్ ఉత్పత్తులను ఇది తయారు చేస్తుంది.

దేశవ్యాప్తంగా ఈ సంస్థకు 15 కి పైగా అత్యాధునిక తయారీ ప్లాంట్లు, విస్తృతమైన పంపిణీ నెట్‌వర్క్ ఉన్నాయి.మార్కెట్ నిపుణులు, ఆర్థిక విశ్లేషకుల అంచనాల ప్రకారం కోకాకోలా ఐపీఓ విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!