ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ !!

Sharing is Caring...

One Woman Show…..

‘మా ఇంటి బంగారం’  ఈ సినిమా ఒక పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్. సమంత ప్రధాన పాత్రలో నటించగా బి.వి. నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. సమంత తన సొంత బ్యానర్ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ పై రాజ్ నిడిమోరుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలాకాలం తర్వాత సమంత చేసిన సినిమా ఇది. 

 కథేంటంటే?

అనాథ అయిన స్వర్ణ (సమంత), ఒక పెద్దింటి అబ్బాయి అనిరుధ్ (దిగంత్ మంచాలే)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడంతో అనిరుధ్ కుటుంబం వీరికి దూరంగా ఉంటుంది. అయితే, అనిరుధ్ చెల్లెలి పెళ్లి కుదరడంతో, భర్తను తన కుటుంబంతో కలపాలని స్వర్ణ అత్తారింట్లోకి అడుగుపెడుతుంది.

ఆ ఇంటి ఆచారాలు నేర్చుకుంటూ అందరి మనసులు గెలవాలని చూస్తున్న సమయంలో… స్వర్ణ గతం (ఝాన్సీ అనే మరో కోణం) ఆమెను వెంటాడుతుంది. జైలు నుండి తప్పించుకున్న కరుణ (గుల్షన్ దేవయ్య) స్వర్ణ కుటుంబంపై దాడికి దిగుతాడు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి స్వర్ణ ఎలా కాళికలా మారి పోరాడింది అనేదే ఈ సినిమా కథ.

హోమ్లీ కోడలిగా వినోదాన్ని పంచుతూనే, యాక్షన్ సీన్స్‌లో సమంత దుమ్ములేపింది. ముఖ్యంగా మెరూన్ శారీ కట్టుకుని ఆమె చేసే క్లైమాక్స్ ఫైట్ సినిమాకే హైలైట్. అత్తారింట్లో సమంత చేసే సందడి, కామెడీ, రాయలసీమ యాసలో ఆమె చెప్పే డైలాగులు చాలా సరదాగా సాగిపోతాయి.

మార్కెట్ లో తనను ఫాలో అయ్యేవాడిని బెదిరించి పంపే సీన్ ,రాత్రి వేళ ఇంటి దగ్గరకొచ్చిన రౌడీలతో సమంత ఫైట్స్ ఆకట్టుకుంటాయి. సమంత కారు నడుపుతూ రౌడీలను కొట్టే సన్నివేశాలను బాగా చిత్రీకరించారు విలన్‌గా గుల్షన్ దేవయ్య నటన సైకోటిక్‌గా చాలా బాగుంది.

మైండ్ గేమ్స్ ఆడే విలన్‌గా గుల్షన్ దేవయ్య, అతనికి ఎదురునిలిచే సమంత మధ్య వచ్చే టామ్ అండ్ జెర్రీ చేజింగ్ సీన్స్ చాలా ప్యాక్డ్‌గా ఉంటాయి.వీరిద్దరి మధ్య వచ్చే ప్రతి మైండ్ గేమ్ సీన్ ప్రేక్షకులలో ఉత్కంఠను రేపుతుంది.

ఇంటర్వెల్ తర్వాత సినిమా అంతా చేజ్, యాక్షన్ డ్రామాగా మారుతుంది. కొన్నిచోట్ల స్క్రీన్‌ప్లే చాలా హడావిడిగా, కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. గతాన్ని దాచుకుని బతికే హీరోయిన్, ఆమెను వెతుక్కుంటూ వచ్చే విలన్ అనే పాయింట్  బాషా,అతడు సినిమాలను గుర్తుచేస్తుంది. ట్విస్టులు కూడా కొంతవరకు ఊహించేలా ఉంటాయి.

కొన్ని సన్నివేశాలు లాజిక్ లెస్ గా ఉన్నాయి. కథ మొత్తం సమంత చుట్టూనే తిరుగుతుంది, భర్త, SI అయిన మరిది పాత్రను డమ్మీ చేసేసారు. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణ. సమంత చేసిన హై-వోల్టేజ్ ఫైట్స్,అద్భుతంగా పండాయి.

మహిళా నటి ఇంత పవర్‌ఫుల్ గా యాక్షన్ చేయడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.సమంత తనదైన శైలిలో నటించి మెప్పించారు. ఇతరులంతా పాత్రల పరిధిలో బాగానే చేశారు

సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) యాక్షన్ సీన్లను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది.ఈ చిత్రానికి ఓమ్ ప్రకాష్  సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వహించారు. సినిమాలోని యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సన్నివేశాలను ఆయన తన కెమెరాతో చాలా రిచ్‌గా చూపించారు. నందినీ రెడ్డి  కథను బాగానే తెరకెక్కించారు..కుటుంబ సభ్యులతో చూడవచ్చు.   

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!