Political action drama……
జమదగ్ని (1988) సూపర్‌స్టార్ కృష్ణ కథానాయకుడిగా, లెజెండరీ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రం. సాధారణంగా పల్లెటూరి ప్రేమకథలను తీసే భారతీరాజా, కమర్షియల్ యాంగిల్ లో ఈ సినిమా తీయడానికి ప్రయత్నించారు.
జమదగ్ని (కృష్ణ) ఒక సాహసోపేతమైన, నిజాయితీ గల జర్నలిస్ట్. సమాజంలో ఉన్న అవినీతిని, అన్యాయాలను తన కలం బలంతో ఎండగడుతుంటాడు. ఈ క్రమంలో ఒక జిత్తులమారి, అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు (కైకాల సత్యనారాయణ) సామ్రాజ్యానికి జమదగ్ని అడ్డుగా నిలుస్తాడు.
ఒక జర్నలిస్ట్ పవర్ఫుల్ పొలిటిషియన్‌ను ఎలా ఢీకొట్టాడు, వ్యవస్థలోని లోపాలను ఎలా సవరించాడు అనేదే ఈ సినిమా… జర్నలిస్ట్ పాత్రలో కృష్ణ ఇమిడిపోయి నటించారు. ఆయన డైలాగ్ డెలివరీ, కొన్నియాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇప్పటికీ జర్నలిజం నేపథ్యం ఉన్న పాత్రల గురించి మాట్లాడుకునేటప్పుడు కృష్ణ ‘జమదగ్ని’ పాత్రను గుర్తు చేసుకుంటారు.
సినిమా ప్రథమార్ధం వేగంగా సాగినా, ద్వితీయార్ధంలో కొన్ని సీన్లు సాగదీసినట్లుగా అనిపిస్తాయి. కృష్ణ అభిమానులు ఆశించే పూర్తిస్థాయి కమర్షియల్ ఫార్ములాకు, భారతీరాజా మార్కు సహజత్వానికి మధ్య అక్కడక్కడా సమతుల్యత లోపించినట్లు అనిపిస్తుంది.
కమర్షియల్ గా ఆశించినంత విజయం సాధించకపోయినా, ఒక వైవిధ్యమైన చిత్రంగా గుర్తింపు పొందింది. సూపర్‌స్టార్ కృష్ణ ఇమేజ్ వేరు, దర్శకుడు భారతీరాజా మేకింగ్ స్టైల్ వేరు. ఈ రెండు మేచ్ కాలేదు. సినిమా ప్రారంభం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, ద్వితీయార్ధం లో కథనం బాగా మందగించింది.
రాజకీయాల చుట్టూ తిరిగే డ్రామా చాలా చోట్ల సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ తక్కువ.. డ్రామా లాగా సాగడం వల్ల రెగ్యులర్ సినిమా ప్రేక్షకులు బోర్ ఫీలయ్యారు. కథ మెయిన్ పాయింట్ బాగున్నప్పటికీ దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు బలంగా లేవు.కథపై మరింత కసరత్తు జరిగిఉంటే సినిమా జనాదరణ పొందేది.
క్లైమాక్స్ భారీ స్థాయిలో తీశారు. చివరి అరగంట సినిమా వేగంగా నడుస్తుంది. సినిమాలో కృష్ణ స్థాయికి తగ్గ పవర్‌ఫుల్ యాక్షన్ బ్లాక్స్ లేదా కమర్షియల్ ఎలిమెంట్స్ (పంచ్ డైలాగులు, మాస్ సీన్లు) ఆశించిన స్థాయిలో లేవు.కృష్ణ ను ఒక సాధారణ జర్నలిస్ట్‌గా, కాస్త క్లాస్ లుక్‌లో చూడటాన్ని అప్పట్లో థియేటర్ ఆడియన్స్ పూర్తిగా జీర్ణించుకోలేకపోయారు.
కైకాల సత్యనారాయణ,గొల్లపూడి మారుతీరావులు బాగానే చేశారు. ఇతర నటీనటులు వారి పరిధిలో చేశారు. సుమలత పాత్రను అర్ధాంతరం గా చంపేశారు.జర్నలిస్ట్‌గా కృష్ణ ముఖంలో వచ్చే ఆవేశాన్ని, అలాగే విలన్‌తో మైండ్ గేమ్స్ ఆడేటప్పుడు ఉండే ఇంటెన్సిటీని క్లోజప్ షాట్స్ ద్వారా సినిమాటోగ్రాఫర్ కన్నన్ చాలా పకడ్బందీగా క్యాప్చర్ చేశారు.
ఇళయరాజా-భారతీరాజా కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు ‘సాగర సంగమమే’, ‘మాటే మంత్రము’ (ఆరాధన) లేదా ‘సీతాకోకచిలుక’ లాంటి ఆల్‌టైమ్ క్లాసిక్, ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలను ఆశిస్తారు. కానీ ‘జమదగ్ని’ ఆల్బమ్ ఆ స్థాయిని అందుకోలేకపోయింది. ఒకటి రెండు పాటలు మినహా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది ..ఆసక్తి గలవారు చూడవచ్చు.

