బంధాలను ప్రశ్నించే గీతం !!

Sharing is Caring...

A song that questions relationships…….

“తూర్పు పడమర ఎదురెదురూ… నింగీ నేలా ఎదురెదురూ” అనే పాట ‘తూర్పు పడమర’ (1976) సినిమా లోనిది. డాక్టర్ సి. నారాయణ రెడ్డి  కలం నుండి జాలువారిన అద్భుత గీతం ఇది.. సినిమా మూల కథను  జీవితంలోని క్లిష్టమైన బంధాల తత్వాన్ని ప్రతిబింబించే ఒక అద్భుతమైన తాత్విక గీతం . 

సంగీత దర్శకుడు రమేష్ నాయుడు స్వరపరిచిన ఈ అద్భుతమైన పాటను లెజెండరీ గాయని పి. సుశీల, కోవెల శాంత కలిసి ఆలపించారు. 

ఈ సినిమా కథ బేతాళ కథల్లోని ఒక చిక్కు ముడి లాంటిది (తమిళంలో కె. బాలచందర్ తీసిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రానికి ఇది రీమేక్).ఒక తల్లి (శ్రీవిద్య), కూతురు (మాధవి) ఉంటారు. అలాగే ఒక తండ్రి (కైకాల సత్యనారాయణ), కొడుకు (నరసింహరాజు) ఉంటారు.

అనుకోని పరిస్థితుల్లో వయసులో పెద్దదైన తల్లిని ఆ కొడుకు ప్రేమిస్తాడు, వయసులో పెద్దవాడైన తండ్రిని ఆ కూతురు ప్రేమిస్తుంది.బంధాలు,వయసులు తారుమారై.. సమాజం ఒప్పుకోని ఒక క్లిష్టమైన సమస్య ఎదురైనప్పుడు, ఆ పాత్రల మనోవేదనను, జీవితం వేసిన పజిల్ ను వివరిస్తూ సాగే పాట ఇది.

సినారె  ప్రకృతిలోని కొన్ని నిజాలను తీసుకుని, మనుషుల జీవితాలకు ముడిపెడుతూ ఈ పాటను అత్యంత మేధోభరితంగా రాశారు.

“తూర్పూ పడమర ఎదురెదురూ నింగీ నేలా ఎదురెదురూ
కలియని దిక్కులు కలవవనీ… తెలిసి ఆరాటం దేనికనీ” 

అర్థం: తూర్పు-పడమర, ఆకాశం-భూమి ఎప్పుడూ ఒకదానికొకటి ఎదురెదురుగానే ఉంటాయి కానీ ఎప్పటికీ కలవవు. ఆ దిక్కులు ఎప్పటికీ కలవవని తెలిసినా కూడా.. వాటి మధ్య కలవాలనే ఆరాటం దేనికి? (ఇక్కడ పాత్రల మధ్య ఉన్న బంధాలు కూడా అంతే, అవి కలవడం అసాధ్యం అని చెబుతున్నారు).

“ఈ ప్రశ్నకి బదులేదీ… ఈ సృష్టికి మొదలేదీ…” 

అర్థం: ఈ చిక్కుముడి లాంటి ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గరా లేదు, అలాగే ఈ సృష్టి ఎప్పుడు మొదలైందో ఎవరికీ తెలియదు అంటూ జీవితంలో కొన్ని విషయాలకు జవాబులు దొరకవు అని తేల్చేశారు. 

“తూర్పున ఉదయించే సూర్యుడు పడమట నిదురించునూ
పడమట నిదురించే సూర్యుడే తూర్పున ఉదయించునూ
ఆ తూర్పు పడమరకేమౌనూ? ఈ పడమర తూర్పునకేమౌనూ?” 

అర్థం: తూర్పున పుట్టిన సూర్యుడు పడమర వైపు వెళ్లి అస్తమిస్తాడు, మళ్లీ అక్కడి నుండి తూర్పుకు వస్తాడు. ఇలా ఒకదానిపై ఒకటి ఆధారపడినా.. అసలు ఆ తూర్పుకు పడమర ఏమవుతుంది? వాటి మధ్య బంధం ఏంటి? అని ప్రకృతి ద్వారా కథలోని విచిత్రమైన బంధాల చిక్కుముడిని ప్రశ్నించారు. 

“నింగిని సాగే నీలిమేఘం నేల ఒడిలో వర్షించునూ
నేలను కురిసే ఆ నీరే నింగిలో మేఘమై పయనించునూ” 

అర్థం: ఆకాశంలో ఉండే మేఘం భూమి మీద వర్షిస్తుంది, మళ్లీ ఆ నీరే ఆవిరై ఆకాశానికి వెళ్తుంది. ఒకదాని నుండి ఒకటి పుడుతున్నా.. ఆ నింగికి నేల ఏమవుతుంది? (సినిమాలో కూడా ఒకరి కొడుకు మరొకరికి భర్త, ఒకరి కూతురు మరొకరికి భార్య అయ్యే విచిత్ర పరిస్థితిని ఈ చరణం సూచిస్తుంది).

“వేయని నాటకరంగం పైనా రాయని నాటకమాడుతున్నానూ
సూత్రధారికి పాత్రధారులకు తేడా తెలియక తిరుగుతున్నామూ”

అర్థం: మనుషులంతా ఈ ప్రపంచం అనే నాటకరంగంలో దేవుడు రాయకుండానే (మన ప్రమేయం లేకుండానే) నాటకం ఆడుతున్నాము. అసలు ఆడించేవాడు ఎవరో, పాత్రలు ఎవరో తెలియని అయోమయంలో బతుకుతున్నాము అని జీవిత పరమార్థాన్ని సినారె  ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు.

సంగీతం .. గానం ప్రత్యేకత
రమేష్ నాయుడు ఈ పాటకు చాలా గంభీరమైన, గుండెను తాకేలా మెలోడీ స్వరకల్పన చేశారు. పి. సుశీల గంభీరమైన, ఎమోషనల్ గాత్రం ఈ పాటకు ఒక పెద్ద బలంగా నిలిచింది. దాసరి లోతైన ఈ తాత్విక గీతాన్ని అద్భుతంగా తెరపైకి ఎక్కించారు. సినిమా ఇదొక హైలైట్ సాంగ్. 

తమిళ క్లాసిక్ ‘అపూర్వ రాగంగళ్’ (తెలుగులో ‘తూర్పు పడమర’) క్లైమాక్స్‌లో వచ్చే “కేళ్వియిన్ నాయగనే” పాట మొత్తం సినిమా కథ  సారాంశాన్ని, ఆ పాత్రల గుండె కోతను ప్రశ్నించే ఒక అద్భుతమైన గీతం.  కవి కణ్ణదాసన్ రాసిన ఈ పాట పల్లవి, చరణాలు కూడా బాగుంటాయి. తెలుగు పాట వేరే తమిళ పాట వేరే . సందర్భం,సన్నివేశాన్ని బట్టి  ఇద్దరు కవులు వేర్వేరుగా స్పందించారు. రెండూ సూపర్ హిట్ సాంగ్స్ కావడం విశేషం.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!