ఆ శిలాతోరణం వేరే లోకానికి ద్వారమా ?

Sharing is Caring...

Priyadarshini Krishna ……..

కలియుగ వైకుంఠమైన తిరుమల కొండలు కేవలం ఆధ్యాత్మికతకే కాదు, ప్రకృతి సృష్టించిన అంతుచిక్కని వింతలకు కూడా నిలయం. తిరుమల ప్రధాన ఆలయానికి ఉత్తరంగా, సుమారు ఒక కిలోమీటరు దూరంలో చక్రతీర్థం సమీపంలో ఉన్న శిలా తోరణం (Silathoranam) ఇందుకు ఒక సజీవ సాక్ష్యం.

ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఈ సహజసిద్ధ రాతి కట్టడం వెనుక ఉన్న భూగర్భ శాస్త్ర రహస్యాలు, శ్రీవారితో ముడిపడి ఉన్న పౌరాణిక విశేషాలు భక్తులను, పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

శాస్త్రవేత్తల ప్రకారం.. ..ఈ శిలాతోరణం మానవ నిర్మితం కాదు, ప్రకృతి మలచిన ఒక అద్భుతం. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సైంటిఫిక్ విశేషాలు చదువుతున్న కొలది పులకింత కలుగుతుంది.భూగర్భ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ఈ శిలా తోరణం వయసు దాదాపు 250 కోట్ల సంవత్సరాలు.

తీవ్రమైన గాలి, నీటి కోత  కారణంగా ఈ తోరణం ప్రస్తుత ఆకృతిని సంతరించుకోవడానికి సుమారు 150 కోట్ల సంవత్సరాలు పట్టిందని భావిస్తున్నారు.ఎపార్కియన్ అన్‌కన్ఫర్మిటీ (Eparchean Unconformity): భూమి పొరలలో ఏర్పడే ఒక అరుదైన మార్పును ఇక్కడ చూడవచ్చు. రెండు వేర్వేరు కాలాలకు చెందిన, వేర్వేరు రకాల రాళ్లను కలిపే ఒక సన్నని రాతి వంతెనలా ఇది దర్శనమిస్తుంది.

ప్రపంచంలో ఇలాంటి సహజసిద్ధమైన శిలా తోరణాలు కేవలం మూడు చోట్ల మాత్రమే ఉన్నాయి. ఒకటి మన తిరుమలలో ఉంటే, మిగిలిన రెండు అమెరికాలోని ఉటా (Rainbow Arch), ఇంగ్లాండ్ (Dalradian Quartzite) లలో ఉన్నాయి. ఆసియా ఖండం మొత్తంలో ఇలాంటి నిర్మాణం ఇదొక్కటే కావడం విశేషం.

1980వ దశకంలో తిరుమల కొండల్లో భూగర్భ పరిశోధనల కోసం తవ్వకాలు జరుపుతున్న సమయంలో శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు. ప్రస్తుతం దీని ప్రాధాన్యతను గుర్తించి ‘జాతీయ భూగర్భ స్మారక చిహ్నం’ (National Geological Monument) గా కేంద్ర ప్రభుత్వం రక్షిస్తోంది.

శ్రీవారి పాదముద్రల నమ్మకం

భూగర్భ శాస్త్ర ప్రాధాన్యత మాత్రమే కాదు, ఈ శిలా తోరణానికి తిరుమల శ్రీవారితో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక బంధం ఉందని భక్తులు బలంగా నమ్ముతారు.హిందూ పురాణాల ప్రకారం, శ్రీమహావిష్ణువు వైకుంఠం నుండి భువికి (తిరుమల కొండలకు) విచ్చేసినప్పుడు, ఆయన తన మొదటి అడుగును తిరుమలలోని అత్యంత ఎత్తైన ప్రాంతమైన నారాయణగిరి కొండపై (ప్రస్తుత శ్రీవారి పాదాలు) మోపారు.

ఆ తర్వాత ఆయన వేసిన రెండవ అడుగు ఈ శిలాతోరణం ఉన్న ప్రదేశంలోనే పడిందని, మూడవ అడుగు ప్రస్తుతం స్వామివారు కొలువై ఉన్న ఆనంద నిలయం (గర్భగుడి) వద్ద వేశారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ శిలాతోరణాన్ని నిశితంగా గమనిస్తే, అందులోని రాతి వంపులు ప్రకృతి సిద్ధంగా శ్రీమహావిష్ణువు పవిత్ర చిహ్నాలైన శంఖం, చక్రం మరియు స్వామివారి శయ్య అయిన ఆదిశేషుని పడగ (సర్పం) ఆకారాలను పోలి ఉంటాయి. అందుకే ఈ తోరణం సాక్షాత్తు శ్రీనివాసుడి ఉనికిని చాటుతుందని నమ్ముతారు. 

తాంత్రిక సంప్రదాయం ప్రకారం ఈ శిలాతోరణాన్ని వేరొక లోకానికి ద్వారంగా భావిస్తారు.అమెరికాలోని ఉటా Rainbow Arch, ఇంగ్లాండ్ Dalradian Quartzite లను ప్రపంచంలోని ఆకల్ట్ / తాంత్రిక విద్యల సాధకులు ఈ శిలాతోరణాన్ని తప్పనిసరిగా సందర్శిస్తారు.

ఇటువంటి అపూర్వమైన చారిత్రాత్మకమైన జియోలాజికల్ మార్వెల్ మన దగ్గర ఉండటం గర్వ కారణం.
శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్లేవారు పిల్లలతో ఈ శిలాతోరణం రాక్‌గార్డెన్స్ ని తప్పకుండా సందర్శించండి. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!