త్రినాధరావు గరగ ………….
గేమ్ చేంజర్ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబు కాంబినేషన్లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సినిమా పెద్ది.. శ్రీదేవి కుమార్తె కథానాయిక.. ముందుగా సినిమా విషయానికొస్తే..నాకు తెలిసి ఇది ఓ తెలుగు సినిమాలా అనిపించలేదు.
ఓ ఆట.. ఒక సామాజిక బాధ్యత .. ఒక నాయకత్వం..ఊరు కోసం తన మనుష్యుల గుర్తింపు కోసం ప్రాణం పణంగా పెట్టి ఆట రూపంలో చేసిన ఒక యుద్ధం లా అనిపించింది..అలా అని ఈ సినిమాని పూర్తిగా స్పోర్ట్స్ డ్రామా అని చెప్పలేం..
ముత్యాల సుబ్బయ్య, డా.రాజశేఖర్ ‘అన్న’ సినిమాలో “పలానోడు మనూరోడే అనాలబ్బీ జనమందరూ” అనే పాటకు స్ఫూర్తిగా ఇన్స్పైర్ అయినట్టున్నాడు దర్శకుడు బుచ్చిబాబు.క్రికెట్, కుస్తీ , పరుగు ఈ మూడు ఆటలతో అంతర్లీనంగా చెప్పాలనుకున్న ఎమోషన్ ని కదిలించే విధంగా ప్రెజెంట్ చేసారు. కాకపోతే దీన్ని ఇంకా బలంగా చెప్పి ఉంటే మరింత బాగుండేది.
అయినప్పటికీ డైరెక్టర్ పనితనం మనల్ని ఇంప్రెస్ చేస్తుంది.మరీ ముఖ్యంగా ఈ సినిమా విషయంలో భారీ హైప్ ని,ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కొందరు చెప్పిన మాటలు విని ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఒకింత నిరాశ తప్పదు.
మొదటి భాగం సో..సో..గా,స్లో సాగినా నా మట్టుకు నేను ఆటలు మారినా సెకండాఫ్ అంతా కూడా హీరో పెద్ది లక్ష్యం తోనే జర్నీ చేసాను..ఆ విషయంలో బుచ్చి బాబుకు జేజేలు పలకాలి..“మళ్లీ పుడతామా ఏంటి” అనేది పెద్ది చెప్పే లైన్. ఈ కథలో ఉన్న ఆత్మ అదే. ఏది సాధించాలనుకున్నా ఈ జన్మలో సాధించేయాలి.
దానికోసం ఎంత కష్టమైనా పడాలి, ఏ స్థాయి త్యాగమైనా చేసేయాలి. అది చెప్పడానికి రాసుకున్న ఈ కథలో నిజానికి నిజాయితీతో కూడిన చాలా విషయం ఉంది. ఈ విషయంలో బుచ్చిబాబుని మెచ్చుకుని తీరాలి..
నటీనటుల విషయంలో మాట్లాడాలంటే రామ్ చరణ్ డీసెంట్ పెర్ఫామెన్స్ అందించిన రోల్స్ లో పెద్ది రోల్ కూడా ఒకటి. ఈ సినిమా కోసం రామ్ చరణ్ పడిన శారీరక కష్టం మాత్రం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కుస్తీ కోసం సిద్ధమైన తీరు అందులోని యాక్షన్ ఎపిసోడ్స్ లో తాను తన పాత్ర కోసం పూర్తిగా నలిగిపోయాడనిపిస్తోంది..
ఇక హీరోయిన్ జాహ్నవి కపూర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.దేవర సినిమాకు ఎదురొచ్చినట్లుంది..తన బదులు శృతి హాసన్ ను పెట్టుకున్నా బాగుండేది..ఈ సినిమాలో పెద్ది పాత్ర తర్వాత అంతకు మించి గుర్తుండి పోయే పాత్ర మాత్రం జగపతిబాబుదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అప్పలసూరిగా తన నటన ఈ సినిమాలో అమోఘం. అందులో తను ఇమిడిపోయి నటించిన తీరు జగపతిబాబు కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలుస్తుంది అని చెప్పొచ్చు..నటుడు శివ రాజ్ కుమార్ కూడా సాలిడ్ పెర్ఫామెన్స్ ని అందించారు.
మిర్జాపూర్ నటుడు దివ్యెందు శర్మకు టాలీవుడ్ లో ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. వీరితో పాటుగా ఇతర నటీనటులు అంతా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా చేశారు..టెక్నికల్ గా..ఏ ఆర్ రెహమాన్ పాటలు తెలుగులో వర్కవుట్ కావటంలేదన్న అపవాదు ఈ సినిమాతో పోయింది.
రైరై రారా, చికిరీ, మస మస పాటలు బాగుండటమే కాకుండా వాటిని బాగా తీసారు కూడా. అలాగే కొన్ని సీన్స్ కి బీజీఎం ప్రాణం పోసింది. రత్నవేలు విజువల్స్ సూపర్.. అలాగే పీరియడ్ లుక్ కు ఆర్ట్ డిపార్టుమెంట్ బాగా కష్టపడింది ఆ కష్టం కనబడింది. సీజీ వర్క్ తో పోలిస్తే ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉంది.
మైత్రి వాళ్ళ నిర్మాణ విలువలు బాగున్నాయి.. చికిరి పాటలో సరుకు, సామాను పదాల తీసేసి సొగసు,సింగారం అనే పదాల అమరిక ఇంకా బాగుంది..చివరిగా చివరి ఇరవయి నిమిషాలు వేరే లెవెల్ అంతే.. సందేశం తో పాటు మన మనసుల్ని కదిలించే స్పోర్ట్స్ డ్రామాతో ఆకట్టుకున్న రామ్ చరణ్ తేజ్ కు అవార్డ్ గ్యారెంటీ..

