Reasons for defeat……….
దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి.కేరళలో పాత ఎల్‌డిఎఫ్ (LDF) నాయకత్వానికి (ప్రధానంగా ఇ.కె. నాయనార్, వి.ఎస్. అచ్యుతానందన్ కాలం) పినరయి విజయన్ నాయకత్వానికి మధ్య కొన్ని స్పష్టమైన తేడాలు ఉన్నాయి.
గతంలో కమ్యూనిస్ట్ పార్టీ “సామూహిక బాధ్యత” (Collective Responsibility) అనే సూత్రంపై నడిచేది. ముఖ్యమంత్రి నిర్ణయాల కంటే పార్టీ కమిటీల నిర్ణయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది.పినరయి విజయన్ హయాంలో అధికారం ఆయన చుట్టూనే కేంద్రీకృతమైంది.
సుధాకరన్, శైలజ టీచర్ వంటి సమర్థులైన వారిని పక్కన పెట్టారు.శైలజ టీచర్ ను 2021లో కేబినెట్ నుండి పక్కన పెట్టడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.కోవిడ్ సమయంలో ఆమెకు వచ్చిన అంతర్జాతీయ గుర్తింపు, పార్టీ కంటే వ్యక్తిగత ఇమేజ్ పెరగడానికి దారితీసిందని, అందుకే ఆమెను పక్కన పెట్టారనే విమర్శలు ఉన్నాయి.
కేరళ సీపీఎంకు చెందిన మరో సీనియర్ నేత జి. సుధాకరన్ కూడా పార్టీ నాయకత్వం తనను అవమానించిందని ఆరోపిస్తూ తిరుగుబాటు చేశారు. ఆయన అంబలప్పుళ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, సీపీఎంకు గట్టి షాక్ ఇస్తూ విజయం సాధించారు.
కరువన్నూర్, పయ్యన్నూర్ కుంభకోణాలు కేరళలో అధికార CPI(M) పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఎన్నికల్లో ప్రభావం చూపాయి.కరువన్నూర్ సహకార బ్యాంక్ కుంభకోణం… పార్టీ నియంత్రణలో ఉన్న ఈ బ్యాంక్‌లో నకిలీ పత్రాలతో భారీగా బినామీ రుణాలు మంజూరు చేశారు. ఒకే వ్యక్తికి బహుళ రుణాలు ఇవ్వడం, అసలు యజమానులకు తెలియకుండా వారి ఆస్తులను తాకట్టు పెట్టడం వంటి అక్రమాలు జరిగాయి.
సుమారు ₹260 కోట్ల రూపాయల వరకు డిపాజిట్లను ఖాతాదారులకు తిరిగి చెల్లించాల్సి ఉంది, దీనివల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇది ఎన్నికల్లో పార్టీకి పెద్ద దెబ్బగా మారింది.
పయ్యన్నూర్ నిధుల దుర్వినియోగం …..ఇది కన్నూర్ జిల్లాలోని పయ్యన్నూర్‌లో పార్టీ అంతర్గత నిధులకు సంబంధించిన వివాదం.పయ్యన్నూర్ ఎమ్మెల్యే TI మధుసూదనన్, ఇతర నేతలు ఎన్నికల నిధులు, పార్టీ కార్యాలయ నిర్మాణ నిధులు, హత్యకు గురైన పార్టీ కార్యకర్త CV ధనరాజ్ కుటుంబం కోసం సేకరించిన నిధులను (సుమారు ₹80 లక్షల నుండి ₹1 కోటి వరకు) దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి.
ఈ అక్రమాలను పార్టీ అంతర్గత ఆడిట్‌లో బయటపెట్టిన ఏరియా సెక్రటరీ V కుంజికృష్ణన్‌ను పార్టీ నుండి బహిష్కరించడం పెద్ద వివాదానికి దారితీసింది. కుంజికృష్ణన్ తన అనుభవాలను “నేతృత్వతే అనికల్ తిరుత్తణం” (నాయకత్వాన్ని కార్యకర్తలే సరిదిద్దాలి) అనే పుస్తకం రూపంలో విడుదల చేసి, పార్టీలోని అవినీతిని ఎండగట్టారు.
ఈ రెండు అంశాలు కూడా CPI(M) పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీశాయని, ఎన్నికల్లో ప్రజలు పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి ప్రధాన కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమారుడు వివేక్ కిరణ్ పై గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు వీటిని ప్రధానాంశాలుగా మార్చాయి.
కేరళలో వరద బాధితులకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ‘లైఫ్ మిషన్’ ప్రాజెక్టులో జరిగిన మనీలాండరింగ్ వ్యవహారంలో వివేక్ కిరణ్‌కు సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసుకు సంబంధించి 2023లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆయనకు నోటీసులు పంపినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ నోటీసుల గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని సీఎం విజయన్ కొట్టిపారేశారు.
వివేక్ కిరణ్ తన కుటుంబంతో కలిసి గురువాయూర్ ఆలయాన్ని సందర్శించినప్పుడు, అక్కడి విజువల్స్ తీస్తున్న ఒక టీవీ రిపోర్టర్‌పై ఆలయ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారని, విజువల్స్ తొలగించారని వివాదం చెలరేగింది. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడిగా ప్రతిపక్షాలు విమర్శించాయి.
కేంద్రంలోని బీజేపీ,కేరళలోని CPIM మధ్య ఉన్న “అపవిత్ర బంధం” (Unholy nexus) వల్లే వివేక్ కిరణ్‌పై ED ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ నాయకులు రమేష్ చెన్నితల వంటి వారు ఆరోపించారు.
పినరయి విజయన్ ఈ ఆరోపణలన్నింటినీ కొట్టిపారేస్తూ, ఇవన్నీ తన రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి చేస్తున్న “కుట్రలు” అని, తన కుమారుడు ఎప్పుడూ రాజకీయాల్లో లేదా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు.
విజయన్ కుమార్తె వీణా విజయన్ పైన, ఆమె ఐటీ కంపెనీ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ (Exalogic Solutions) పైన కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కేరళ రాజకీయాల్లో ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపింది.
కొచ్చికి చెందిన CMRL (Cochin Minerals and Rutile Ltd) అనే ప్రైవేట్ కంపెనీ నుండి వీణా విజయన్, ఆమె కంపెనీ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ఎటువంటి సేవలు అందించకుండానే మూడు ఏళ్లలో సుమారు ₹1.72 కోట్లు (కొన్ని నివేదికల ప్రకారం ₹2.70 కోట్లు) నెలవారీ చెల్లింపులుగా తీసుకున్నారని ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఇంటరిమ్ సెటిల్మెంట్ బోర్డ్ (ITSIB) 2023లోప్రస్తావించింది.
ఈ ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు ఉన్నాయని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఉన్న సీరియస్ ఫ్రౌడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) విచారణ చేపట్టింది. ఈ కేసులో వీణా విజయన్‌ను 11వ నిందితురాలిగా చేర్చి SFIO ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
SFIO నివేదిక ఆధారంగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా మనీ లాండరింగ్ కోణంలో వీణా విజయన్, ఆమె కంపెనీపై కేసు నమోదు చేసి విచారిస్తోంది.ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ అనేది పినరయి విజయన్ ప్రయోజనాల కోసం నడుపుతున్న ఒక బినామీ కంపెనీ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
శబరిమల ఆలయానికి సంబంధించిన బంగారు పూత తొలగింపు వంటి వివాదాలు హిందూ ఓటర్లలో అసంతృప్తిని కలిగించాయి.అధికారం మొత్తం ముఖ్యమంత్రి విజయన్, ఆయన కోర్ టీమ్ చేతుల్లోనే కేంద్రీకృతమైందనే విమర్శలు, పాలనపై ప్రజల్లో ఉన్న అసహనాన్ని పెంచాయి.
మొత్తం మీద అన్ని కలసి లెఫ్ట్ ఫ్రంట్ ఓటమికి కారణమైనాయి.గత నేతలతో పోలిస్తే విజయన్ ప్రభుత్వంపై అవినీతి,బంధుప్రీతి ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. ఇవి 2026 ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్ పరాజయానికి కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.

