Crime Drama………..
నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘కాట్టాన్’ (Kaattaan) వెబ్ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ మణికందన్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ సీరియస్ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది.
తమిళనాడులోని ఒక చిన్న గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో మూడేళ్లుగా ఒక్క కేసు కూడా నమోదు కాదు. దాంతో ఆ స్టేషన్‌ను ఎత్తేయాలని అధికారులు భావిస్తున్న తరుణంలో, అడవిలోని ఒక కొండపై మొండెం లేని ఒక ‘తల’ కనిపిస్తుంది. ఆ తల ముత్తు అలియాస్ కాట్టాన్ (విజయ్ సేతుపతి) ది అని పోలీసులు గుర్తిస్తారు. అసలు అతను ఎవరు? అతనిని ఎవరు చంపారు? అతని గతం ఏమిటి? అనే ప్రశ్నల చుట్టూ 10 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ సాగుతుంది.
విజయ్ సేతుపతి నటన, ముత్తు పాత్రలో ఆయన మాసీ లుక్, బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ షేడ్స్ అభిమానులను ఆకట్టుకుంటాయి. ఆయన పెర్ఫార్మెన్స్ ఈ సిరీస్‌కు అతిపెద్ద బలం.తెగిపడిన తల చుట్టూ తిరిగే కథాంశం చాలా కొత్తగా, ఉత్కంఠభరితంగా మొదలవుతుంది.అయితే కథ చాలా నెమ్మదిగా సాగుతుంది, దీనివల్ల ప్రేక్షకులకు బోర్ కొట్టే అవకాశం ఉంది.
కథను కొంతమేర ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. కేసు ను విచారించే కానిస్టేబుల్ ఫామిలీ స్టోరీ ప్రధాన కథకు సంబంధం లేనిది. అలాగే డాన్సర్ ఫామిలీ స్టోరీ కూడా అనవసరం. వీటిని ట్రిమ్ చేస్తే బాగుండేది. నాన్-లీనియర్ పద్ధతిలో కథను చెప్పే క్రమంలో ( కథను ఒక క్రమంలో మొదటి నుండి చివరి వరకు చెప్పకుండా, వెనక్కి ముందుకి మారుస్తూ చెప్పడం) కొన్ని చోట్ల ప్రేక్షకులు గందరగోళ పడతారు.
ఇది ఒక స్లో-బర్నింగ్ క్రైమ్ డ్రామా. విజయ్ సేతుపతి అభిమానులు, పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే మిస్టరీ కథలను ఇష్టపడే వారు ఒకసారి చూడవచ్చు. ఇది విజయ్ సేతుపతి వన్ మ్యాన్ షో.. ముత్తు పాత్రలో ఆయన చూపించిన వైవిధ్యం. ఒకవైపు కరుకైన మనిషిగా, మరోవైపు ప్రేమించిన అమ్మాయి ముందు అమాయకంగా ఆయన పండించిన నటన సిరీస్‌కు ప్రాణం పోసింది.
అడవిని ఒక పాత్రలా చూపించారు. సినిమాటోగ్రఫీ చాలా సహజంగా ఉండి, మనం కూడా ఆ అడవిలోనే ఉన్నామనే అనుభూతిని కలిగిస్తుంది.సిరీస్ ఎండింగ్ లో హింస కొంత ఎక్కువగానే ఉంది. మధ్యలో సేతుపతి లవ్ ఎపిసోడ్స్ కూడా బాగానే ఉంటాయి.
మొత్తం మీద పోలీసుల విచారణలో ముత్తు ఒకేలా కాకుండా, ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తాడు. కొందరికి రక్షకుడిగా, మరికొందరికి నేరస్థుడిగా, ఇంకొందరికి కరుణామయుడిగా కనిపిస్తాడు. అతని జీవితం కేవలం నలుపు-తెలుపులా కాకుండా, వైరుధ్యాలతో నిండిన ఒక సంక్లిష్టమైన మనిషిగా దర్శకుడు చూపించారు.
కథ కేరళకు మారినప్పుడు, వ్యాపారవేత్త శివేట్టన్ (మిలింద్ సోమన్) అతని ప్రత్యర్థి జానీ (సుదేవ్ నాయర్) వంటి కొత్త పాత్రలు ప్రవేశిస్తాయి. ఈ పాత్రల వల్ల కథా పరిధి పెరిగింది.కానీ అదే సమయంలో కథనం కొంత పక్కదారి పట్టినట్లు అనిపిస్తుంది.
మధు నీలకందన్ సినిమాటోగ్రఫీ, రాజేష్ మురుగేశన్ నేపథ్య సంగీతం (BGM) గ్రామీణ వాతావరణాన్ని, సీన్లను బాగా ఎలివేట్ చేశాయి. మిలింద్ సోమన్, ముత్తుకుమార్, వడివేల్ మురుగన్ మిగిలిన నటీనటులు తమ పాత్రల్లో చక్కగా నటించారు.

