అతని సంకల్పం గెలిచింది !

Sharing is Caring...

Determination won…disability defeated …………

“వైకల్యం అనేది శరీరానికే కానీ సంకల్పానికి కాదు” అని నిరూపించిన ఒక సజీవ సాక్ష్యం  జియాన్ క్లార్క్.  కాళ్లు లేవు.. కానీ గమ్యం వైపు పరుగెత్తే గుండె ధైర్యం ఉంది. కొండంత ఆత్మవిశ్వాసం ఉంది. అనాథగా పెరిగిన చేదు జ్ఞాపకాలు ఉన్నాయి.. ప్రపంచాన్ని గెలిచిన తీపి విజయాలెన్నో ఉన్నాయి.

జియాన్ క్లార్క్ — అసాధ్యం అనే పదాన్ని తన నిఘంటువు నుంచే తొలగించిన అజేయ శక్తుడు.’కాడల్ రిగ్రెషన్ సిండ్రోమ్’ అనే అరుదైన స్థితితో కాళ్లు లేకుండా జన్మించినా, జియాన్ ఎప్పుడూ తనను తాను బాధితుడిగా భావించలేదు. “నో ఎక్స్‌క్యూజెస్” (సాకులు చెప్పొద్దు) అనే మంత్రాన్ని తన ఒంటిపై టాటూగా వేయించుకుని, అదే తన జీవిత విధానంగా మార్చుకున్నారు.

సమాజం దయ చూపే చోట ఆయన గౌరవాన్ని సంపాదించుకున్నారు. చేతులతోనే ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తి (Fastest man on two hands) గిన్నిస్ రికార్డు సృష్టించారు. సాధారణ అథ్లెట్లకు సైతం సాధ్యం కాని రీతిలో రెజ్లింగ్, MMA రింగ్‌లో ప్రత్యర్థులను చిత్తు చేశారు.

ఒక అనాథాశ్రమం నుండి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ స్టేజ్ వరకు ఆయన సాగించిన ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. శరీరం ఎలా ఉన్నా, సరైన సంకల్పం ఉంటే ఆకాశమే హద్దు అని ఆయన నిరూపించారు.
జియాన్ క్లార్క్ చెప్పే ఒక గొప్ప మాట: “మీకు ఏది లేదో దాని గురించి ఆలోచించడం మానేసి, మీ దగ్గర ఏముందో దాంతో అద్భుతాలు చేయడం మొదలుపెట్టండి.” చెప్పడమే కాదు  చేసి చూపించాడు.

జియాన్ క్లార్క్ 1997, అక్టోబర్ 6న అమెరికాలోని ఓహియో (Ohio) రాష్ట్రంలోని కొలంబస్ నగరంలో జన్మించారు.ఆయన ‘కాడల్ రిగ్రెషన్ సిండ్రోమ్’ (Caudal Regression Syndrome) అనే అరుదైన జన్యు లోపంతో పుట్టారు. పుట్టిన వెంటనే ఆయనను తన తల్లిదండ్రులు వదిలేశారు. దీనితో ఆయన దాదాపు 16 ఏళ్ల పాటు వివిధ అనాథాశ్రమాల్లో పెరిగారు.

ఆయనకు 16 ఏళ్లు ఉన్నప్పుడు కింబర్లీ క్లార్క్ హాకిన్స్ అనే మహిళ ఆయనను దత్తత తీసుకున్నారు. ఆమె ప్రేమ, ప్రోత్సాహమే జియాన్ జీవితాన్ని మార్చేసింది. ఆమె అండతోనే ఆయన చదువుపై, క్రీడలపై దృష్టి సారించి ప్రపంచ రికార్డుల దిశగా అడుగులు వేశారు.ఆయన ఓహియోలోని మాస్‌పిల్లాన్ వాషింగ్టన్ హైస్కూల్ లో చదివారు.

స్కూల్ రోజుల్లోనే ఆయన రెజ్లింగ్‌పై ఆసక్తి పెంచుకున్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ చురుగ్గా ఉండేవారు.హైస్కూల్ పూర్తి చేసిన తర్వాత, ఆయన కెంట్ స్టేట్ యూనివర్సిటీ (Kent State University) లో చేరారు.అక్కడ ఆయన బిజినెస్ మేనేజ్‌మెంట్ (Business Management) లో డిగ్రీ పూర్తి చేశారు.కాలేజీ రోజుల్లోనే ఆయన యూనివర్సిటీ రెజ్లింగ్ జట్టు తరపున ఆడి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

జియాన్ క్లార్క్ సాధించిన రికార్డులు:

అత్యంత వేగంగా 20 మీటర్ల నడక (చేతులతో): ఫిబ్రవరి 15, 2021న కేవలం 4.78 సెకన్లలో 20 మీటర్ల దూరాన్ని చేతులతో నడిచి పూర్తి చేశారు.

చేతులతో అత్యధిక ఎత్తు బాక్స్ జంప్: అక్టోబర్ 13, 2022న ఆయన 33 అంగుళాల (0.83 మీటర్లు) ఎత్తు వరకు చేతులతో దూకి మరో రికార్డు నెలకొల్పారు.

అత్యధిక డైమండ్ పుష్-అప్స్: మూడు నిమిషాల్లో 248 డైమండ్ పుష్-అప్స్ చేసి తన మూడవ గిన్నిస్ రికార్డ్‌ను అందుకున్నారు. 

జియాన్ క్లార్క్ కేవలం రికార్డులు సృష్టించడమే కాకుండా, ప్రొఫెషనల్ MMA ఫైటర్, రెజ్లర్, వీల్‌చైర్ రేసర్,  మోటివేషనల్ స్పీకర్‌గా కూడా గుర్తింపు పొందారు. ఆయన జీవిత ప్రయాణం ఆధారంగాతీసిన  ‘Zion’ అనే డాక్యుమెంటరీ  నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు. 

  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!