పేద పిల్లలకు పాత మొబైల్ ఫోన్లు ఇచ్చి పుణ్యం కట్టుకోండి !

Sharing is Caring...
సాదిక్ “తోపుడు బండి” కి పుస్తకాలకు బదులు స్మార్ట్ సెల్ ఫోన్ లు కావాలి.
తోపుడు బండి “పల్లెలు-పిల్లలు-మొబైల్స్ “నినాదంతో యజ్ఞం ప్రారంభించింది. మీరు ఒక చేయి వేయండి.
దిక్కుమాలిన ఆన్ లైన్ క్లాసులు.పల్లెల్లో పిల్లలకు పిచ్చెక్కేలా ఉంది.వీళ్ళ ఇళ్లల్లో టీవీలు లేవు.వీళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవు.అసలు ఇక్కడ నెట్వర్క్ ఉండదు.అయినా సరే టీచర్లు వీళ్లకు డిజిటల్ చదువులు చెప్పాలట. ఎలాగబ్బా?
పల్లె పల్లె తన తోపుడు బ౦డి ద్వారా తాను చుాసిన కన్నీటి వ్యధ .కొన్నివందల గ్రామాల్లో వేలాదిమంది పిల్లలకు కాళ్లకు చెప్పులు ఉండవు.స్కూల్లో ఇచ్చే యూనిఫామ్ తప్ప వేరే బట్టలు ఉండవు.బళ్ళో పెట్టె భోజనం తప్ప తినడానికి ఇంకేమీఉండదు.కొంతమంది కైతే అమ్మా నాన్న కూడా ఉండరు.ఉన్నా వాళ్లకు పిల్లల గోస పట్టదు.తోపుడుబండి తిరిగిన వందలాది గ్రామాల్లో కళ్లారా చూసి కన్నీరు పెట్టుకున్న పరిస్థితి ఇది.అలాంటి ఈ పిల్లలకు టీవీల్లో,ఫోన్లలో చదువులు చెప్తారట. ఎవడ్రా వీళ్ళను విధానకర్తలు అన్నది.ఈ బుర్రలేని సన్నాసుల్ని తీసుకెళ్లి …బంగాళాఖాతంలో కలిపేయ్యండి. భూమ్మీదకన్నా ఈ ఫేస్ బుక్ లొనే పొల్యూషన్ ఎక్కువగా ఉంది.దీనికి కూడా కరోనా వస్తే బావుండు.చెత్తంతా ఊడ్చిపెట్టుకొని పోయి అంతా క్లీన్ అండ్ గ్రీన్ అయ్యేది.
కరోనా కన్నా దాని గురించిన వార్తలే భయంకరంగా ఉన్నాయి.ముందుగా కట్టడి చేయాల్సింది ఈ దిక్కుమాలిన వార్తలనే.
జగమొండి.., అక్షరాల “తోపుడు బండి”సాదిక్. జర్నలిస్టుగా జీవితం మొదలు పెట్టి సామాజిక సేవకుడిగా మారాడు‌.ముఖ్యంగా పేద పిల్లలకు పుస్తకాలు, గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలు ఏర్పాటులో తన వంతు కృషి చేస్తున్నాడు. గత 30 సంవత్సరాలుగా అలుపెరుగక జీవితాన్నినెట్టుకొస్తు న్నాడు.బతుకు విద్య తెలిసిన వాడు.సమాజం పట్ల నిబద్ధత వున్నోడు.
గత కొన్నేళ్ళుగాపల్లెలు-పిల్లలు-పుస్తకాలు అంటూ తోపుడుబండిని తోసుకుంటూ దాదాపు మూడువేల కిలోమీటర్లు తిరిగాడు.
సాదిక్ ఆలీ తోపుడు బండిని జనమంతా ఆదరించారు.అక్కున చేర్చుకున్నారు.అందరి సహాయ సహకారాలతో పల్లెల్లో 150కి పైగా గ్రంథాలయాలు స్థాపించడానికి దోహదపడ్డాడు.కొన్నివేలమంది నిరుపేద పిల్లలకు ఉచితంగా పుస్తకాలు అందించాడు.
ఇప్పుడు కరోనా మహమ్మారి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.బళ్లు తెరవలేదు.పిల్లలు బయటికి వచ్చే పరిస్థితులు లేవు.సహజంగానే తోపుడు బండి కి పనిలేకుండా పోయింది.సొంతూరు ( కల్లూరు ) కి వెళ్ళి కిరాణా షాపు ఓపెన్ చేశాడు.అది బాగానే నడుస్తోంది.కరోనా కాలంలో ఆర్థికంగా ఆదుకుందట.
ఈ నేపథ్యంలో పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు మొదలయ్యాయి.టీవీలు,మొబైల్స్ లో చదువుకునే కాలం వచ్చింది.దీంతో ఎగువ,మధ్యతరగతి వారికి పెద్దగా ఇబ్బంది లేదు.దిగువ మధ్యతరగతి, పేదలకు మాత్రం చాలా కష్టం వచ్చింది.ఫోన్లు టీవీలు లేని వారు చదువుకు దూరమయ్యే దుస్థితి వచ్చింది. సాదిక్ కొన్ని ఊర్లు తిరిగి ఆన్ లైన్ క్లాసులు నిర్వహణ..వాటి అతీగతీ పరిశీలించాడు.ఎన్నో లోపాలు.ముఖ్యంగా పేద పిల్లలకు స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేదు.ఇలాంటి నేపథ్యంలో ఏం చేయాలని ఆలోచించాడు సాదిక్. 
*ఈసారి పుస్తకాలు కాదు…సెల్ ఫోన్ ల పంపిణీకి తోపుడు బండి నిర్ణయం.!!
తోపుడుబండి ఈసారి మరో బృహత్తర బాధ్యతను భుజాన వేసుకుంది.ఈసారి పల్లెలు-పిల్లలు-మొబైల్స్ నినాదంతో యజ్ఞం ప్రారంభించింది.ఇదే విషయాన్ని సాదిక్ ఫేస్బుక్ లో ఓ పోస్టు పెట్టాడు, *పేద పిల్లలకు ఒక మొబైల్ బహుమతిగా ఇవ్వండి, కొత్తది అవసరం లేదు,మీరు వాడేసిన పాత మొబైల్ (రన్నింగ్ లో వున్నది ) ఉంటే పంపించండి..ఎక్కువ ఫీచర్లు కూడా అవసరం లేదు.జీమెయిల్, జూమ్ యాప్ వస్తే చాలు ” అని ఎఫ్బీలో పెట్టిన ఓ పోస్ట్ లో అభ్యర్ధించాడు సాదిక్.
తోపుడుబండిని ఇంతకాలం ప్రేమించిన జనం ఈసారి కూడా రెట్టింపు ప్రేమను చూపిస్తున్నారట. సాదిక్ పోస్ట్ కు సానుకూలంగా స్పందిస్తున్నారు.
జనం పంపించే ఫోన్లు తనకు చేరాక…ఎవరు యేం ఫోన్ పంపించారు?..అది ఏ విద్యార్థికి చేరింది? అనేది ఎప్పటికప్పుడు ప్రకటిస్తానంటున్నాడు సాదిక్.అంతే కాదు..ఆ ఫోన్ అందుకున్న పిల్లల నుంచి దాతకు కాల్ చేసిమాట్లాడిస్తానంటున్నాడు. “మరొమాట…దయచేసి ఫోన్లు మాత్రమే పంపించండి.డబ్బులు మాత్రం పంపించవద్దు.” అంటూ విజ్ఞప్తి కూడా చేశాడు.
ఫోన్లు కొరియర్ ద్వారా సాదిక్ కు చేరవలసిన చిరునామా…ఇది.!!
*Sheik Sadiq ali,Tiruvuru X road,Kalluru Village,Khammam Dist.Pincode 507209.
My mobile no.9346108090 (WhatsApp).6303064590
——-  ఎ..రజాహుస్సేన్.!!
Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!