శ్రీ కాళహస్తి గిరి ప్రదక్షిణ గురించి విన్నారా ?

Sharing is Caring...

Sri Kalahasti Giri Pradakshina …….

అరుణాచలం తరహాలోనే శ్రీకాళహస్తిలో కూడా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు.స్థానికులు దీనిని “కొండచుట్టు” అని కూడా పిలుస్తారు. ఈ గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మికంగా చాలా విశిష్టమైనది.గిరి ప్రదక్షిణ మార్గం సుమారు 22  కిలోమీటర్ల పైనే ఉంటుంది. నడవడానికి సుమారు 7 గంటలు సమయం పడుతుంది.

ఇటీవల కాలంలో ఈ గిరి ప్రదక్షిణ పాపులర్ అవుతోంది.ఎప్పటినుంచో ఉంది కానీ అంతగా భక్తులు వెళ్లేవారు కాదు. ఈ ప్రదక్షిణ శ్రీకాళహస్తీశ్వర ఆలయ గాలిగోపురం వద్ద ప్రారంభమై, కైలాసగిరి కొండ చుట్టూ ఉన్న గ్రామాల మీదుగా సాగి మళ్ళీ ఆలయం వద్దే ముగుస్తుంది.

ఈ మార్గంలో సుమారు 44 పవిత్ర తీర్థాలు ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇవన్నీ ఒకేసారి దర్శించుకునే స్థితిలో లేవు. ప్రధానమైన భారద్వాజ తీర్థం, చక్ర తీర్థం, యమ తీర్థం వంటివి కనిపిస్తాయి.భక్తులు వీటిని సందర్శిస్తారు. కొన్ని తీర్థాలు పూడిపోవడం లేదా కొండ పొదల్లో ఉండటం వల్ల సాధారణ భక్తులకు నేరుగా కనిపించవు.    

ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజున స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులతో కలిసి వేలాది మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు. కనుమ పండుగ రోజున కూడా ఈ కొండ చుట్టూ ఉత్సవం జరుగుతుంది. ప్రస్తుతం, ప్రతి పౌర్ణమి రోజున భక్తులు గిరి ప్రదక్షిణ చేసేలా ప్రభుత్వం వసతులను మెరుగుపరుస్తోంది.

శ్రీకాళహస్తిని “దక్షిణ కైలాసం” అని పిలుస్తారు. ఈ కొండపై దేవతలు, సిద్ధులు నివసిస్తారని, వారిని స్మరిస్తూ ప్రదక్షిణ చేయడం వల్ల పాపాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు “ఓం నమః శివాయ” పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణ చేయడం అత్యంత ఫలప్రదంగా భావిస్తారు.

భక్తుల సౌకర్యార్థం సుమారు రూ. 10 కోట్ల వ్యయంతో 22 కిలోమీటర్ల పొడవైన “శివం టు శివం” (Sivam to Sivam) గిరి ప్రదక్షిణ రోడ్డును ఇటీవల ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మార్గంలో భక్తులకు నీడ, తాగునీరు,  విశ్రాంతి గదుల వంటి సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు.

ఈ గిరి ప్రదక్షిణకు వెళ్లాలనుకుంటే, పౌర్ణమి లేదా బ్రహ్మోత్సవాల సమయంలో ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. శ్రీకాళహస్తి తిరుపతికి చాలా సమీపంలో ఉండటం వల్ల రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి. అత్యంత సమీప విమానాశ్రయం తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం (Renigunta Airport). ఇది ఆలయానికి సుమారు 27 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి టాక్సీలు లేదా బస్సుల ద్వారా 40 నిమిషాల్లో ఆలయానికి చేరుకోవచ్చు.

రైలు ప్రయాణం అయితే  శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ (KHT) ఆలయానికి కేవలం 2 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై వంటి ప్రధాన నగరాల నుండి నేరుగా రైళ్లు ఉన్నాయి. సమీపంలోని ప్రధాన జంక్షన్ రేణిగుంట (25 కి.మీ.) నుండి కూడా అనేక రైళ్లు అందుబాటులో ఉంటాయి.

బస్సు ప్రయాణం అయితే ఆంధ్రప్రదేశ్ (APSRTC) ఇతర రాష్ట్రాల నుండి శ్రీకాళహస్తికి తరచుగా బస్సులు నడుస్తాయి. తిరుపతి నుండి ప్రతి 15-20 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం గదులతో పాటు ప్రైవేట్ హోటళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!