ఈ మలిష్క అంటే ముంబై అధికారులకు హడల్ !

Sharing is Caring...

ఈ ఫొటోలో కనిపించే అమ్మాయి పేరు మలిష్క ..పేరు వెరైటీ గా ఉంది కదా ! మనిషి కూడా అంతే.  సామాజిక సమస్యల పట్ల బాగా స్పందిస్తుంది. ముంబై అధికారులకు ఈ మలిష్క అంటే హడల్. తాను రేడియో జాకీ గా చేస్తుంది. 

మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెత్త పేరుకుపోయి కనిపిస్తే ,,దుర్గంధం భరించలేక ముక్కు మూసుకుని  అక్కడి నుంచి తప్పుకుని వెళతాం. కానీ ఈ మలిష్క అలా చేయదు. ఆ చెత్త ఎత్తేయడానికి  మునిసిపల్ సిబ్బంది వచ్చేంత వరకు దాని గురించి రేడియో లో మాట్లాడుతూనే ఉంటుంది. ఎక్కడ పై అధికారులు విని మందలిస్తారో అని సిబ్బంది వచ్చి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తుంటారు.

ముంబైలో పరిష్కారం కాని ఎన్నో  సమస్యలు.. సరిగా లేని రోడ్లు, వర్షం నీటితో నిండిపోయిన కాలనీలు… ఏవైనా సరే వాటి గురించి వెంటనే మలిష్క తన షోలో వెంటనే  చెప్పేస్తుంది. ఆమెకు అదొక అలవాటుగా మారిపోయింది. మలిష్క చెప్పే విషయం  మున్సిపల్ అధికారులకు చేరగానే సమస్య పరిష్కరిస్తారు.

ఒక్కోసారి మలిష్క పద్ధతి అధికారులకు కోపం తెప్పించినప్పటికీ తను ఏమాత్రం వెనక్కి తగ్గదు.మలిష్క ప్రస్తుతం రెడ్ ఎఫ్ఎమ్ 93.5లో జాకీగా  పనిచేస్తోంది. మలిష్క చేసిన.. మార్నింగ్ నంబర్ వన్ విత్ మలిష్క, ఎమ్ బోలే షోలు బాగా పాపులర్ అయ్యాయి. హిందీలో బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ షో గా ‘మార్నింగ్ వన్’ నిలిచి వరుసగా నాలుగేళ్లపాటు అవార్డులు అందుకుంది.  

అంతేగాక ఓటీటీ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అవార్డుల కార్యక్రమంలో ‘డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు మలిష్కకు దక్కింది. 2019లో తొలిసారిగా దాదాసాహెబ్ ఫాల్కే ఆర్ జే అవార్డులను ప్రవేశపెట్టగా.. ఫస్ట్ అవార్డుని మలిష్క దక్కించుకుంది.  

దేశంలోనే నంబర్ వన్ ఆర్ జే గా  శ్రోతల్ని అలరిస్తూ, మరోపక్క  ప్రజల్లో సామాజిక అంశాలపై  అవగాహన కల్పిస్తోంది. దీంతో  సోషల్ మీడియాలో లక్షలమంది మలిష్కను ఫాలో అవుతున్నారు. మలిష్క ముంబైలో పుట్టి పెరిగిన అమ్మాయి. పదమూడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయింది. దీంతో ఆమె తల్లి లిల్లీ మెండన్నా అన్నీ తానై మలిష్కను పెంచారు.

ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ, ముంబై యూనివర్సిటీలో మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ లో మాస్టర్స్ చేసింది .  మంచి స్వరం .. మాటకారి తనం ఆమెకు జాకీగా రాణించడానికి తోడ్పడ్డాయి. హిందీ డిస్కవరి ఛానెల్ లో వాయిస్ వోవర్ ఆర్టిస్ట్ గా కొన్నాళ్ళు పనిచేసింది. ఇలా రెండేళ్లు పనిచేసాక… విన్ 94.6 ఎస్ఎమ్” లో ఆర్ జే గా  అవకాశం వచ్చింది. అక్కడనుంచి ఇక వెనుతిరిగి చూడలేదు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!