శివుడు అఘోరీనా ? అలా ఎందుకు పిలుస్తారు ?

Sharing is Caring...

The five faces of Shiva …………….

పరమ శివుడిని ‘అఘోరి’ అని కూడా పిలుస్తారు. అలా శివుడిని పిలవడం వెనుక లోతైన అర్థాలు చాలానే ఉన్నాయి. అఘోరీ  లేదా అఘోర’ అంటే భయంకరమైనది కాదు, భయం లేనివాడు అని అర్థం. ప్రపంచం లోని ప్రతిదీ శివస్వరూపమే అని, భయపడాల్సింది ఏదీ లేదని ఈ పదం సూచిస్తుంది.అధర్వణ వేదం లో ఈ పదం మొదటిసారి ప్రస్తావించబడింది.

శివుని పంచముఖాలలో అఘోరీ ముఖం దక్షిణ దిశను చూస్తుంది. ఇది సృష్టిని లయం చేసి (మృత్యువు), తిరిగి కొత్తగా సృష్టించే ప్రక్రియకు సంకేతం.అఘోర అనే పదానికి రెండు పరస్పర విరుద్ధ అర్థాలు ఉన్నాయి..ఒకటి అత్యంత భయంకరమైన రూపం, రెండోది అత్యంత అందమైన రూపం. అందుకే ఆయనను అఘోరీ అని కూడా పిలుస్తారు.

అఘోర మహర్షి రూపొందించిన మంత్రంలో 51 అక్షరాలు ఉంటాయి. ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందడానికి, భయం,ఆందోళనలను తొలగించుకోవడానికి ఆధ్యాత్మిక వృద్ధికి ఈ మంత్రాన్ని జపిస్తారు.ఇది రుద్రుని శక్తిని ఆవాహన చేస్తుంది.

అఘోరీ సాధువులను శివుని భూలోక ప్రతిరూపాలుగా భావిస్తారు. కోరికలు, భావోద్వేగాలతో ఉన్న మానవుడు ‘శవం’ వంటివాడని, వాటిని జయించి ‘శివం’గా మారాలని వీరు నమ్ముతారు. ఈ అఘోర తత్వాన్ని దత్తాత్రేయ స్వామి ప్రాచుర్యంలోకి తెచ్చారని ఒక నమ్మకం.

అలాగే శివుని అవతారంగా భావించే కీనారామ్ బాబా నుండి ఈ అఘోర పంథా ప్రారంభమైందని మరికొందరు విశ్వసిస్తారు. మొత్తంగా ఒక అఘోరీకి సృష్టిలోని ప్రతి అణువులోనూ శివుడు కనిపిస్తాడు. వారికి శివుడు తప్ప రెండో వస్తువు లేదు.

ముందే చెప్పుకున్నట్టు శివుని పంచముఖాల ఒకటి అఘోరీ ..శివుని పంచముఖాలు సృష్టిలోని ఐదు మూలస్థంభాలకు, ఐదు దిశలకు, పంచభూతాలకు సంకేతాలు. శివలింగంపై ఉండే ఈ ఐదు ముఖాల వెనుక ఉన్న పరమార్థం ఇదే.

 సద్యో జాత
అప్పుడే పుట్టిన అని ఈ పదానికి అర్థం. ఈ ముఖం పశ్చిమ దిశను చూస్తున్నట్టుగా ఉంటుంది. భూ (పృథ్వీ) తత్వానికి సంకేతం.సకల ప్రాణులు సహా మన చుట్టూ ఉన్న కదిలేది, కదలనివి, సర్వ సృష్టికీ శివుడే మూలం. ప్రకృతిలోనూ, ప్రాణుల్లోనూ ఉన్నది ఈశ్వరుడే. ఈ సృష్టినీ, అందులోని జీవాన్నీ సమతూకంలో ఉంచేదీ మహేశ్వరుడే. ఇది సృష్టికి కారకమైన ముఖం. శివుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే రూపాన్ని ఇది సూచిస్తుంది.

వామదేవ 
అంటే ఉత్తర, అందమైన అని అర్థాలు.ఈ వామదేవ ముఖం ఉత్తర దిశగా చూస్తుంది. ఈ  వామ దేవ రూపంలో శివుడు సృష్టిని రక్షిస్తాడు. ఇది నీటికి సంకేతం. మనకు శ్వాసక్రియ, జీర్ణక్రియకు కావాల్సిన శక్తిని అందించేదీ ఆయనే. జీవులకు ప్రాణావసరమైన గాలి, నీరు, ఆహారం అందించి బతికించేది పరమశివుడే.

తత్పురుష
ఈ ముఖం తూర్పు దిశ ను చూస్తుంటుంది. ఇది తిరోధాన కృత్యానికి సంకేతం. అంటే శివుడే శాశ్వతుడు మనం అనిత్యులం అని తెలుసుకోకుండా మాయలో పడేసేదీ ఆయనే..తిరోధాన పదానికి అర్థం అదే. ఈ రూపం వాయు తత్వానికి సూచిక. సృష్టికర్త  శివుడే సృష్టిని తన మాయలో మునిగేలా చేసి, జీవులు తమ నిజ స్వరూపం గానీ, పరమశివుడి ఉనికిని గానీ తెలుసుకోకుండా చేస్తున్నాడు. అది తెలుసుకున్న నాడు మనకు మోక్షం సిద్ధిస్తుంది.
ఈశాన
పైకి చూస్తున్నట్టు ఉండే ముఖం ఈశాన స్వరూపం. సకల సృష్టికీ అధిపతి  ఆ మహాదేవుడే  అని దీని అర్థం. ఆకాశ తత్వానికి ప్రతీక ఈ రూపం శివుడి అనుగ్రహ కృత్యాన్ని సూచిస్తుంది. సృష్టిలో సత్యం, అత్యున్నత జ్ఞానానికి నిలయం తానే అని పరమశివుడు ఈ రూపం ద్వారా తెలియజేస్తాడు.

ఆ విధంగా మనల్ని అనుగ్రహిస్తాడు. మహేశుని అనుగ్రహం లేకుంటే మనకు ప్రశాంతత, జనన మరణ చక్రం నుంచి విముక్తి లభించవు.గురువుగా శివుడు జ్ఞానాన్ని బోధించేది ఈ రూపం ద్వారానే. నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయంలో శివుని ఈ పంచముఖాలను స్పష్టంగా దర్శించుకోవచ్చు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!