Subramanyam Dogiparthi ……………………………
మరో చరిత్రను సృష్టించింది ఈ ‘మరో చరిత్ర ‘సినిమా. వందల వందల సినిమాలలో నటించిన సీనియర్ స్టార్లకు మాత్రమే సినిమాలు వంద రోజులు ఆడే రోజుల్లో .. ఒక తమిళ జూనియర్ నటుడు , ఒక సరికొత్త నటి నటించిన ఈ మరో చరిత్ర మద్రాసు , బెంగుళూర్లలో డబ్బింగ్ లేకుండా వందల రోజులు ఆడటమంటే మరో చరిత్ర కాక మరేమిటి !
చరిత్రలో అప్పటివరకు లైలా మజ్ను ,సలీం అనార్కలి , రోమియో జూలియట్ కధలే విషాద ప్రేమ గాధలు .ఉదాహరిస్తే ఎన్నో గాధలు హృదయ విదార విషాద గాధలు . అలాంటి ప్రేమ గాధల్లోకి చేరింది బాలు-స్వప్నల మరో విషాద ప్రేమ చరిత్ర.
బాాలచందర్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి సినిమాను విషాదం చేయటానికి . విషాదం చేసి ఉండకపోతే ఇలాంటి మరో చరిత్ర సృష్టించి ఉండేది కాదేమో ! రంగుల సినిమాలు తెలుగు సినిమా రంగాన్ని ఆక్రమించుకుంటున్న సమయంలో బ్లాక్ & వైట్ సినిమా తీయటం,ఆ సినిమా మరో చరిత్రను సృష్టించటం నిస్సందేహంగా గొప్ప విషయమే.
ఓ తమిళబ్బాయి,ఓ తెలుగమ్మాయి. ఇద్దరూ ఆ వయసులో సహజంగా ఉండే ధైర్యం ఉన్నోళ్ళే , మించి మొండోళ్ళు . ప్రేమంటేనే మొండితనం. అరవై ఏళ్ల వయసులో కొత్తగా ప్రేమించుకున్నా మొండిగానే ఉంటుంది ప్రేమ.అలాంటి ఇద్దరు యువతీయువకులు ప్రేమలో పడటాన్ని , వాళ్ళు ప్రేమించుకోవటాన్ని నలుపు తెలుపుల్లో , విశాఖ-భీమిలి-అరకు అందాల నేపధ్యంలో బాలచందర్ అద్భుతంగా ఆవిష్కరించారు.
యం యస్ విశ్వనాధన్ సంగీత దర్శకత్వంలో పాటలు 46 ఏళ్ల తర్వాత కూడా సూపర్ డూపర్ హిట్టే . ‘ఏ తీగె పువ్వును’ పాట సుశీలమ్మ పాడిందంటే ఆశ్చర్యమే . మధ్యమధ్యలో కమలహాసన్ అరవ పదాలు గమ్మత్తుగా ఉంటాయి .’పదహారేళ్ళకు నీలో నాలో’ , ‘భలె భలే మొగాడివోయ్ బంగారు నాసామివోయ్’ పాటల్ని బాల సుబ్రమణ్యం , యల్ ఆర్ ఈశ్వరి,జానకిలు ఆకట్టుకునేలా పాడారు .
బాలసుబ్రమణ్యం ఇంగ్లీషులో ఎత్తుకోవడం వెరైటీగా ఉంటుంది .ఈ పాటలో కమలహాసన్ , సరిత డాన్స్ కూడా భలేగా చేస్తారు .లిఫ్టులో పాడే పాట చాలా ఇంటరెస్టింగ్ . సినిమా పేర్లన్నీ కూర్చి ఆత్రేయ బాగా వ్రాసారు. లిఫ్టే అప్పటికి ఇంకా పాపులర్ కాలేదు . అలాంటి లిఫ్టులో పాట కుర్రకారుకి మాంచి ఐడియా ఇచ్చేసారు. కుర్రకారు ఆ ఐడియాను బాగానే అందుకున్నారు కూడా.
వాణీ జయరాం పాడే ‘విధిచేయు వింతలను’ పాట హృద్యంగా ఉంటుంది. ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది మరొకటి కూడా ఉంది . కమల్ హాసన్ శాస్త్రీయ నృత్యం. సాగరసంగమం సినిమా కన్నా ముందే ఈ సినిమాలో తన శాస్త్రీయ నృత్య పటిమను ప్రదర్శించారు. ఈ సినిమాలో పాటలను అన్నీ ఆత్రేయే వ్రాసారు. అద్భుతంగా వ్రాసారు.
ఈ సినిమాలో మరో గొప్ప పాత్ర సంధ్య . ఊరుమ్మడి బతుకులు సినిమా ద్వారా పేరు తెచ్చుకున్న మాధవికి ఈ పాత్ర రావటం, ఆమె తన శైలిలో బాగా నటించటం వలన ఆమెకు తర్వాత కాలంలో మంచి అవకాశాలను తెచ్చిపెట్టాయి .గణేష్ పాత్రో వ్రాసిన డైలాగులు ఈ సినిమా విజయానికి ఎంతగానో దోహదపడ్డాయి . డొంక తిరుగుడు లేని straight dialogues .
సినిమాలో పాత్రలన్నీ డొంక తిరుగుడు లేకుండా straight గా, మొండిగా, మూర్ఖంగా ఉంటాయి . హీరోహీరోయిన్ల తల్లిదండ్రులు, సంధ్య అన్న , హీరోయిన్ని ప్రేమించే పట్టాభి , మానభంగం చేసే విలన్ అందరూ మొండిగా, మూర్ఖంగానే ఉంటారు. ఒక్క మాధవి నటించిన సంధ్య పాత్రే సున్నితంగా ఉండేది .
161 మందిని ఆడిషన్ చేసాక అభిలాష అనే అమ్మాయి హీరోయినుగా ఎంపిక అయింది. ఆమే కొత్త నటి సరిత. హీరోయిన్ అంటే సన్నగా , నాజూగ్గా , ఎర్రగా , తెల్లగా ఉండాలనే ఫిక్సేషన్ని వదిలి , next door అమ్మాయి ఎలా ఉంటుందో అలాంటి అమ్మాయి సరితను ఎంపిక చేసుకున్నారు బాలచందర్ . ఆయన ఎంపిక కరెక్ట్ అయింది . మొట్టమొదటి సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న హీరోయిన్ లాగా నటించింది .
ఓ తమిళ నటుడు , ఓ అరవ దర్శకుడు తెలుగులో తీసిన ఈ సినిమా హిందీలో రీమేక్ చేస్తే అక్కడా హిట్టయింది . కమల్ హాసన్ జోడీగా రతి అగ్నిహోత్రి నటించింది . బాలసుబ్రమణ్యం పాడిన తేరె మేరె బీచ్ మే పాట సూపర్ డూపర్ హిట్టయింది . కన్నడం , మళయాళం , తమిళం భాషల్లోను తీశారు.
ఈ సినిమాలో ఎర్ర హీరో మాదాల రంగారావు ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు . ఇతర పాత్రల్లో రమణమూర్తి , మిశ్రో , జయవిజయ , పి యల్ నారాయణ , కాకినాడ శ్యామల , తదితరులు నటించారు. ఈ తరంలో కూడా ఈ సినిమాను చూడని వారు ఎవరూ ఉండరు . ఒక్కొక్కరు పది సార్లయినా చూసి ఉంటారు . పోయిన వారం కూడా ఏదో చానల్లో వచ్చింది . యూట్యూబులో ఉంది . పాటల వీడియోలు కూడా ఉన్నాయి.