దటీజ్ వంగవీటి రంగా !!

Sharing is Caring...

Paresh Turlapati …………………………

“పరేష్ బాబూ… వంగవీటి రంగా గారు వచ్చారు..కింద ఉన్నారు.. నిన్ను రమ్మన్నారు..”
క్లాసులో ఉన్న నాకు అటెండర్ చెప్పిన మాట ఇది. ఒక్క క్షణం నాకు అర్థం కాలేదు ..’రంగా గారు కాలేజీకి ఎందుకొచ్చారు’ అని.. మరుక్షణం రెండ్రోజుల క్రితం సంఘటన గుర్తొచ్చింది. జ్యోతి కాలేజీ లో సీటు కోసం ఇద్దరు వ్యక్తులు నన్ను కలిశారు .. ఇద్దరూ పేద కుటుంబాలకు చెందినవాళ్లే ..వాళ్ళు తమ పిల్లల్ని కాలేజీలో చేర్పించటానికి వస్తే అడ్మిషన్స్ అయిపోయాయి అని చెప్పారట..

నేను ఆ పేరెంట్స్ ని అదే అడిగాను …’ఇంత లేట్ గా అడ్మిషన్స్ కు ఎందుకు వచ్చారూ’ ? అని “టెన్త్ లో మార్కులు బాగా వచ్చాయని సిటీలో ఉన్న పెద్ద కాలేజీల్లో సీటు కోసం ట్రై చేసాం..కానీ డొనేషన్స్ అడగటంతో చెల్లించే స్తోమత లేక చివరికి ఈ కాలేజీలో చేర్పిద్దామని వచ్చాం..కానీ ఇక్కడ అడ్మిషన్స్ అయిపోయాయి “అని చెప్పారు.

మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి సీటు ఇప్పించమని కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు”
నిజానికి ఆ రోజుల్లో విజయవాడలో దాదాపు అన్ని ప్రముఖ కాలేజీలు అనధికారికంగా డొనేషన్స్ వసూలు చేసేవి … నిధుల కొరత ఉన్నా… చిన్న కాలేజీ అయినా గాంధీ నగర్లో ఉన్న జ్యోతి జూనియర్ కాలేజీలో రూపాయి డోనేషన్ అడిగేవాళ్ళు కాదు..ఫీజులు కూడా నామమాత్రమే..

‘సరే ప్రయత్నం చేస్తా’ అన్చెప్పి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని ఆ సాయంత్రం గవర్నర్ పేటలో వంగవీటి మోహన రంగా గారు ఉండే ఇంటికి వెళ్ళా … అప్పటికే ఎమ్మెల్యే గారిని కలవటానికి వచ్చిన జనం విపరీతంగా ఉన్నారు… ఆ ఇంటికి కార్లలో వచ్చేవాళ్ళు తక్కువ.
రిక్షా కార్మికులు..ఆటో కార్మికులు ఎక్కువమంది వీళ్ళే… చుట్టూ జనం. 

ఒకొక్కళ్లతో మాట్లాడి పంపించేస్తున్నారు రంగా గారు.. ఈ రష్ లో మాట్లాడటం అయ్యేపని కాదని వెనక్కి వెళ్లబోతుండగా రంగా గారు నావంక చూసి సైగ చేశారు దగ్గరికి రమ్మని ,
“ఏమయ్యా..పరేష్…ఇక్కడిదాకా వచ్చి కలవకుండానే వెళ్లిపోతున్నావ్ ? ఏంటి సంగతి ?” అన్నారు చిరునవ్వుతో..

ముఖాన చెరగని చిరునవ్వు.. ఎంతమందిలో ఉన్నా ఆప్యాయంగా పిలవడం..ఇదే నాకు వంగవీటిలో నచ్చిన ప్రధాన లక్షణం …ఎటువంటి ఈగోలు లేవు…ఇప్పుడు ఎమ్మెల్యేలను కలవాలంటే ఎంత బిల్డప్ ఇస్తారో నాకు తెలుసు..

సరే ,జనం బాగా ఉండటంతో క్లుప్తంగా రెండు ముక్కల్లో ఇద్దరు పేద విద్యార్దులకు జ్యోతి కాలేజీలో సీట్లు కావాలని వచ్చిన పని చెప్పా..“వాళ్ళ డీటెయిల్స్ రాసి ఇతనికి ఇచ్చి వెళ్ళు… చూద్దాం..”అని పక్కనున్న మనిషిని చూపించారు.

నేను డీటెయిల్స్ స్లిప్ మీద రాసి అతనికిచ్చి వచ్చేసా …ఇది జరిగి రెండు రోజులు అయ్యింది. ఈ రెండు రోజులూ కాలేజీ ఆఫీసులో వాకబు చేశా ఎమ్మెల్యే గారినుంచి ప్రిన్సిపాల్ కు ఏమైనా ఫోన్లు వచ్చాయా ? అని ..అటువంటి ఫోన్లు ఏమీ రాలేదని వాళ్ళు చెప్పారు …మరోపక్క ఆ పేరెంట్స్ నా వెంటపడుతున్నారు.. నాకు డౌట్ వచ్చింది.. ఆ స్లిప్ తీసుకున్న వ్యక్తి చీటీ రంగా గారికి ఇచ్ఛాడో.. లేకపోతే మర్చిపోయాడో ?

లేకపోతే బిజీగా ఉండి రంగా గారు ఫోన్ చెయ్యటం మర్చిపోయారా ? ఇదిగో ఇలా క్లాసులో కూర్చుని డౌట్ లతో సతమతమవుతున్న సమయంలో రంగా గారు కాలేజీ బయటే ఉన్నారని పిలుపు వచ్చింది.. గబ గబా కిందకెళ్లా..అప్పట్లో ఎమ్మెల్యేల కు గన్ మెన్లు ఇవ్వలేదు కాబట్టి ఆ హడావుడి లేదు.

ముందు మహేంద్రా జీపు..(మహేంద్రా జీపు కూడా ఆయన ఎమ్మెల్యే అయ్యాక కొనుకున్నట్టు గుర్తు..ఇప్పుడు కార్పొరేటర్లు కూడా ఖరీదైన ఫార్ట్యూనర్ కార్లు కొంటున్నారు ) వెనుక కారు..
జీపులో రంగా గారు … పరిగెత్తుకుంటూ ఆయనదగ్గరకెళ్లా. “పరేష్…ప్రిన్సిపాల్ గారున్నారా ?” అదే చిరునవ్వుతో అడిగారు(మా ప్రిన్సిపాల్ రిటైర్డ్ ఆర్మీ అధికారి).

ఉన్నారని తలవూపి ప్రిన్సిపాల్ రూమ్ దగ్గరికి తీసికెళ్లి కర్టెన్ పక్కకి తియ్యబోతుంటే రంగా గారు నన్ను వారించి ‘ మే ఐ కమ్ ఇన్ సర్ ‘ అని తలుపు మీద కొట్టారు ..నాకు ఆశర్యం వేసింది.. ఎమ్మెల్యే అయి ఉండి కూడా సాధారణ విజిటర్స్ మాదిరి ‘లోపలికి రావొచ్చా’ అని అడగటం చూసి..లోపలినుంచి ప్రిన్సిపాల్ ‘ Yes ‘అనటంతో వెనుక ఉన్న అనుచరులను అక్కడే ఆగమని సైగ చేసి నన్ను తనకూడా లోపలికి తీసుకెళ్లారు.

లోపలికి పర్మిషన్ అడిగి మరీ వచ్చింది ఎమ్మెల్యే అని తెలిసి ప్రిన్సిపాల్ గారు ఆశర్యంతో లేచి నించున్నారు.. రంగా గారు ఆ ఇద్దరు స్టూడెంట్స్ తాలూకూ పేదరికం బ్యాక్గ్రౌండ్ క్లుప్తంగా చెప్పి ఆ మెరిట్ స్టూడెంట్స్ కి మీ కాలేజీ లో సీట్ ఇస్తే సంతోషపడేవాళ్ళలో ప్రధముడిని నేనే ప్రిన్సిపాల్ గారూ అని నవ్వుతూ అన్నారు. 

“ఎమ్మెల్యే గారూ.. ఇంత చిన్నపనికి మీరు స్వయంగా రావాలా ? మీ ఆఫీసు నుంచి ఫోన్లో చెప్పించినా సరిపోయేది కదా సార్…తప్పకుండా వాళ్ళిద్దరికీ సీట్లు ఎలాట్ చేస్తా..”అని గౌరవంగా సమాధానం ఇచ్చారు మా ప్రిన్సిపాల్..

రంగా గారు చిరునవ్వుతో “చూడండి సార్.. మీరు ఈ కాలేజీకి ప్రిన్సిపాల్…కానీ అంతకన్నా ముందు రిటైర్డ్ ఆర్మీ అధికారి..అలా చూస్తే మీకు ఫోన్ చెయ్యటం కన్నా ఇలా స్వయంగా రావటమే కరెక్ట్ అనిపించింది..”అని లేచారు. మా ప్రిన్సిపాల్…ఆ వెనుకే నేనూ జీపుదాకా వెళ్లి వంగవీటి సెండాఫ్ ఇచ్చాం. 

వంగవీటి మోహన రంగా గారి గురించి నేను విన్నది వేరు…చూసిన తర్వాత అర్థమైంది వేరు…స్వయంగా వారితో మాట్లాడిన తర్వాత ఆయన సింప్లిసిటీ గురించి తెలిసింది…కేవలం ఇద్దరు స్టూడెంట్స్ కోసం ఎమ్మెల్యే అయివుండి కూడా ఎటువంటి ఈగోలు లేకుండా స్వయంగా రావటం స్టూడెంట్స్ కోసం ఆయన తీసుకునే శ్రద్ధ తెలుస్తుంది..ఆయన వెళ్ళాక చాలా హ్యాపీగా మా ప్రిన్సిపాల్ గారు చెప్పిన మాటలు ఇవి.  నాక్కూడా చాలా ఆశర్యం వేసింది. 

ఏదో రకంగా ఆయన కాలేజీకి ఫోన్ చేస్తే పనవుతుందని నేను అనుకుంటే విషయం గుర్తుపెట్టుకొని మరీ స్వయంగా కాలేజీకి వచ్చి పరిష్కారం చేయటంతో వంగవీటి మోహన రంగా గారు నాయకుడిగా అంత త్వరగా ఎందుకు ఎదుగుతున్నారో అర్థం అయ్యింది !
ఇదండీ రంగా గారితో నా అనుభవం.

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. sinu December 28, 2024

Leave a Comment!

error: Content is protected !!