రాగాల పూలతోట – భాగేశ్వరి !!

Sharing is Caring...

Taadi Prakash …………………

FRAGRANCE OF A SOULFUL RAGA …………………………………….

విజయవాడ వెళ్తున్నాం కారులో. తెనాలి గాయకుడు, మిత్రుడు సాబిర్ మహమ్మద్ డ్రైవ్ చేస్తున్నాడు. సాహిత్య సంగీత స్పెషల్ శివలెంక పావనీ ప్రసాద్ ముందు సీట్లో, నేను వెనక. పావనీ ప్రసాద్ ఒక పల్లవి పాడారు. సాబిర్ చరణం అందుకున్నాడు. అలా వో నాలుగు పాటలు. ఇవన్నీ భాగేశ్వరి రాగం.. తెలుసా?అన్నారు. నేను రెండు పాటలు గుర్తు చేశాను. అమ్మో, మీకెలా తెలుసు అన్నారు.

తుఛ్చమైన జర్నలిస్టువి కదా, స్వఛ్చమైన సంగీతంతో నీకేం పని? అని దానర్థం. అవమానాన్ని దిగమింగి కక్షతో రగిలిపోయిన ఆ క్షణాల్లోనే, నా ప్రియురాలు భాగేశ్వరి గురించి రాయాలని డిసైడైపోయాను. దాదాపు 3 గంటల సేపు భాగేశ్వరి లోని సినిమా పాటలతో ప్రయాణం సాగిపోయింది.

ఆర్ట్ సినిమా, నిజమైన సాహిత్యం లాగే సీరియస్ శాస్త్రీయ సంగీతం యవ్వనంలోనే నా తల నిమిరి దగ్గరికి తీసుకుంది. 1978లో విశాఖ ‘ఈనాడు’లో చేరాక నాలుగైదేళ్ళ పాటు గొప్ప కచేరీలకు వెళ్లాను.79 – 80లో మా సుశీలక్క దగ్గరికి విజయనగరం వెళ్లినపుడు, ఆ సాయంకాలం ఎం ఎల్ వసంతకుమారి సంగీత కచేరి…. నాలుగు గంటల సేపు దాదాపు నాన్ స్టాప్ గా PURE CLASSICAL గంగా ప్రవాహం. జనం వూగిపోయారు.

మంచి గంధం లాంటి సంగీతాన్ని, శ్రీవిద్యనీ మనకి కానుకగా ఇచ్చిన తల్లి ఎమ్మెల్ వసంత కుమారి. మరో చల్లని సాయంకాలం ఆంధ్రా యూనివర్సిటీ లో రవిశంకర్ కచేరీ. రూపాయి ఖర్చు లేకుండా రవిశంకర్ కచేరి వినడం, అదీ ముందు వరసలో కూర్చుని! రవిశంకర్ పక్కన గ్రేస్ ఫుల్ గా ఉన్న బట్టతలాయన లాల్చీవెనక్కి మడిచిన చేతులతో రెండు తబలా లనీ ప్రేమగా నిమురుతున్నాడు – వాడు అల్లారఖా!

45 నిమిషాలు సితార తో మైమరిపించాక రవిశంకర్ చిన్నగా నవ్వి “నువ్వు కానీ ఇక” అన్నట్టుగా చేతితో సైగ చేశాడు. అందుకున్నాడు అల్లారఖా. 45 నిమిషాల సేపు అల్లారఖా సోలో! ఈ చెవులు నమ్మలేకపోయాయంటే నమ్మండి. మాషా అల్లా!
ఇక సితార కన్నతండ్రి, తబలా పెదనాన్న…ఇద్దరూ కలిసి మరో గంటన్నర – పక్కనున్న సముద్రం కెరటాలు కెరటాలుగా కచేరీ హాల్లోకి చొరబడిపోయినట్టు, అమృతం తాగడం అంటే ఏమిటో అవగతమవుతున్నట్టు, ఆ రెండు జతల చేతులు పట్టుకొని మబ్బుల్లో నడుస్తున్నట్టు, జాకీర్ హుస్సేన్ అనే ఒక చిన్న పిల్లాడు మా వెంటపడి వస్తున్నట్టు… శ్రీశ్రీ అన్న దివ్యానుభవం ఇదేనేమో!
****
విశాఖలోనే డీకే పట్టమ్మాళ్, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, బాలమురళీకృష్ణ, ఈమని శంకరశాస్త్రి…ఇంకా ఎందరో, ఎన్ని కచేరీలో… ఎంత ఆత్మానందం మూటగట్టుకున్నానో. మా అమ్మ ఎంత పుణ్యం చేసుకుందో… అనిపించేలా. విజయవాడలో చిట్టిబాబు వీణ, ఐదుగురు కొడుకులతో బిస్మిల్లా ఖాన్ షెహనాయీ, కళాక్షేత్రంలో పర్వీన్ సుల్తానా అమరగానం, రవీంద్ర భారతిలో జస్రాజ్ పాట తెల్లవారి పోయేదాకా, దుర్గా జస్రాజ్ పక్కనే తంబురాతో …. సంతూర్ మాస్త్రో పండిత్ శివ కుమార్ శర్మ హృదయ రాగం… రోజులు ఎలా గడిచిపోయాయో!

అటు జర్నలిజం అనే కడుపు వృత్తి, ఇటు సంగీతం అనే ఆత్మసంతృప్తి! ఈ రెండిటి మధ్య సినిమా పాట అనే కక్కుర్తి ఒకటి ఉంటుంది. అది వినోదమూ, మరియు రాగసుధా భరితము! NEWS TO INFORM NOT TO ENTERTAIN అని పెద్ద జర్నలిస్టులు అంటుంటారు. శాస్త్రీయ సంగీతం నిన్ను మానవుణ్ణి చేస్తుంది. సినిమా పాట నీ బుగ్గలు గిల్లి, చక్కిలిగిలి పెట్టి, వినోదం అంటూ మత్తుగా కన్నుగీటుతుంది. జర్నలిజం వినోదం అయిన రోజుల్లో, సినిమా పాట వికృతంగా నవ్వుతున్న కాలంలో – కొన్ని మంచి పాటల్ని గుర్తుచేసుకుందాం.

Pl.Read it also………………….. రాగాల పూలతోట – భాగేశ్వరి !!(2)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!