ఆయన ఊహించని సన్నివేశం !!

Sharing is Caring...

An unexpected experience………………………………

దివంగత నేత,తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రాజకీయాల్లోకి రాకముందు మంచి రచయిత. ఎన్నో నాటకాలు రాశారు. మరెన్నో సినిమాలకు కథ మాటలు సమకూర్చారు.రచయితలంటే సహజంగా మంచి డ్రామా ఉన్న సన్నివేశాలను సృష్టిస్తుంటారు.ప్రేక్షకులు చప్పట్లు కొట్టే డైలాగులు రాస్తుంటారు. కన్నీళ్లు పెట్టేలా సన్నివేశాలను మలుస్తుంటారు.

అచ్చం సినిమాల్లో మాదిరి సన్నివేశం,ఒక అరుదైన సీన్ నిజ జీవితంలో ఆయనకు ఎదురైంది. ఆ సన్నివేశాన్ని కరుణానిధి అసలు ఊహించి ఉండరు. ఆ సన్నివేశంలో కరుణానిధి కన్నీరు పెట్టుకున్నారు . భోరున విలపించారు. అది నిజ జీవిత ఘటన. అది కూడా 87 ఏళ్ళ ముదిమి వయసులో. దాన్ని గురించి తెలుసుకోవాలంటే కొన్ని ఏళ్ళు వెనక్కి పోవాలి.

అప్పట్లో స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కరుణానిధి ముద్దుల కూతురు కనిమొళిని అరెస్ట్ చేసి తీహార్ జైలుకి పంపారు. కనిమొళి కరుణానిధి మూడో భార్య రజతి అమ్మాళ్ సంతానం. కూతురును పరామర్శించేందుకు భార్యతో కలసి కరుణా నిధి జైలు కెళ్లారు. కరుణ నిధి తో పాటు ఆమె భర్త అరవిందన్, కనిమొళి కొడుకు ఆదిత్య కూడా వెళ్లారు.

కుటుంబ సభ్యులతో కలసి వెళ్లి జైలులో కనిమొళి ని కలిసేందుకు స్పెషల్ పెర్మిషన్ ఇచ్చారు. జైలు లోపలికి వెళ్ళగానే మర్యాదపూర్వకంగా అందరికి టీ కూడా ఇచ్చారు. డీఐజీ స్థాయి అధికారి దగ్గరుండి కరుణానిధి,కుటుంబ సభ్యులను సెల్ వద్దకు తీసుకెళ్లారు. తీహార్ జైలు చాలా పెద్దది.అక్కడ ప్రత్యేకంగా మహిళలకు, పురుషులకు వార్డులున్నాయి.

ఎనిమిదో మహిళా వార్డులోని ఆరో నంబర్ సెల్ లో కనిమొళిని ఉంచారు.కరుణానిధి నడవలేరు కాబట్టి చక్రాల కుర్చీలోనే సెల్ వద్దకు తీసుకువెళ్లారు. సెల్ నుంచి బయటకొచ్చిన కనిమొళి తల్లి తండ్రిని,భర్తను, కొడుకును చూసి భోరున విలపించింది. ఆమె పరిస్థితి చూసి మిగతా వాళ్ళు రోదించారు. ఆ దృశ్యం చూసి కరుణా నిధి కూడా తట్టుకోలేక భావోద్వేగానికి గురయ్యారు. తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకున్నారు.

దూరం గా ఉండి గమనిస్తున్న అధికారులు, సిబ్బంది కూడా  ఆ సన్నివేశాన్ని చూసి చలించిపోయారు. దాదాపు అరగంట సేపు కూతురితో గడిపిన కరుణానిధి తర్వాత అదే కేసుకు సంబంధించి జైలులో ఉన్న మాజీ టెలికాం మంత్రి ఎ రాజా ను, కలైంగర్ టివి మేనేజింగ్ డైరెక్టర్ శరద్ కుమార్ ను కలిశారు. 

అనంతరం నేరుగా తాను బస చేసిన  హోటల్ కు వెళ్లిపోయారు. ఎపుడూ ఢిల్లీ వెళ్లినా సోనియా గాంధీ ని కలిసే కరుణ ఆ ట్రిప్ లో ఆమెను కలవలేదు. గంట తరువాత కేంద్ర హోమ్ మంత్రి చిదంబరం కరుణానిధిని కలసి మాట్లాడారు. ఆ సందర్భంగా కరుణానిధి చిదంబరంపై మండి పడ్డారట.

ఇదిలా ఉంటే  తీహార్ జైలులో కనిమొళి కి ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.ఆమె కోసం ఒక అటాచ్డ్ బాత్రూమ్, ఫ్యాన్,టీవీ, సౌత్ ఇండియన్ ఫుడ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. కొన్నాళ్ల తర్వాత సంచలనం సృష్టించిన ఈకేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఏ.రాజా, కనిమొళి లను నిర్దోషులుగా ప్రకటిస్తూ  సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పుఇచ్చింది. ఈ 2జీ కుంభకోణం వలన ప్రభుత్వ ఆదాయానికి 30 వేల కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది.

———-  K.N.MURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!