మన దేశంలో హోళీ పండగకు ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ పండుగ రోజున పెద్ద చిన్నఅంతా ఆనందంగా వీధుల్లోకి వచ్చి ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటారు. ఈ హోళీ ప్రజల మధ్య సఖ్యత, సమైక్యత పెంపోందిస్తుందని భావించి ఈ పండగ ను మన పూర్వీకులు ప్రవేశపెట్టారని చెబుతారు.
రంగుల పండగ హోళీని వీధుల్లో జరుపుకుంటారు.వసంత పంచమి నుండి పౌర్ణమి వరకు ఈ వసంతోత్సవాలు జరుపుతారు. చతుర్దశి రోజు రాత్రి ఓ కూడలిలో ‘కామదహనం’ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక ఆ మరుసటి రోజున ఉదయం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటారు.
ఈ హోళీ వేడుకల్లో మహిళలు చప్పట్లతోనూ.. పురుషులు కోలాటాలతోను.. సందడి చేస్తారు. ఈ హోళీ జరుపుకోవడానికి ఒక పౌరాణిక కథ మూలమని అంటారు. ఆ కథే కామదహనం.
ఏమిటీ కామదహనం ??
శివుని భార్య సతీదేవి దక్ష యాగములో దేహత్యాగం చేస్తుంది. ఆ తరువాత శివుడు రుద్రుడై వీరభద్రుణ్ణి , భద్రకాళిని సృష్టించి యాగాన్ని ధ్వంసం చేసి దక్షుడి అహంకారాన్ని , గర్వాన్ని అణిచాడు.అదే తరుణంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఘోరతపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు.
అయితే అప్పటికే సతీదేవి దక్ష యాగములో దేహత్యాగం చేసిందని .. శివుడు భార్యా హీనుడైనాడని తెలిసి తనకు శివపుత్రుని చేత మరణం కావాలని కోరతాడు తారకాసురుడు. తధాస్తు అంటాడు బ్రహ్మ.
భార్యావియోగంలో శివుడు మరల వేరొకరిని వివాహమాడడని తానిక అమరుడినని తారకుడు భావిస్తాడు. అప్పటినుంచి ముల్లోకాలను జయించి దేవతలు , జనులు , ఋషులను బాధిస్తుంటాడు.
పర్వతరాజు హిమవంతుడు,మేనాదేవి దంపతులు సంతానం కోసం తపస్సు చేస్తారు. వారి తపానికి మెచ్చిన జగన్మాత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా ” నీవే మాకు పుత్రికగా రావాలి! ” అని కోరతారు. సరేనన్న జగజ్జనని ఆ తరువాత పార్వతీదేవిగా హిమవంతుడికి జన్మిస్తుంది. శివుడు భార్యావియోగంతో రుద్రుడైనా మరల శాంతించి తపస్సులోకి వెళ్ళిపోతాడు.
హిమవంతుని పుత్రిక హైమావతి చిన్ననాటి నుండే అపర శివభక్తి కలదై ఆయననే మనస్సునందు నిలుపుకొని రోజూ శివపూజ చేసేది. హిమాలయాలలో తపములోనున్న శివుడిని పూజించడానికి రోజూ వెళ్ళేది. కానీ శివుడు ఒక్కసారైనా పార్వతీదేవిని చూడడు.
ఈలోగా తారకాసురుడు పెట్టే బాధలను భరించలేని దేవతలు,నారదుడు ఇంద్రుడి వద్దకు వెళతారు. అప్పుడు పార్వతీశివుల కళ్యాణం అయితే వారికి జన్మించే పుత్రుడు తారకాసురుడిని చంపగలడని ఇంద్రుడు చెబుతాడు. అందరూ తొందరగా శివపార్వతుల కళ్యాణం కోసం ప్రయత్నం చేయమని ఇంద్రుడిని అభ్యర్థిస్తారు.
నారదుని సలహా మేరకు వెంటనే ఇంద్రుడు మన్మథుడిని పిలిచి శివుడి తపస్సు భంగపరిచి పార్వతీదేవిని శివుడికి దగ్గర చేయమని వారి కళ్యాణానికి పూనుకోమని ఆదేశిస్తాడు. శివుడి కోపాన్ని ఎరిగిన కామదేవుడు ముందు ఈ పనికి భయపడినా ఇంద్రుడి ఆజ్ఞ కనుక కాదనలేక సరేనంటాడు.తన మిత్రుడైన వసంతుడితో సహా బయలుదేరడానికి సిద్ధమవుతాడు.
శివుడి కోపం గురించి తెలిసిన మన్మథుడి భార్య రతీదేవి ఆపేందుకు ప్రయత్నిస్తుంది. కానీ మన్మథుడు వినిపించుకోడు. శివుడు తపస్సు చేసే ప్రాంతానికి వెళ్లి మన్మథుడు ఆయనపై పుష్పబాణాలు వేస్తాడు. ఆ బాణాల ప్రభావంతో శివుడు మోహపరవశం లోకి వెళతాడు.అప్పుడే పూజార్థమై వచ్చిన పార్వతీదేవిని చూసి మోహిస్తాడు.
కానీ వెంటనే తేరుకుని తన తపస్సు భంగపర్చింది ఎవరు అని ఆగ్రహంతో అన్ని దిక్కులా పరికించి చూడగా ఓ మూలన భయపడుతూ కనిపిస్తాడుమన్మథుడు. వెంటనే రుద్రుడై మూడోకన్ను తెరిచి కామదేవుడైన మన్మథుడిని భస్మం చేస్తాడు.ఆ కాముడు భస్మమైన రోజే ఫాల్గుణ శుద్ధ చతుర్దశి.
ప్రజలు ఆనాడే కామదహనం కార్యక్రమం జరుపుకుంటారు. తెల్లవారి హోళిపండుగగా , కాముని పున్నమిగా జరుపుకుంటారు. కాగా మరల దేవతలందరూ శివుణ్ణి ప్రార్థించగా తిరిగి మన్మథుడిని అనంగుడిగా మారుస్తాడు శివుడు. అప్పుడు అందరూ వసంతోత్సవం జరుపుకున్నారని అదే హోళీగా మారింది అంటారు.