Story of Glass Beach…
సాధారణంగా బీచ్‌లలో ఇసుక లేదా రాళ్లు ఉంటాయి. కానీ ఈ బీచ్ నిండా రంగు రంగుల గాజు ముక్కలే (గాజు రాళ్లు) కనిపిస్తాయి. ప్రకృతి తలచుకుంటే మనుషులు చేసిన తప్పును కూడా ఎంత అందంగా మార్చగలదో చెప్పడానికి ఈ బీచ్ ఒక గొప్ప ఉదాహరణ.ఆ బీచ్ పేరు గ్లాస్ బీచ్.
ఇది అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ‘ఫోర్ట్ బ్రాగ్’ (Fort Bragg) పట్టణానికి సమీపంలో ఉంది.ఇది మెన్డోసినో కౌంటీ (Mendocino County) పరిధిలో ఉన్న ‘మెకిరిచర్ స్టేట్ పార్క్’ (MacKerricher State Park) లో ఒక భాగంగా రక్షించబడుతోంది.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రమైన పసిఫిక్ మహాసముద్రం తీరాన ఉంది.. ఈ అందమైన గాజు రాళ్ల తీరాన్ని చూడటానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది అంతర్జాతీయ పర్యాటకులు అమెరికాకు వస్తుంటారు.
గాజు ముక్కలు ఎలా వచ్చాయంటే ?
20వ శతాబ్దంలో (1900-1960 మధ్య) స్థానిక ప్రజలు ఈ సముద్ర తీరాన్ని ఒక పెద్ద చెత్త కుప్పగా మార్చారు. ఇక్కడ టన్నుల కొద్దీ గాజు సీసాలు, పాత కార్లు, గృహోపకరణాల వ్యర్థాలను పారేసేవారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని మూసివేసి శుభ్రం చేసింది.
కానీ మిగిలిపోయిన మిలియన్ల కొద్దీ గాజు ముక్కలను సముద్రపు అలలు దశాబ్దాల తరబడి ముందుకు, వెనుకకు నెడుతూ, ఒకదానికొకటి రాసుకునేలా చేశాయి.దీనివల్ల ఆ గాజు ముక్కల పదునైన అంచులన్నీ పోయి, నునుపైన, గుండ్రని మెరిసే కలర్‌ఫుల్ గాజు రాళ్లుగా (Sea Glass) మారిపోయాయి.
ప్రస్తుతం ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. అయితే, ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఆ గాజు రాళ్లను జ్ఞాపికగా ఇంటికి తీసుకెళ్లడం చట్టరీత్యా నేరం. ఎలాంటి కఠినమైన తనిఖీలు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, గత కొన్ని దశాబ్దాలుగా పర్యాటకులు తమ జేబుల్లో, బ్యాగుల్లో దాచుకుని మిలియన్ల కొద్దీ గాజు రాళ్లను ఇంటికి పట్టుకెళ్లారు.
దీనివల్ల ప్రస్తుతం గ్లాస్ బీచ్‌లో పూర్వం ఉన్నంత రంగురంగుల గాజు రాళ్లు కనిపించడం లేదు, చాలా వరకు ఇసుక మాత్రమే మిగిలింది.మెకిరిచర్ స్టేట్ పార్క్’ రేంజర్లు ఆ ప్రాంతంలో అప్పుడప్పుడు సాధారణ రౌండ్లు (పెట్రోలింగ్) వేస్తుంటారు. ఒకవేళ ఎవరైనా పర్యాటకులు బకెట్లు లేదా బ్యాగులలో గాజు రాళ్లను నింపుకుంటూ రేంజర్ల కంటపడితే, వారు ఆ రాళ్లను స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తికి చట్టపరమైన నోటీసులు లేదా జరిమానా విధిస్తారు.
ఈ బీచ్‌ను సందర్శించడానికి వేసవి కాలం,ముఖ్యంగా మే నుండి సెప్టెంబర్ నెలల మధ్య కాలంలో అత్యధికంగా జనాలు వస్తుంటారు. ఈ సమయంలో అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం వల్ల పర్యాటకుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో ఎండలు బాగుండి, వర్షాలు పడవు. అందువల్ల అమెరికాలోని ఇతర రాష్ట్రాల నుండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులు ఇక్కడికి తరలివస్తారు.
నవంబర్ నుండి ఏప్రిల్ నెలలలో సాధారణ పర్యాటకులు తక్కువగా ఉన్నప్పటికీ.. సముద్రంలో హంప్‌బ్యాక్ తిమింగలాల వలసను చూడటానికి ప్రత్యేకంగా పర్యాటకులు వస్తుంటారు.శని, ఆదివారాలలో బీచ్ అంతా జనాలతో నిండిపోతుంది.అదండీ గ్లాస్ బీచ్ కథ.

