ఈ ‘మిస్టిక్ థ్రిల్లర్’ ఎలా ఉందంటే ?

Sharing is Caring...

Mystic Thriller……..

‘అగధ’ (Agadha) హారర్, మిస్టరీ థ్రిల్లర్ అంశాలతో కూడిన సినిమా ఇది. ఎమ్.ఎస్. రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కామాక్షి భాస్కర్ల, శ్రావణ్ రెడ్డి, ఉల్కా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14, 2026 న థియేటర్లలో విడుదలైంది.
 
కథాంశం ఏమిటంటే ?

మహాదేవి (కామాక్షి భాస్కర్ల) కి చిన్నప్పటి నుంచే దైవిక శక్తులు ఉంటాయి. ఆమె బాబాయ్ (భానుచందర్) కూతురు మహిమ (ఉల్కా గుప్తా) తన ప్రియుడు సింహా (శ్రావణ్ రెడ్డి)తో కలిసి ఒక నిషేధిత అడవిలోని మిస్టరీ గుహ రహస్యాన్ని ఛేదించడానికి వెళ్తుంది. అక్కడ గుహలోకి వెళ్లిన సింహా మాయమవుతాడు.వారి స్నేహితుడు దారుణంగా చనిపోతాడు.

తర్వాత మహిమ ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ ఇంట్లో వరుసగా వింత సంఘటనలు, మరణాలు జరుగుతుండటంతో మహాదేవి రంగంలోకి దిగుతుంది. ఆ కుటుంబాన్ని పీడిస్తున్న ఆ అతీంద్రియ శక్తి పేరే ‘అగధ’. అసలు అగధ ఎవరు? ఆ గుహలో ఏం జరిగింది? మహాదేవి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది? అనేదే మిగతా కథ.

‘పొలిమేర’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న కామాక్షి భాస్కర్ల మహాదేవి గా ఈ సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఈమె నటన సినిమాకే అతిపెద్ద బలం గా నిలిచింది. ఒక ఆధ్యాత్మిక శక్తి గల మహిళ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. భయం, సీరియస్‌నెస్, ఇంటెన్సిటీని ఆమె కళ్లతోనే బాగా పలికించింది .

దుష్టశక్తి ఆవహించిన వ్యక్తిగా శ్రావణ్ రెడ్డి నటించాడు. ఇదే పాత్ర సీనియర్ నటుడు చేస్తే వేరేలా ఉండేది. జోవికా పాత్ర సినిమాలో నెగటివ్, డార్క్ ఇంటెన్సిటీ ఉన్న రోల్‌లో చాలా సహజంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. మిగతా నటులు వారి పరిధి మేరకు నటించారు.

కేవలం సాధారణ దెయ్యం కథలా కాకుండా, మంత్రాలు, తంత్రాలు, ఒక రహస్య గుహ, 12 చేతులున్న ఒక వింత విగ్రహం చుట్టూ కథను తిప్పాలని ప్రయత్నించారు. ప్రారంభంలో ఉన్న ఉత్కంఠ తర్వాత క్రమంగా తగ్గిపోతుంది. కథ ముగింపు వైపు సాగుతున్న కొద్దీ ట్విస్ట్‌లు చాలా వరకు ప్రేక్షకులు ముందే ఊహించేలా సాధారణంగా మారిపోతాయి. నిడివి మరింత తగ్గిస్తే బాగుండేది. 

ద్వితీయార్థంలో కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా  కొన్నిసుదీర్ఘమైన సంభాషణలు, వివరణాత్మక సీన్లు సినిమా వేగాన్ని తగ్గించాయి. అతీంద్రియ శక్తులు, మంత్రాల బ్యాక్‌డ్రాప్ అయినప్పటికీ.. ప్రధాన పాత్రలు తీసుకునే కొన్ని నిర్ణయాలు, దెయ్యాల దాడికి సంబంధించిన కొన్ని సీన్లలో సరైన లాజిక్ కనిపించదు. విలన్ ను కాలయంత్రం లో బంధించడం బాగుంది. 

ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ బలంగా లేవు .. క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో తృప్తిని ఇవ్వదు. మైథాలజీని జోడించినా.. భయపెట్టేందుకు వాడిన కొన్ని జంప్ స్కేర్స్, సౌండ్ ఎఫెక్ట్స్ పాత హారర్ సినిమాలను గుర్తుకు తెస్తాయి.

మొత్తంగా చూస్తే, సరికొత్త పాయింట్ తీసుకున్నప్పటికీ … దాన్ని కథనంగా మార్చడంలో దర్శకుడు మరింత శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. కథపై సరైన కసరత్తు జరగలేదు అనిపిస్తుంది.సినిమాకు సంబంధించి మ్యూజిక్, కెమెరా పనితనం పెద్ద ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. కథలో కొన్ని లోపాలున్నప్పటికీ, సాంకేతికంగా ఈ రెండు విభాగాలు సినిమాను చాలా రిచ్‌గా మార్చాయి.

రాకేష్ వెంకటాపురం అందించిన నేపథ్య సంగీతం హారర్ సన్నివేశాలను చాలా బాగా ఎలివేట్ చేసింది. థియేటర్‌లో ప్రేక్షకులకు భయంకరమైన వాతావరణాన్ని కలిగించడంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది.
కాన్సెప్ట్‌కు తగ్గట్టుగా మంత్రాలు, తంత్రాల సీన్లలో వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ , బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ఇంటెన్సివ్‌గా సాగాయి.  

నాని చమిడిశెట్టి విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హారర్ మూడ్‌కు సరిపోయేలా అయన ఎంచుకున్న డార్క్ కలర్ థీమ్  లైటింగ్  బాగున్నాయి. నిషేధిత అడవి, చీకటి గుహ, వింత విగ్రహానికి సంబంధించిన సీన్లను కెమెరాలో భయానకంగా చూపించారు. ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో సినిమా లేదు.  

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!