చైనా.. తైవాన్ మధ్య లొల్లి ఏమిటి ?

Sharing is Caring...

China’s attempt to intimidate ………………………………. 

చైనా ఇటీవల కాలంలో తైవాన్ పై కయ్యానికి కాలు దువ్వుతోంది. అమెరికా తో తైవాన్ స్నేహం చేస్తోందని చైనా ఆక్రోశం వ్యక్తం చేస్తోంది.  తైవాన్ స్వయం పాలిత దేశంగా ఎదగడం చైనా కి  ఇష్టం లేదు. ఈ క్రమంలోనే చైనా తైవాన్ పై దాడులు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో  సరిహద్దులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.

కొన్నేళ్లుగా చైనా ,తైవాన్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు ఈ నాటివి కావు. స్వయంపాలిత దేశంగా తైవాన్ ఎదగడాన్ని చైనా సహించలేకపోతోంది. ఒకప్పుడు చైనా ఆధీనంలో ఉన్న తైవాన్  పలు పరిణామాల నేపథ్యంలో స్వయం పాలిత దేశంగా మారింది. ఈ మార్పు చైనాకు మింగుడు పడటం లేదు.

పదే పదే డ్రాగన్ కంట్రీ చైనా తైవాన్‌పై యుద్ధానికి సిద్ధమౌతోంది. ద్వీప దేశమైన తైవాన్  చుట్టూ పెద్ద ఎత్తున యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను మోహరింపజేస్తుంది . ఏ క్షణమైనా తైవాన్‌పై యుద్ధం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని  వార్తలను లీక్ చేస్తుంటుంది. చాలాకాలం నుంచి ఇదే జరుగుతోంది. ఇలా రెండు మూడు నెలలకోసారి చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. 

ఇటీవల కాలంలో తైవాన్  అమెరికాకు దగ్గరవుతోంది. ఆగస్ట్ 22 లో అప్పటి US హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఈ ద్వీపాన్ని సందర్శించిన తర్వాత తైవాన్ ..  చైనా మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి.పెలోసి పర్యటన “అత్యంత ప్రమాదకరమైనది” అని చైనా అప్పట్లోనే ప్రకటించింది. నాటి నుంచి చైనా తైవాన్ పై పట్టు బిగించాలని ప్రయత్నిస్తోంది.

కొద్దిరోజుల క్రితం కాలిఫోర్నియాలో  తైవాన్ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్-వెన్  యుఎస్ హౌస్ స్పీకర్ కెవిన్ మెక్‌ కార్తీ మధ్య జరిగిన సమావేశం తరువాత చైనా సైనిక బల ప్రదర్శనకు దిగింది. తైవాన్ చుట్టూ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను మోహరింప జేసింది.

చైనా స్వయంపాలిత తైవాన్‌ను విడిపోయిన ప్రావిన్స్‌గా చూస్తుంది, అది ఎప్పటికి  బీజింగ్ నియంత్రణలోనే ఉండాలని భావిస్తున్నది.  తైవాన్‌తో “పునరేకీకరణ” జరగాలని  దాన్ని సాధించడానికి సైనిక బలాన్ని ఉపయోగించడం లో తప్పేమి లేదనే భావనలో చైనా ఉంది.  

కానీ తైవాన్ తన సొంత  రాజ్యాంగం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకులతో పాలన సాగిస్తోంది. చైనా ప్రధాన భూభాగం నుండి తనను తాను భిన్నంగా చూసుకుంటుంది. ఇదే చైనా కు నచ్చడం లేదు. తైవాన్ నేతల సొంత వ్యవహార శైలిని  జీర్ణించుకోలేకపోతోంది.  

ఇక తైవాన్ ఆగ్నేయ చైనా తీరానికి దాదాపు 100 మైళ్ల దూరంలో ఉన్న ఒక ద్వీపం.ఇది US విదేశాంగ విధానానికి కీలకమైన US-స్నేహపూర్వక భూభాగాల జాబితా లో ఉన్న  “మొదటి ద్వీపం” .  తైవాన్‌ను స్వాధీనం చేసుకుంటే, పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో తన అధికారాన్ని ప్రొజెక్ట్ చేయడానికి అనువుగా ఉంటుందని చైనా భావిస్తున్నది.

అలాగే  గ్వామ్, హవాయి వరకు ఉన్న US సైనిక స్థావరాలను కూడా బెదిరించవచ్చని చైనా దూరాలోచన.ఇందుకోసమే చైనా తైవాన్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నదనే వాదన కూడా లేకపోలేదు. ఈ క్రమంలోనే అమెరికా తో స్నేహాన్ని చైనా వ్యతిరేకిస్తున్నది. కసితో రగిలిపోతోంది.

చరిత్రలోకి వెళ్లి చూస్తే….  17వ శతాబ్దంలో క్వింగ్ రాజవంశం  తైవాను ను పాలించింది . తర్వాత కొన్నాళ్ళు  పూర్తిగా చైనీస్ నియంత్రణలో ఉంది.  . ఆ తర్వాత  1895లో, మొదటి సైనో జపనీస్ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత చైనా ఈ ద్వీపాన్ని జపాన్‌కు అప్పగించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయిన తర్వాత 1945లో చైనా మళ్లీ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంది.

కానీ చైనా లో చియాంగ్ కై-షేక్ నేతృత్వంలోని జాతీయవాద ప్రభుత్వం … మావో జెడాంగ్ కమ్యూనిస్ట్ పార్టీ మధ్య అంతర్యుద్ధం చెలరేగింది.1949లో కమ్యూనిస్టులు గెలిచి బీజింగ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ క్రమంలో చియాంగ్ కై-షేక్,  మరికొందరు నేతలు  తైవాన్‌కు పారిపోయారు, అక్కడ వారు అనేక దశాబ్దాలు పాలించారు. వీరినే  కోమింటాంగ్ అని పిలుస్తారు.

 తైవాన్ మొదట్లో  చైనా ప్రావిన్స్ అని చెప్పడానికి చైనా ఈ చరిత్రను సూచిస్తుంది. అయితే 1911లో విప్లవం తర్వాత ఏర్పడిన ఆధునిక చైనీస్ రాజ్యంలో లేదా 1949లో మావో ఆధ్వర్యంలో ఏర్పాటైన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో తాము ఎప్పుడూ భాగం కాదని తైవాన్‌లు అదే చరిత్రను సూచిస్తుంటారు. ఈ వాదనతో చైనా ఏకీభవించదు.అదే అసలు తగాదా.
 
ప్రస్తుతం కేవలం 13 దేశాలు  తైవాన్‌ను సార్వభౌమ దేశంగా గుర్తించాయి. తైవాన్‌ను గుర్తించకూడదని లేదా గుర్తింపును సూచించే ఏ పని  చేయవద్దని చైనా ఇతర దేశాలపై  దౌత్యపరమైన ఒత్తిడిని తెస్తున్నది.  ఒక వేళ చైనా తైవాన్ పై యుద్ధానికి దిగితే  అమెరికా ఎంతవరకు మద్దతుగా నిలుస్తుందో సందేహమే అని కొందరు నిపుణులు చెబుతున్నారు.

అయితే గత ఏడాది ఒక సందర్భంలో తైవాన్కు అండగా నిలుస్తామని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ అన్నారు. ప్రస్తుతం అమెరికా తైవాన్ కు ఆయుధాలను విక్రయిస్తున్నది.  రష్యా ఉక్రెయిన్ పై దాడులకు దిగిన సందర్భం లో అమెరికా ఉక్రెయిన్ కి అండగా నిలిచింది.

అయితే డైరెక్టుగా రష్యా తో తలపడలేదు. అదేవిధంగా తైవాన్ కి సహాయం చేయవచ్చు అనే వాదన కూడా వినిపిస్తోంది. తైవాన్ పై  దాడి జరిగినప్పుడు తైవాన్‌ను ఎలా రక్షించుకోవాలో అనే అంశంపై అమెరికా దగ్గర ఇప్పటివరకు ఒక వ్యూహం ఉందా ?లేదా ? అనేది ఎవరికి తెలియదు.

ఇక తైవాన్ ను భయపెట్టేందుకు చైనా శతవిధాల ప్రయత్నం చేస్తోంది. తాజాగా చైనా నేవీ షిప్‌లను, ఫైటర్ జెట్‌లు, బాంబర్‌లతో సహా పెద్ద  యుద్ధ విమానాలను తైవాన్‌కు పంపింది.తమ దేశం వైపు చైనా ఫైటర్ జట్, యుద్ధ నౌకలు పంపినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  . తైవాన్ వైపు 38 విమానాలు, 9 నౌకలు వెళ్లాయని సమాచారం. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!