భాను’రేఖ’ లో కనిపించని కోణాలెన్నో ?

Sharing is Caring...

Sheik Sadiq Ali ……………………………………….

రేఖ …మన కళ్ళముందు కదలాడుతున్న ఒక అద్భుతం. గుండెల్లో దాచుకునేంత అపురూపం. ఒక ధీరోదాత్త నిజ జీవిత కథానాయిక. ఒక విప్లవం.ఒక తిరుగుబాటు. ఆమె జీవితం ఒక పాఠం. ఒక ఎగురుతున్న కెరటం. ఆమె ఒక విజేత .. కొన్ని విషయాల్లో ఎందరికో ఆదర్శం.

రేఖ జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన ఘటనకు ( ముకేష్ అగర్వాల్ తో పెళ్లి) ప్రత్యక్ష సాక్షిగా ఉన్న నేను రేఖ జీవన యానం గురించి ,ఆమె జీవన పోరాటాలు, విజయాల గురించి రాయటం సముచితంగా ఉంటుంది అని భావించి ఇది రాస్తున్నాను.

69  ఏళ్ళ వయసులోనూ ఇంత సౌందర్యంతో ,ఆత్మ విశ్వాసంతో విజేతగా జీవిస్తున్న రేఖ జీవితం పూలపాన్పు కాదు ….ఒక ముళ్ళబాటలో నడిచి వచ్చిన నందన వనం. 1954 అక్టోబర్ పదో తేదీన చెన్నైలో పుట్టింది. తల్లి మన తెలుగు నటి పుష్పవల్లి. తండ్రి సుప్రసిద్ధ తమిళ హీరో జెమినీ గణేషన్. అయితే అతను ఏనాడూ తన బిడ్డగా అంగీకరించలేదు.

దాంతో ఆమె మీద అక్రమ సంతానం అనే ముద్ర పడింది.అలాగే పెరిగింది కూడాను. తన పన్నెండో ఏట ,అంటే 1966 లో తెలుగు సినిమా రంగులరాట్నం తో బాలనటిగా రంగప్రవేశం చేసింది. తన పదిహేనో ఏట(69 లో) కన్నడ సినిమా ‘ఆపరేషన్ జాకపాట్ నెల్లి సీఐడీ 999’ తో హీరోయిన్ గా మారింది. అదే సంవత్సరం హిందీసీమ లోనూ ప్రవేశించింది.

5 అడుగుల 6 అంగుళాల ఎత్తులో ఉండే రేఖ నల్లగా ఉండటం తో అడుగడుగునా ఆమెను ‘నల్లపిల్ల ‘ (కాలీ) అని అవమానించేవారు. తోలి సినిమా బిశ్వజిత్ హీరోగా ‘అంజానా సఫర్’. దక్షినాది నుంచి రావటం,హిందీ రాకపోవటం తో బాలీవుడ్ ఆమె పట్ల అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించింది.

ఆ సినిమా హీరో,దర్శకుడు,కెమెరామన్ అందరూ కలిసి ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించారు. షూటింగ్ తొలిరోజే తోలి షాట్ లోనే,కెమెరా స్టార్ట్ అనగానే బిశ్వజిత్ ఆమెను గట్టిగా ఒడిసి పట్టుకొని పెదాలపై ముద్దు పెట్టుకోవటం మొదలెట్టాడు.

నిజానికి ఆ దృశ్యం గురించి ఆమెకు ముందుగా చెప్పలేదు.ఆమెకు తెలియదు. ఆమె షాకయ్యింది.భయంతో,బాధతో కళ్ళు మూసుకుంది. మూసిన కనురెప్పల మాటు నుంచి కన్నీరు ధారాపాతంగా కారుతూనే ఉంది. అయినా అతను వదల్లేదు.కెమెరా ఆగలేదు.దర్శకుడు కట్ చెప్పలేదు. ఆ పరాభవమే ఆమెలో కసి పెంచింది.పోరాటం నేర్పింది.

నల్లగా,మొరటుగా ,భాష తెలియని అమ్మాయిగా బాలివుడ్ లో అడుగుపెట్టిన రేఖ ఈనాడు పార్లమెంటును కలవర పరిచే సౌందర్య రాశిగా ఎదగడం వెనుక సుదీర్ఘ ప్రయాణం ఉంది.కఠోర జీవన విధానం ఉంది. ఆమె సిగరెట్,మద్యం జోలికి పోదు. శుద్ధ శాఖాహారి. ప్రతీరోజు క్రమం తప్పక యోగా చేస్తుంది. అవకాశం దొరికినప్పుడల్లా ధ్యానం చేస్తుంది.

పంక్చ్యువాలిటీ కి మారుపేరు. చెప్పిన సమయానికి నిమిషం ముందే ఉంటుంది తప్ప ఆలస్యంగా రాదు. వృత్తిపట్ల పూర్తిస్థాయి కమిట్ మెంట్ ఉన్న వ్యక్తిగా పరిశ్రమలో అందరూ చెప్పుకుంటారు. ఆమెకు ప్రత్యేకించి డ్రెస్ డిజైనర్లు ,హెయిర్ డ్రెస్సర్లు లేరు. అవి ఆమె స్వయంగానే చూసుకుంటుంది.

బిశ్వజిత్ తో చేదు  అనుభవం తర్వాత నవీన్ నిశ్చల్ తో జత కట్టింది. 1970 లో ఆమె హీరొయిన్ గా నటించిన తెలుగు సినిమా అమ్మకోసం,హిందీ సినిమా సావన్ భాదో విడుదలయ్యాయి.హిందీ సినిమా హిట్ అవడంతో అక్కడే సెటిల్ అయ్యింది.విజయాలు వరిస్తున్నా,ఆమెకు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి.

వాటిని ధైర్యంగా ఎదుర్కొంది.  .హిందీ అనర్గళంగా మాట్లాడటం నేర్చుకుంది. అది ఏ స్థాయిలో అంటే,తర్వాతి కాలంలో ప్రముఖ హిందీ హీరోయిన్లు నీతూ సింగ్,స్మితా పాటిల్ కు కూడా డబ్బింగ్ చెప్పేంత  స్పష్టంగా. సాధికారిక హిందీ నేర్చుకుంది. రెండు హిందీ పాటలు కూడా పాడింది. తర్వాతి కాలంలో సాజిద్ ఖాన్,జితేంద్ర,శత్రుఘ్న సిన్హా,అక్షయ్ కుమార్ వంటి వారితో ఆమెకు సంబంధాలు ఉన్నాయని రూమర్లు వచ్చాయి.  కానీ, వాటి నిజానిజాలు నిర్ధారించ లేము.

అమితాబ్ బచన్ ఆమె జీవితంలోకి రావటం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది.అప్పటికీ,ఇప్పటికీ ఆయనను దైవంగానే భావిస్తుంది. నా జీవితాన్ని మార్చి,పోరాటం నేర్పించి,బతకటం ఎలాగో నేర్పించింది ‘ఆయనే’ అని చాలాసార్లు చెప్పుకుంది.

వృత్తిరీత్యా పలుమార్లు ఆమెను సన్నిహితంగా కలిసే అవకాశం వచ్చింది. ఆమెలో ఒక గ్రేస్ కన్పిస్తుంది. హుందాతనం,పోరాడి గెలిచిన ఒక విజేత ముఖంలో కన్పించే వెలుగు ఆమెలో కన్పిస్తాయి.

మరో హిందీ హీరో వినోద్ మెహ్రా ను పెళ్లి చేసుకోవటం, అదేరోజు విడిపోవటం ఒక మిస్టరీనే. ఎందుకంటే ..వినోద్ అమితాబ్ కు అత్యంత సన్నిహితుడు,అనుచరుడు. రేఖ అమితాబ్ ప్రియురాలు. ఈ విషయాలు ఆ ముగ్గురికీ తెలుసు.

అయినా రేఖ,వినోద్ పెళ్లి చేసుకున్నారంటే అందులో ఉన్న మర్మం ఏమిటో రేఖ కానీ,అమితాబ్ కానీ చెప్పాల్సిందే.(వినోద్ మెహ్రా కొన్నేళ్ళ క్రితం మరణించాడు). ఆ తర్వాత డిల్లీ పారిశ్రామిక వేత్త ముకేష్ అగర్వాల్ ని తిరుపతిలో పెళ్లి చేసుకుంది.( దీనికి నేను ప్రత్యక్ష సాక్షిని). కొంతకాలానికి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఇప్పటికీ ముడివీడని రహస్యమే.

అమితాబ్-జయభాదురి-రేఖ ల ముక్కోణపు ప్రేమ జగద్విదితమే.  అమితాబ్ విషయంలో రేఖ, జయ మధ్య పెద్ద వార్ జరిగింది. ఈ వార్ లో అమితాబ్ ను తన సొంతం చేసుకుంది జయ. రేఖతో కలిసి అమితాబ్‌ సినిమాల్లో నటించకుండా జయా బచ్చన్‌ కట్టడి చేస్తే, ఆమెను రేఖ ఒక అవార్డు ఫంక్షన్‌లో టార్గెట్‌ చేసి బహిరంగంగా అవమానించింది..

వీరి ప్రేమకథనే  యశ్ చోప్రా ‘సిల్ సిలా’ అనే సినిమా కూడా తీశాడు. జయతో ఉన్న వివాదమే రేఖను రాజ్యసభ సభ్యురాలిని చేసింది అంటారు. అలాంటి రేఖ వయసు మీద పడినా కూడా అద్భుత సౌందర్య రాశిగా వెలిగిపోతూ  పార్లమెంటులో ఓటు వేయటానికి వచ్చినప్పుడు ఎంపీలు కన్నార్పకుండా చూడటం, ఆ ఫోటోలు మీడియాలో అప్పట్లో సంచలనం సృష్టించటం జరిగింది.

బాలీవుడ్ సినిమాల్లో తాను మంచి రేంజికి వచ్చిన తర్వాత ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తండ్రి యొక్క నిరాదరణ ఇప్పటికి  ద్వేషాన్ని కలిగిస్తోందని ఆమె చెప్పారు . రేఖ దాదాపు 200 చిత్రాలలో నటించింది. రేఖ గురించి  ప్రపంచానికి తెలిసినవి కొన్ని మాత్రమే. బయటకు రాని చీకటి కోణాలు చాలా ఉన్నాయంటారు.
అన్నట్లు రేఖ పూర్తీ పేరు చెప్పలేదు కదూ ……..భానురేఖ గణేశన్.  ఆమెకు  తెలుగు మాట్లాడడం  కూడా వచ్చు .

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!